అమ్మా!
హ్యాపీ బర్థ్ డే! ఈ రోజు 'మదర్స్ డే'. అందుకే, నీకు హ్యపీ బర్థ్ డే తో పాటుగా, 'హ్యాపీ మదర్స్ డే' కూడా...!
ప్రతి సంవత్సరమూ ఇదే రోజు, పొద్దున్నే ఈ మాటలు నీకు ఫోన్ చేసి చెప్పేవాడిని. కానీ ఈసారి, అలా చెప్పడానికి నువ్వు లేవు. అందుకే, నీకు రాస్తున్నట్లు నాకు నేను ఈ ఉత్తరం రాసుకుంటున్నాను.
నీకిలా ఉత్తరం రాస్తుంటే, చిన్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు, మనం రాసుకున్న ఉత్తరాలు గుర్తుకొస్తున్నాయి.
ఎవరో అన్నట్లు, మరణాన్ని పూర్తిగా అర్ధం చేసుకోవాలంటే అది మనకు అత్యంత ఆప్తులను కబళించాలి. ఎంత నిజం! కానీ, నువ్వు గమనిచావో లేదో, మరణం మనిద్దరినీ భౌతికంగా దూరం చేసిందేమో కానీ, ఇప్పుడు మనం మానసికంగా ఎంతో దగ్గరయ్యాం. ఇంతకముందు, నీతో మాట్లాడాలంటే, నీకు ఫోన్ చెయ్యాల్సొచ్చేది. ఇప్పుడు ఆ అవసరం లేదు. నాతో నేను మాట్లాడుకుంటే చాలు, నీతో మాట్లాడినట్లే.
ఆరోజు నాకింకా గుర్తుంది. కోల్పోవడానికి కూడా ఏమీ మిగలని పరిస్థితులలో, భుజాలపై ఇద్దరు పిల్లల బాధ్యత, భవిష్యత్తుపై ఆశ, గుండెనిండా ధైర్యము, జీవితంలో గెలవాలన్న పట్టుదల... కేవలం ఇవి మాత్రమే ఆలంబనగా, ఇరవైయ్యారు సంవత్సరాల క్రితం అంగన్ వాడి టీచర్ గా నువ్వు ఉద్యోగంలో చేరడం నాకింకా గుర్తుంది. ఏడుగురు తోబుట్టువులున్నా, ఎవ్వరినీ ఏమీ అర్ధించక, నీ ఆత్మాభిమానాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ, కష్టాలన్నిటినీ చిరునవ్వుమాటున దాచిపెట్టి, మమ్మల్ని పెంచి పెద్దచేసిన తీరు నేనెలా మరచిపోగలను చెప్పు.
ఇంకో విషయం గుర్తుందా నీకు? అప్పట్లో మనింట్లో ఒక రూల్ ఉండేది. రోజంతా ఎక్కడ తిరిగినా, రాత్రి భోజనం మాత్రం ముగ్గురమూ కలసే చేసేవాళ్ళం. నవ్వుకుంటూ సరదాగా కబుర్లుచెప్పుకుంటూ, వర్తమానాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తూ, భవిష్యత్తును కలల్లో ఆవిష్కరించుకుంటూ, తృప్తిగా భోంచేసేవాళ్ళం. ఈ పద్దతిని, నా ఇంట్లో పాటించాలని ఎంత ప్రయత్నిస్తున్నా కుదరటం లేదు. నేనింటికొచ్చేటప్పటికి, తొమ్మిది దాటిపోతుంది. ఒక్కోసారి, ఆ టైముకి పన్నుగాడు నిద్రలో ఉంటాడు. అప్పుడు చాలీచాలని కూరలూ, పచ్చడి మెతుకులే అయినా ఎంతో తృప్తిగా కడుపుతో పాటూ, మనసు కూడా నిండిపోయేది. ప్చ్... అరోగ్యం కోసం తినే ఆ రెండు పుల్కాలతో ఇప్పుడు కడుపూ, మనసూ రెండూ నిండట్లేదు.
మనిద్దరమూ ఇంత క్లోజ్ గా ఉండడం చూసి, ఊళ్ళో అందరూ అడిగేవారు... తల్లీ కొడుకులు ఫ్రెండ్స్ లా ఉండడం ఎలా సాధ్యం అని? నాకెంత గర్వంగా ఉండేదో! నాకు చిన్నప్పుడు ఇన్ని కష్టాలనిచ్చినందుకు దేవుడిపై ఎప్పుడూ నిష్టూరపడలేదు...ఎందుకంటే, ఆకష్టాలకు మారుగా నీ లాంటి అమ్మనిచ్చాడు. ఇంకేమి కావాలిచెప్పు నాకు. నిన్నింత తొందరగా నానుంచి తీసుకెళ్ళాడని, ఇప్పుడుకూడా దేవుడిపై నాకు కోపం లేదు. ఎందుకంటె, నాకు నువ్విచ్చిన గొప్ప ఆస్తి - ప్రశ్నిచకుండా జీవితాన్ని అనుభవించే విద్య.
అన్ని కష్టాలతో నిండిన జీవితాన్ని ఎంత హుందాగా అంగీకరించావో, అంతే హుందాగా మరణాన్ని కూడా హత్తుకున్న తీరు నాకు రెండు గొప్ప పాఠాల్ని నేర్పింది. ఆరోజు ఐసీయూలో నువ్వుసాగించిన చివరి పోరాటం, నా జీవితపు పరిధిని పునర్నిర్వచించింది. నా కష్టాలు ఎంత చిన్నవో నాకు తెలిసొచ్చింది. నీ మరణం నన్ను మరింత ధృడంగా తయారుచేసింది.
