అమావాస్య రాత్రిని నిందించలేను, దాని గర్భంలో దాగిన సహస్రకిరణపిండం కోసం ప్రతిక్షణం నా ప్రతీక్షణం - సినారె
Sunday, August 23, 2009
అమ్మకు అశ్రునివాళి!
'అమ్మ ' పదానికి నిండు అర్ధం
మానవత్వపు నిలువటద్దం,
మంచితనానికి మనిషి రూపం,
నా జన్మజన్మల అదృష్టం
నీ ఋణం ఎలా తీర్చుకోను?
పీడకలకు బెదిరిపోయి
నిద్రలేచి ఏడుస్తుంటే,
గుండెకదుముకొని జోలపాడి
ఊరడించిన నిండు పున్నమి
నీ ఋణం ఎలా తీర్చుకోను?
కష్టాల చీకటిలో చిక్కుకొని
దిక్కుతోచక నిలచిపోతే,
వెలుగుదివ్వెగ మారి నాకు
దారి చూపి కరిగిపోయిన వెన్నెలమ్మా,
నీ ఋణం ఎలా తీర్చుకోను?
అలసటెరుగని బ్రతుకుపోరులో
బాధనంతా తొక్కిపెట్టి,
నవ్వు మాత్రం మాకుపంచి
నువ్వేమో మాయమైతివి, మాతృమూర్తీ,
నీ ఋణం ఎలా తీర్చుకోను?
రెక్కలొచ్చిన బిడ్డ ఎగిరిపోతే,
మధ్య పెరిగిన దూరాన్ని మరచి,
బిడ్డ ఎగిరిన ఎత్తు చూసి
మురిసిపోయిన పిచ్చితల్లీ,
నీ ఋణం ఎలా తీర్చుకోను?
గోడమీద వాలిన కాకి అరిస్తే,
బిడ్డ వస్తాడన్న ఆశ,
వీలు పడక రాలేదని
సర్దిచెప్పుకున్న వెర్రితల్లీ,
నీ ఋణం ఎలా తీర్చుకోను?
నుదిటి మీద వెచ్చని ముద్దు,
నువ్వు పెట్టిన గోరుముద్ద,
నిద్రపుచ్చిన పిట్టకథలు,
నాకుమిగిలిన తీపిగురుతులు.
అమ్మా, నీ ఋణం ఎలా తీర్చుకోను?
నా ఎదుగుదలకు పునాదివి,
గుండెనిండా స్థైర్యానివి,
బ్రతుకుబాటన మార్గదర్శివి,
ప్రాణమిచ్చిన పసిడిముద్దా,
నీ ఋణం ఎలా తీర్చుకోను?
కళ్ళముందే పువ్వులా
నువ్వు కరిగిపోతుంటే,
నెలరోజుల పోరాటం
నిన్ను నిలుపలేకపోతుంటే,
వెక్కిరించిన నిస్సహాయత...
అమ్మప్రేమకు నోచుకోని
కన్నుకుట్టిన దేవుడు,
స్వర్గానికి నిన్ను
పిలుచుకెళ్ళాడు కాబోలు...
గుండెనిండా తీపిగురుతులు,
తోడుగా ముప్పైఅయిదేళ్ళ అనుబంధం,
ఉబికివచ్చే కన్నీళ్ళు,
ఇవి మాత్రమే మిగుల్చుకున్న అసక్తుణ్ణి!
అందనంత ఎత్తులో ఉన్న నిన్ను
అక్షరాలలో ఆవిష్కరించాలన్న
నా వృధా ప్రయత్నం,
నీవు నేర్పిన మాటలే
గుండెగొంతున కొట్టుకుంటూ,
కన్నీరుగా మారి
మసకబారిన చూపు..
నిశ్శబ్ధంగా రోదించడం తప్ప
ఏమీ చెయ్యలేని అసక్తుణ్ణి!
నన్ను మన్నించు అమ్మా...అసక్తుణ్ణి నేను.
(నెలరోజులపాటూ మణిపాల్ హాస్పిటల్లో సాగించిన పోరాటం వృధా అయ్యి, నిస్సహాయుణ్ణై నేను చూస్తుండగానే, జూలై పంతొమ్మిదిన, యాభై ఏడేళ్ళ వయసుకే ఇక శలవంటూ వెళ్ళిపోయిన అమ్మకు స్మృత్యంజలి - గిరీష్.)
Subscribe to:
Post Comments (Atom)
13 comments:
గిరీష్ గారు,
చాలా బాధగా ఉంది.
మీ అమ్మగారి ఆత్మకు శాంతి కలగాలని మనసారా ఆ దేవుని ప్రార్దిస్తున్నాను..
