Friday, May 23, 2008

మా ఇంటి బుడుగు!


చిన్నప్పుడు బాలజ్యోతిలో బాపు గారి బుడుగు కార్టూన్లు చదివినప్పుడు వాటి లోతు తెలియ లేదు కానీ, ఇప్పుడు మా ఇంట్లోని బుడుగుతో వేగుతున్నప్పుడు, ఆ కార్టూన్లన్నీ మళ్ళీ జ్ఞప్తికొస్తున్నాయి!

ఈ ఫోటొలో ఉన్నవాడే మా ఇంటి బుడుగు. నాలుగున్నరేళ్ళకే అల్లర్లో బుడుగుకంటే రెండాకులు ఎక్కువే చదివాడు! మాటలు రావడం కాస్త ఆలస్యమయ్యి మొదట్లో మాకందరకి కొంచెం టెన్షన్ ఇచ్చాడు... ఇప్పుడేమో కామాలూ, పుల్ స్టాపులూ లేకుండా మాట్లాడుతూ, మా ఓపికకు పరీక్ష పెడుతున్నాడు. ఈ మధ్య మేము శ్రావణబెళగుళ (కర్నాటక) వెళ్ళాము. అక్కడ గోమటేశ్వరుడి విగ్రహం చూసి, మా వాడు గట్టిగా "డాడీ...ఈ జేజి చెడ్డీ ఎందుకు వేసుకోలేదు? షేం షేం అవ్వదా?" అని అరిచాడు. అంతే...క్యూ మొత్తం ఒక్కసారిగా ఘొల్లుమంది! ఆ తరువాత అక్కడ ఉన్నంత సేపు వాడి సందేహాలు తీర్చలేక, వాడి నోరు మూయించలేక మేము పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు!

వాడికి శలువులప్పుడు ఓ రోజు నాతోపాటు ఆఫీసుకొస్తానని మారాం చేస్తుంటే, మా బాసు కొడతాడని చెప్పి వాడిని సర్దిపుచ్చాను. అలాగే మా బాసుపై నేను వేసే జోకులు విన్నాడేమో కాని, వాడి మనసులో మా బాసుపైన ఒక భయంకరమైన ముద్ర ఏర్పడిపోయింది. ఈ విషయం గ్రహించని నేను, ముందు జాగ్రత్తలేవీ లేకుండానే ఒకసారి మా ఆఫీసుకు తీసుకెళ్ళాను.


చిన్న పిల్లాడు కదా అని మా బాసు వీడిని ముద్దు చేయబొతే, వీడేమో సీరియస్ గా మొహం పెట్టి, నావైపు తిరిగి "ఈయనేనా మీ బాసు? అయితే చేతిలో కర్ర లేదే?" అని అడిగాడు. ఒక్కసారిగా అవాక్కయి, అదృష్టవసాత్తూ మా బాసుకి తెలుగు రాకపోడంతో, ఏదో సర్ది చెప్పి అప్పటికి బయటపడ్డాను.

ఇలా మా బుడుగు గురుంచి రాయాలంటే చాలనే ఉన్నాయండీ... అన్నట్లు మా వాడి పేరు సాయి ప్రణద్.

2 comments:

జ్యోతి said...

అందుకే మరి ఈరోజుల్లో చిన్న పిల్లల ముందు మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మనకంటే తెలివి మీరిపోతున్నారు.

VENKAT SEETHA said...

చూడండి గిరీష్ గారు,
ఇలాంటి బుడుగులు ఇంటికొకరు ఉంటారు,ఇప్పుడు అల్లరి చేయకపోతె ఎప్పుడు చేస్తారు,
భరించాలండి తప్పదు. మీ బుడుగు కు మా అభినందనలు,మీ బుడుగు గురించి ఇలాగే వ్రాస్తూండండి