Friday, May 23, 2008

మా ఇంటి బుడుగు!


చిన్నప్పుడు బాలజ్యోతిలో బాపు గారి బుడుగు కార్టూన్లు చదివినప్పుడు వాటి లోతు తెలియ లేదు కానీ, ఇప్పుడు మా ఇంట్లోని బుడుగుతో వేగుతున్నప్పుడు, ఆ కార్టూన్లన్నీ మళ్ళీ జ్ఞప్తికొస్తున్నాయి!

ఈ ఫోటొలో ఉన్నవాడే మా ఇంటి బుడుగు. నాలుగున్నరేళ్ళకే అల్లర్లో బుడుగుకంటే రెండాకులు ఎక్కువే చదివాడు! మాటలు రావడం కాస్త ఆలస్యమయ్యి మొదట్లో మాకందరకి కొంచెం టెన్షన్ ఇచ్చాడు... ఇప్పుడేమో కామాలూ, పుల్ స్టాపులూ లేకుండా మాట్లాడుతూ, మా ఓపికకు పరీక్ష పెడుతున్నాడు. ఈ మధ్య మేము శ్రావణబెళగుళ (కర్నాటక) వెళ్ళాము. అక్కడ గోమటేశ్వరుడి విగ్రహం చూసి, మా వాడు గట్టిగా "డాడీ...ఈ జేజి చెడ్డీ ఎందుకు వేసుకోలేదు? షేం షేం అవ్వదా?" అని అరిచాడు. అంతే...క్యూ మొత్తం ఒక్కసారిగా ఘొల్లుమంది! ఆ తరువాత అక్కడ ఉన్నంత సేపు వాడి సందేహాలు తీర్చలేక, వాడి నోరు మూయించలేక మేము పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు!

వాడికి శలువులప్పుడు ఓ రోజు నాతోపాటు ఆఫీసుకొస్తానని మారాం చేస్తుంటే, మా బాసు కొడతాడని చెప్పి వాడిని సర్దిపుచ్చాను. అలాగే మా బాసుపై నేను వేసే జోకులు విన్నాడేమో కాని, వాడి మనసులో మా బాసుపైన ఒక భయంకరమైన ముద్ర ఏర్పడిపోయింది. ఈ విషయం గ్రహించని నేను, ముందు జాగ్రత్తలేవీ లేకుండానే ఒకసారి మా ఆఫీసుకు తీసుకెళ్ళాను.


చిన్న పిల్లాడు కదా అని మా బాసు వీడిని ముద్దు చేయబొతే, వీడేమో సీరియస్ గా మొహం పెట్టి, నావైపు తిరిగి "ఈయనేనా మీ బాసు? అయితే చేతిలో కర్ర లేదే?" అని అడిగాడు. ఒక్కసారిగా అవాక్కయి, అదృష్టవసాత్తూ మా బాసుకి తెలుగు రాకపోడంతో, ఏదో సర్ది చెప్పి అప్పటికి బయటపడ్డాను.

ఇలా మా బుడుగు గురుంచి రాయాలంటే చాలనే ఉన్నాయండీ... అన్నట్లు మా వాడి పేరు సాయి ప్రణద్.

Sunday, May 18, 2008

నిరీక్షణ

నా వెనుకే నువ్వున్నావని
నీ మూర్తి నా స్ఫూర్తి కాగా,
ఈ ప్రపంచాన్ని జయించి వెనుతిరిగితే,
ఏదీ కనపడవే.....? ఏమై పోయావు నువ్వు?

ఘనీభవించిన జీవితం,
సాయంకాలపు నీడల్లా నీ జ్ఞాపకాలు...,
రంగు వెలసిన కాగితంపూవు లాంటి నేను,
తోడుగా నువ్వు తిరిగి వస్తావన్న చిన్ని ఆశ,
ఇంకేమీ చేయలేను... నిన్ను ప్రేమిస్తూ ఉండడం తప్ప.

ఏనాడో నీలో కరిగిపోయిన నేనూ,
నాలో మాత్రమే ఉన్న నువ్వూ...,
ఇవేమీ పట్టని ఈ ప్రపంచం,
ఇంకేమి చేయగలను..... నిన్ను ప్రేమిస్తూ ఉండడం తప్ప.

నీ చిరునవ్వుల తొలకరి కోసం
చకోరమై ఉన్నా నేస్తం..

Sunday, May 4, 2008

సత్యం...శివం...సుందరం (చివరి భాగం)!

(ఏప్రిల్ 23, 2008 నాటి టపాకు తరువాయి భాగము)

తను చెప్పింది నాకు పూర్తిగా అర్ధమవ్వడానికా అన్నట్లు, ఒక్క క్షణంపాటు నిశ్శబ్ధం మా మధ్య.

