Wednesday, October 3, 2012

మేఘసందేశం





కొద్ది రోజుల క్రితం, ఈనాడు సినిమాలో వచ్చిన 'ముప్పై సంవత్సరాల మేఘసందేశం' అన్న వార్త చదివిన తరువాత, ఫేస్ బుక్ లొ ఈ సినిమా గురించి ఒక చిన్న వ్యాఖ్య రాద్దమనుకున్నాను. కాని మొదలుపెట్టాక తెలిసింది, నాకు మట్టుకు ఈ సినిమా గురించి రాయాల్సింది చాలా ఉందని.

12 ఏళ్ళ వయసులో, మా అమ్మమ్మ వాళ్ళ ఊరైన రేణిగుంటలో తొలిసారి ఈ సినిమాని చూసాను. మొదట చూసినప్పుడు, కథలోని లోతు పూర్తిగా తెలియరాలేకపోయినా, ఈ సినిమాలోని కొన్ని పాత్రలు, అంశాలు మాత్రం నాపై చెరగని ముద్ర వేసాయి. టీనేజ్ లోకి అడుగుపెదుతున్న నాకూ, నా ఊహలకూ రెక్కలు తొడిగిన తొలి సినిమా మేఘసందేశం. తరువాత కొద్ది రోజులకి ఈ సినిమాని ఒకానొక ఆదివారం మద్యాహ్నం దూరదర్శన్ లో చూసాను. మొదటిసారి చూసినప్పుడు కలిగిన ఫీలింగ్స్ ఇంకాస్త గట్టి పడ్డాయి. ఆ తరువాత్తరువాత ఎన్నిసార్లు చూసానో లెక్కలేదు.

ఈ సినిమా నాకు చేసిన గొప్ప ఉపకారం, తెలుగు సాహిత్యాన్ని రొమాంటిసైజ్ చేసి పరిచయం చెయ్యడం. అప్పటివరకు చందమామ, బాలజ్యోతిలు చదివే నాకు, ప్రమోషన్ ఇప్పించి తెలుగు కవిత్వపు మాధుర్యాన్ని రుచి చూపించింది. సినిమా చూసిన వెంటనే నేను పావలా పెట్టి పాటల పుస్తకం కొన్నాను. దాదాపు మొదటి సంవత్సరం పూర్తిగా ఈ సినిమా పాటలకు ప్రతిపదార్ధాలు వెదకటమే నా హాబీ అయ్యింది. ఈ సినిమా పాటల పిచ్చి ఎంత తీవ్రమంటే, ఒక్క 'ఆకాశ దేశాన ' పాటపై మాత్రమే మూడు నెలలు గడిపాను. ఈ పాటలొ ఒకచోట 'కడిమి' అన్న పదప్రయోగముంది. మా ఊరి శాఖా గ్రంధాలయంలో వెతికితే, ఈ పదానికి నిఘంటువులలో దొరికిన అర్థము 'పరాక్రమము'. ఈ అర్థముతో ఈ పదము పాటలో నప్పదు. వెదకగా వెదకగా తెలిసింది చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 'కడిమి' అన్న మాండలికానికి 'గడ్డివామి' అనే అర్ధముందని. (వేటురి గారు ఏ అర్ధంతో ఈ పద్దన్ని ఉపయోగించారో, నాకిప్పటికీ సందేహమే!) ఈ సినిమా పాటలకి సంబందించి, ఇటువంటి అనుభవాలెన్నో నాకు. ఇంట్లొ అమ్మ కళ్ళు కప్పడానికి, ఈ సినిమా పాటల పుస్తకాన్ని నా పాఠ్యపుస్తకాల మధ్య పెట్టుకు తిరిగేవాడిని.

ఈ సినిమా చూసిన తరువాత, అక్కినేని నాగేశ్వరరావు నా అభిమాన నటుడైపోయాడు. ఆయన పోషించిన పాత్ర 'రవీంద్ర బాబు' నాకు ఆరాధ్యుడైపోయాడు. నా దృష్టిలో ప్రేమికులందరికీ 'రవీంద్ర బాబు' ఒక బెంచ్ మార్క్. ప్రేమలొ పడటం ఒక గొప్ప అదృష్టమైతే, భగ్నప్రేమికుడవడం మహా గోప్ప అదృష్టమనుకునేవాడిని. ఎందుకంటే, భగ్నప్రేమికులందరికీ కవిత్వం తన్నుకొచ్చేస్తుందనేది అప్పట్లో నా నిశ్చితాభిప్రాయం.

ఎప్పుడెప్పుడు పెద్దవాడినై ప్రేమలో పడదామా, ఆతరువాత భగ్నప్రేమికుడినై గడ్డం పెంచి, సముద్రపు ఒడ్డున తిరుగుతూ హృదయాలను పిండేసే ప్రేమకవిత్వాన్ని రాసిపడేద్దామని కోరికతో రగిలిపోయే వాడిని. 'ప్రియే చారుశీలే' పాటలో జయప్రద కళ్ళు, నృత్యం చేస్తున్నప్పుడు లయబద్దంగా ఊగే ఆమె జడ గుర్తుకొచ్చినప్పుడు మాత్రం, పెదాలపైకి ఒక చిరునవ్వు తన్నుకొచ్చేది. ఆ 'చిరునవ్వు ' కి అర్ధం 'ప్రేమ' అని తరువాత్తరువాత కాస్త పెద్దయ్యాక తెలిసొచ్చింది. ఆ తరువాత జయప్రదకు పెళ్ళైపోయిందని తెలిసొచ్చింది. శ్రీకాంత్ నహతాపై కోపం పొడుసుకొచ్చింది. తరువాత, జయప్రదని ప్రేమించడం కష్టమని తెలివొచ్చింది. కానీ, ఈ సినిమాపై పిచ్చి మాత్రం ఇంకా గట్టి పడింది.

ఆ తరువాత, ఇంకాస్త పెద్దయ్యాక, శ్రీశ్రీ మరియు తిలక్ కవిత్వపు హోరులో ఉక్కిరిబిక్కిరి అవుతూంటే నన్ను కాస్త పక్కకి లాగి, సేదతీర్చి, దేవులపల్లి కృష్ణశాస్త్రిని పరిచయం చేసింది ఈ సినిమానే. 'ముందు తెలిసెనా ప్రభూ..' పాటను వింటూ, మైమరచి, ఆ మాధుర్యపు రుచి మరిగి, ఇంకాస్త తవ్వితే ఆయన 'కృష్ణ పక్షం ' పరిచయమయ్యింది. అట్నుంచి టాగోర్ గీతాంజలి, తద్వారా చలం సాహిత్యం...ఈవిధంగా ఈ సినిమా నాకో దిక్సూచి అయ్యింది.

అయితే, ఇంతగొప్ప సినిమాకి సంబంధించిన ఒక్క నమ్మలేని నిజం మాత్రం నన్ను తొలుస్తూనేవుంటుంది... అదే, దాసరి నారాయణరావు నిజంగానే ఈ సినిమాకి డైరక్టరా? ఇంతగొప్ప సినిమ తీసిన వ్యక్తేనా పరమవీరచక్ర, అడవిచుక్క లాంటి సినిమాలు తియ్యగలిగింది? ఈ క్షీణత నాకు ఇప్పటికీ కొరుకుడు పడని విషయమే!