Sunday, August 23, 2009

అమ్మకు అశ్రునివాళి!



'అమ్మ ' పదానికి నిండు అర్ధం
మానవత్వపు నిలువటద్దం,
మంచితనానికి మనిషి రూపం,
నా జన్మజన్మల అదృష్టం
నీ ఋణం ఎలా తీర్చుకోను?

పీడకలకు బెదిరిపోయి
నిద్రలేచి ఏడుస్తుంటే,
గుండెకదుముకొని జోలపాడి
ఊరడించిన నిండు పున్నమి
నీ ఋణం ఎలా తీర్చుకోను?

కష్టాల చీకటిలో చిక్కుకొని
దిక్కుతోచక నిలచిపోతే,
వెలుగుదివ్వెగ మారి నాకు
దారి చూపి కరిగిపోయిన వెన్నెలమ్మా,
నీ ఋణం ఎలా తీర్చుకోను?

అలసటెరుగని బ్రతుకుపోరులో
బాధనంతా తొక్కిపెట్టి,
నవ్వు మాత్రం మాకుపంచి
నువ్వేమో మాయమైతివి, మాతృమూర్తీ,
నీ ఋణం ఎలా తీర్చుకోను?

రెక్కలొచ్చిన బిడ్డ ఎగిరిపోతే,
మధ్య పెరిగిన దూరాన్ని మరచి,
బిడ్డ ఎగిరిన ఎత్తు చూసి
మురిసిపోయిన పిచ్చితల్లీ,
నీ ఋణం ఎలా తీర్చుకోను?

గోడమీద వాలిన కాకి అరిస్తే,
బిడ్డ వస్తాడన్న ఆశ,
వీలు పడక రాలేదని
సర్దిచెప్పుకున్న వెర్రితల్లీ,
నీ ఋణం ఎలా తీర్చుకోను?

నుదిటి మీద వెచ్చని ముద్దు,
నువ్వు పెట్టిన గోరుముద్ద,
నిద్రపుచ్చిన పిట్టకథలు,
నాకుమిగిలిన తీపిగురుతులు.
అమ్మా, నీ ఋణం ఎలా తీర్చుకోను?

నా ఎదుగుదలకు పునాదివి,
గుండెనిండా స్థైర్యానివి,
బ్రతుకుబాటన మార్గదర్శివి,
ప్రాణమిచ్చిన పసిడిముద్దా,
నీ ఋణం ఎలా తీర్చుకోను?

కళ్ళముందే పువ్వులా
నువ్వు కరిగిపోతుంటే,
నెలరోజుల పోరాటం
నిన్ను నిలుపలేకపోతుంటే,
వెక్కిరించిన నిస్సహాయత...
అమ్మప్రేమకు నోచుకోని
కన్నుకుట్టిన దేవుడు,
స్వర్గానికి నిన్ను
పిలుచుకెళ్ళాడు కాబోలు...

గుండెనిండా తీపిగురుతులు,
తోడుగా ముప్పైఅయిదేళ్ళ అనుబంధం,
ఉబికివచ్చే కన్నీళ్ళు,
ఇవి మాత్రమే మిగుల్చుకున్న అసక్తుణ్ణి!

అందనంత ఎత్తులో ఉన్న నిన్ను
అక్షరాలలో ఆవిష్కరించాలన్న
నా వృధా ప్రయత్నం,
నీవు నేర్పిన మాటలే
గుండెగొంతున కొట్టుకుంటూ,
కన్నీరుగా మారి
మసకబారిన చూపు..
నిశ్శబ్ధంగా రోదించడం తప్ప
ఏమీ చెయ్యలేని అసక్తుణ్ణి!
నన్ను మన్నించు అమ్మా...అసక్తుణ్ణి నేను.


(నెలరోజులపాటూ మణిపాల్ హాస్పిటల్లో సాగించిన పోరాటం వృధా అయ్యి, నిస్సహాయుణ్ణై నేను చూస్తుండగానే, జూలై పంతొమ్మిదిన, యాభై ఏడేళ్ళ వయసుకే ఇక శలవంటూ వెళ్ళిపోయిన అమ్మకు స్మృత్యంజలి - గిరీష్.)