"సరే, నువ్వుచెప్పినదాని ప్రకారం, నిన్ను, నీ సృష్టిని ప్రశ్నిచంకుండా, నిన్ను ప్రేమించాలి. అలా అయితే మరి మా పాత్ర ఏమిటి? నీనుంచి మేమేమి ఆశించాలి? మరి మనిషై పుట్టినతరువాత, రాగద్వేషాలకతీతంగా జీవించడం సాధ్యమేనా? ఇంత స్పష్టంగా కనబడుతున్న, నీ సృష్టిలోని అసమానతలను ఎలా స్వీకరించాలి? మా కష్టాలను ఎలా ఎదుర్కోవాలి? అసలు ఈ కష్టాలెందుకు? అవసరమైనప్పుడు, నీ నుంచి సహాయం ఆశించే ఆర్తులకు, అది లభించదెందుకు? ఎన్నో సార్లు నీనుంచి మాకు అసంతృప్తి మాత్రమే ఎదురవుతుందెందుకు?" నా మదిలో సుడులు తిరుగుతున్న ప్రశ్నల పరంపర. కానీ, ఏమడగాలో తెలియని అయోమయం. అసలు ప్రశ్నించే అవసరమే లేదన్నట్లు, సంభాషణ మళ్ళీ కొనసాగింది.

"నా గురించి,ఎంతోమంది ఆస్తికులు, మేధావులు ఎన్నో వాదోపవాదాలు,ఉపన్యాసాలు చేసారు. ఎన్నో అభిప్రాయాలు,వివరణలు ఇచ్చారు. ఎవరికి వారు, వాళ్ళ వాళ్ళ తెలివిని, తర్కాన్ని, ఇష్టాఇష్టాల్ని, ప్రేమను, భక్తిని ఉపయోగించి, వారికి నచ్చిన దేవుడ్ని సృష్టించేసారు. దేవుడంటే ఇలా ఉంటాడు అన్న అభిప్రాయనికొచ్చేసి, తదననునుగుణంగా నియమ నిబంధనలు ఏర్పరచి, ఎప్పుడైతే వారి అభిప్రాయలకు వ్యతిరేకంగా జరుగుతాయో, ఈ సృష్టినే సందేహించడం మొదలు పెడతారు. అసలు, నాయందు పూర్తి విశ్వాసమున్నవాడు, భయానికీ, భాదకీ, కోపానికీ లోను కాకూడదు. కానీ వీళ్ళందరూ ఏమవుతుందో అన్న భయంతో నన్ను విశ్వసిస్తున్నవారు. వీళ్ళ కంటే నాస్తికులే ఎంతో నయం. నాస్తికులకు, సమస్య ఎదురయ్యినపుడు పిర్యాదు చేయడానికి, వాళ్ళు సృష్టించుకున్న దేవుడుండదు కదా. జీవితాన్ని ఏ విధమయిన సందేహమూ లేకుండా గడిపేస్తారు. మీరు సృష్టించుకున్న దేవుడ్ని కాకుండా, మిమ్మల్ని సృష్టించిన దేవుడ్ని నమ్మిన నాడు, ఏ సమస్యా ఉండదు.

గులాబీ చుట్టూ ముళ్ళను కల్పించానని, నాకు కౄరత్వాన్ని అంటగడతారు. కానీ ఆముళ్ళు గులాబీరేకుల్ని గుచ్చడం ఏనాడైనా చూసావా? నిజానికి ఆ ముళ్ళే గులాబీని రక్షిస్తాయి".


తన చిరునవ్వు తో పాటు జాలువారే ప్రేమరస కౌముది, నన్ను ముచెత్తుతోంది. తన మాటల ద్వారా ఒకరకమైన స్వాంతన, నమ్మిక కలుగుతున్నాయి..

"సృష్టిలో ఇన్ని అసమానతలెందుకు అన్నది నీ ముఖ్యమైన ప్రశ్న. నీకు పైన కనిపిస్తోన్న ఈ అసమానతలే, సృష్టియొక్క సమానతకు ఆయువుపట్టు. ప్రతీ ఒక్కరూ ధనవంతులైతే, మరి చిన్న చిన్న పనులెవరు చేస్తారు? నేల యొక్క ఎత్తుపల్లాలే కదా నదీ గమనాన్ని నిర్దేశించేది?

ఈ అసమానతలను, అసంపూర్ణత్వాన్నీ ఎప్పుడూ మీవైపునుంచే అన్వయిస్తారు. ఇంకో చిన్న ఉదాహరణ. ఈ సమస్తాన్నీ సృష్టించినది నేనైనపుడు, ఈ సృష్టిలో ప్రతీ జీవినీ సమానంగా ప్రేమిస్తాను కదా? మరైతే, మీ ఆనందాల కోసం, విలాసాల కోసం, ఇతర జీవుల్ని హింసిస్తారెందుకు? ఆ సమానత్వాన్ని ఇక్కడెందుకు అన్వయించరు? ఎందుకంటే, మీకు ఈ సృష్టిలో ఒక ప్రతేకతను మీరే ఆపాదించుకొని,సృష్టిలో మీరుకూడా ఒక భాగమేనని మరచిపోతారు కాబట్టి".