I too feel your pain.
57 is too young!!!
Please see this and this
మనిషి జీవితంలోని అత్యంత బాధాకరమైన రోజు అమ్మ మరణం.అమ్మగారి ఆత్మకు శాంతిని ప్రసాదించమని ఆభగవంతుని ప్రార్థిస్తున్నాను.
మీ అమ్మగారి ఆత్మకు శాంతిని ప్రసాదించమని ఆభగవంతుని ప్రార్థిస్తున్నాను.
అయ్యో 57 అంటే చిన్న వయస్సే. మీ మనస్సు నిండా ఆమె ఉన్నారు. ఓ తల్లికి ఇంతకన్న గొప్ప నివాళి ఏముంటుంది చెప్పండి.
అసలు మనకంటూ ఏదైనా ఉంటే అదంతా అమ్మ, నాన్న, దేవుడు ఇచ్చిందే కదా.
మీ అమ్మగారి ఆత్మకు శాంతి కలగాలని మనసారా ఆ దేవుని ప్రార్దిస్తున్నాను.
ఈ విపత్కాల పరిస్థితినుంచి మీరు త్వరగా కోలుకోవాలని ఆ దేవుని ప్రార్ధిస్తూ..
It moved me a lot. Hope you recover from your anguish at the earliest
గిరీష్, మీ ప్రొఫైల్లో "నామరూప రహితుడైన పరమాత్మే నా తల్లి రూపాన తన చేతుల్లోకి తీసుకున్నాడనీ... -"గీతాంజలి (చలం)"." వ్రాసుకోవటాన్ని బట్టి మీ తల్లి, దైవం పట్ల మీ అభిప్రాయం చెప్పకనే చెప్పారు. 6సం. క్రితం మా అమ్మ గారు నన్ను బౌతికంగా వదిలిపోయారు, కానీ మానసికంగా చేరువైపోయారు. పిచ్చి, వెఱ్ఱి అని కొందరన్నా కాని నేను నిత్యం మనసులోనో, కలలోనో, యోచనలోనో సంభాషిస్తూనేవుంటాను. అదెంతో సాంత్వన కలిగిస్తుంది. మీ అమ్మ గారు ఎటూ వెళ్ళరు, మీతోనే మీలోనే సజీవంగా వుంటారు. లేదా ఈ గొంగళి పురుగు జీవితం నుండి రంగు రంగుల సీతాకోకచిలుకలా మనకు తెలియని లోకాల్లో విహరిస్తూవుంటారు.
"కష్ట సమయాల్లో అక్కునచేర్చే
అమృతతత్వ అస్థిత్వ రూపం, అమ్మ
వీడిపోయినా, వెన్నంటే ఉంటుంది !!"
ఆ భావన మీకు తృప్తినిస్తుందని ఆశిస్తున్నాను.
ఇంత మీకు చెప్పినా కూడా మనసులో వేదన - అమ్మని మరుస్తాం, ఆత్మీయుల్ని ఏమారుస్తాం ఈ బ్రతుకు బండి లాగడానికి. ఇంకా ఎన్నో చేస్తాం, పాడు దేముడు ముందుగానే నుదిటి వ్రాత ఇలా రాసివుంచాడు. ఇక్కడా మరొకరికి అంటగట్టాలనే మన ప్రయాస.
చాలా చాలా గుండె కోతగావుంది. నాకు తెలియని ఎక్కడికో ఇంక రామని నను వదిలివెళ్ళినవారంతా నా కంటి నీటి తీర్థం పుచ్చుకోను తిరిగి వచ్చారులా వుంది. మీ భావాలు చదివే భాగ్యం కలిగించినందుకు కృతజ్ఞతలు.
గిరీష్ గారు, మొన్న జనవరి లో ఆ గుండెకోతని అనుభవించిన నాకు తెలుసండీ మీరు పడే బాధ ఎలాటిదో.. అమ్మ గారి అత్మకు శాంతి చేకూరాలని, మీ మనసు స్వాంతన పొంది త్వరలో కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
స్పందించి సానుభూతిని తెలియచేసిన సహృదయులందరికీ ధన్యవాదాలు.
my deepest condolences
మానవ సంబంధాలలో అత్యంత బలీయమైన బంధం తల్లితో తప్ప వేరొకరితో ఉండదు. అందుకే మాతృదేవోభవ.....అని మొదలవుతుంది. ఆ బంధం తెగినపుడు, ఆ వేదన ఓదార్చలేనిది. వారి ఆత్మకి ప్రశాంతత ఆ భగవంతుడు చేకూర్చాలని కోరుకుంటున్నాను..
Post a Comment