"మరి నీ సృష్టిలో ద్వందాలెందుకు?" నా ప్రశ్న సూటిగా వెలువడింది.

"ఏదైనా ప్రమాదం జరిగినప్పుడో, వైపరీత్యం సంభవించినపుడో, ప్రతి ఒక్కరూ ఈ సృష్టిని ప్రశ్నిస్తారు. తమకేమైనా కష్టం కలిగినప్పుడు, ఎందుకు దేవుడా నాకీ కష్టం, నేనేమి తప్పు చేసానని నాకీ కష్టం అని నిలదీస్తారు. మరి, ఒక్కసారి గుర్తు తెచ్చుకో - ఎప్పుడైనా నీకు నచ్చిన విషయం జరిగి, నీకు అమితంగా ఆనందం కలిగినప్పుడు, నాకెందుకింత ఆనందం? నేనేమి చేసానని ఇంత ఆనందాన్నిచ్చావు? అని ఏనాడైనా ప్రశ్నించావా? లేదు. ఎందుకంటే, మీరు జీవితాన్ని ఎప్పుడూ మీ వైపునుంచే చూస్తారు. చిన్న చిన్న పిట్టలను ఎప్పుడైనా గమనించావా? అవి, ఎంతో శ్రమకోర్చి కట్టుకున్న గూడు, వాటిలోని గుడ్లతో సహా, ఏ ప్రకృతి వైపరీత్యం వల్లనో, వేరే జీవి దుశ్చర్య వల్లనో నాశనం గావింపబడితే,అవి తమ తలరాతను తిడుతూ కూర్చోవు. మళ్ళీ మొదటినుంచీ ఇంకో గూడు కట్టడం మొదలు పెడతాయి. ప్రకృతిలోని ద్వందాలను సహజసిద్దంగా స్వీకరిస్తాయి. అలాగే, సృష్టిలో అంతర్భాగమైన ద్వందాలను నువ్వెందుకు అంగీకరించడం లేదు.

శాస్త్రపరంగా సమన్వయ లక్షణ భరితమైన ఈ సౌరకుటుంబం, ఖగోళ శాస్త్ర విరచితమైన ఈ నక్షత్రాలూ, ఈ భూమి, ఋతువులూ, విలక్షణ భరితమైన ప్రాణకోటి, ప్రాణులన్నిటిలోకి తలమానికమైన మానవుడూ - ఇవన్నీ నైపుణ్యం లేని హస్తం నుంచి వచ్చి ఉండవు; అందువలన ఈ సృష్టి అన్యధా ఉండడానికి వీలు లేదు అన్న సత్యాన్ని నీవెందుకు గ్రహించడం లేదు? తుఫాన్లనుంచి కాక, తుఫాన్లమధ్య నిన్ను రక్షించడానికి సిద్దంగా ఉన్న నన్నెందుకు నువ్వు గుర్తించడం లేదు?

ఇందాక నేను చెప్పినట్లు, నీ రెండేళ్ళ చిన్నారికీ, నీకూ తేడా ఏమిటంటే, నీ చిన్నారికి అమ్మ మాత్రమే తెలుసు. అమ్మగురించి తెలియదు, తెలుసుకోవాలని ప్రయత్నించదు.

ఏదైతే మార్పుకి వీలు లేని, దైవనిర్ణయమై నిక్షిప్తమై ఉన్నదో, నీ జీవితంలో ప్రతి సంఘటనా దాని ప్రక్షిప్త ప్రకటన. మానసిక స్తిరత్వాన్ని పునర్ జాగృతం చేసి, ధైర్యాన్ని కూడదీసుకుని ముందుకు సాగిపో".


"చివరిగా నాదింకో ప్రశ్న. ఎంతో మంది తమ జీవిత కాలాన్ని వెచ్చించినా కలగని నీ దర్శన భాగ్యాన్ని నాకెందుకు కల్పించావు?" నా గొంతులో ఇందాకటి సంఘర్షణ లేదు. దాని స్తానే నా గొంతులో ప్రశాంతత, స్పష్టత,విశ్వాసం.

"మృత్యువును కొద్ది క్షణాల తేడాతొ తప్పించుకున్నపుడు, నీ తొలి ప్రతిచర్య ఆనందం కాదు..... అంతమంది చనిపోయారన్న విషాదం. ఆ చర్యే మన సంభాషణకు హేతువు".

**** **** *****

"ఇదుగో కాఫీ, లేవండి. రాత్రంతా ఒకటే కలవరింతలు. రెండు రోజులు శలవు పెట్టండి. గాలి మార్పుకు ఎటైనా వెళ్ళి వద్దాం", మా ఆవిడ పిలుపుతో ఉలిక్కిపడి నిద్ర లేచాను.