నీ చివరి కోరిక ప్రకారం, అంత్యక్రియలకోసం నిన్ను మనూరికి తీసుకెళ్ళిన నాకు, నువ్విచ్చిన చివరి పాఠం ఎదురయ్యింది. నీ కోసం ఊరు మొత్తం ఎదురు చూస్తూ ఉండింది. ఉద్యోగాల్లో ఎక్కడెక్కడో స్తిరపడ్డ నీ స్టూడెంట్సందరూ, చివరి చూపుకోసం వచ్చారు. తాము ఇష్టంగా "టీచరమ్మ" అని పిలుచుకునే నీ అంతిమ యాత్రకు ఏర్పాట్లు నా ప్రమేయం లేకుండానే చేయబడ్డాయి. అన్నిటికంటే నిన్ను నాకు పూర్తిగా ఎరుకపరచిన సంఘఠన - పూటగడవడం కోసం రోజువారి కూలీపై ఆధారపడే 'హరిజనవాడ ' ప్రజలు, తమ తమ పనుల్ని విడచిపెట్టి, పెద్ద గజమాలతొ ఊరేగింపుగా చివరి చూపుకోసం వచ్చిన తీరు, నీలోని ఇంకో పార్శ్వాన్ని ఆవిష్కరించింది. నాకు అప్పుడు అర్ధమయ్యింది - జీవితమంటే ప్రేమించడానికి, ప్రేమింపబడడానికి మనకివ్వబడిన ఒక అవాకాశం.
ఈ రెండు పాఠల్నీ నేనెప్పటికీ మరచిపోనమ్మా....!
ఉంటాను మరి,
7 comments:
మీరు రాసిన లేఖ నన్నెంతో కదిలించింది ........
మీ అమ్మగారు ఎలప్పుడూ మీకు తోడుగా ఉంటూ మిమ్మల్ని ఇంతవారిని చేసినందుకు మీరు ఆమెకు ఇచ్చే గొప్ప నివాళి ఇదే అవుతుంది....
అమ్మ మర్రిచెట్టులానో రావిచెట్టులానో నన్ను దాటి అలానే ఎప్పటికీ నిలిచిపోతుందన్న భ్రమ వుంది, నిలిచిపోవాలన్న ఆశ వుంది. సృష్టిసహజంగానే భవిష్యత్తులో ఎపుడోకపుడు అమ్మ లేని కొడుకుగా రోజులు వెళ్లబెట్టాల్సి వస్తుందన్న ఊహ చైతన్యంలో ఏమూలో పొంచి వున్నా, దాని ఉనికి ఎందాకా నిర్లక్ష్యం చేయగలనన్న దానిపైనే నా ప్రస్తుత జీవితపు నిశ్చింత ఆధారపడి వుంటూ వస్తోంది. అలాంటిది, ఆ "ఎపుడోకపుడు"ను ఇపుడే అనుభవిస్తున్న మీ వేదన నాకు అర్థమయింది.
ఎందుకో చెప్పాలనిపిస్తుంది. మీరు The Year of Magical Thinking (by Joan Didion) అనే పుస్తకం పేరు విన్నారా?
http://www.amazon.com/Year-Magical-Thinking-Joan-Didion/dp/140004314X
GIREESH K. గారూ...,
నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.
తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .
మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
- హారం ప్రచారకులు.
గిరీష్ గారు, "మరణం మనిద్దరినీ భౌతికంగా దూరం చేసిందేమో కానీ, ఇప్పుడు మనం మానసికంగా ఎంతో దగ్గరయ్యాం." ఇది నాకు ఏడేళ్ల క్రితం మొదలైన స్వానుభవం. జాలై పన్నెండు రాత్రి నాకు బొట్టు, పూలు చేతిలో పెట్టి సాగనంపారు. నాతోను, నే వెళ్ళాక నా గురించి నాన్నగారితో మాట్లాడినవే చివరి మాటలు, 13 తెల్లారు ఝామున గురుపూర్ణిమ, గోదావరి పుష్కరాలు మౌనంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు అమ్మ అనుక్షణం నాతోనే. మీకు మాదిరే నాకూ అమ్మ చెప్పకనే చెప్పిన పాఠాలున్నాయి. మెహెర్ రాసినట్లు ఆ క్షణం నన్ను ముంచే వరకు నేనూ విస్మరిమ్చాను. ఆలోచనకే వణికాను.. కానీ ఇప్పుడు మారాల్సిన పరిస్థితి వచ్చిమ్ది..ఎప్పుడు కంటనీరు పెట్టినా "అమ్మమ్మ గుర్తుకు వచ్చిందా?" అనే మా అమ్మాయి ఓ రోజు, "నేను నీకన్నా ముందు చచ్చిపోతా. నువ్వు అమ్మమ్మ కోసం ఏడ్చినట్లు నేను ఏడ్వనప్పుడు. నీకోసమే చూస్తూ దేముడితో ఉంటా." అన్ననాటి నుమ్చి ఆ చుక్కా ఎవరూ లేని ఏకాంతాల్లో కానీ కుదరటం లేదు. అయినా "అప్పుడప్పుడు తన కోసం.." మనసు తత్తరపడుతూనే ఉంటుందిలా http://maruvam.blogspot.com/2010/05/blog-post_05.html
మనసు నిలవరించటం కాలానికి వదిలేయండి.
ఉష గారు, కాలానికి వదిలివేయడం తప్ప మరేమీ చేయలేని పరిస్థితి... మీ అలోచనలు పంచుకున్నందుకు కృతఙతలు!
@ Meher,
"The year of magical thinking" చదవడం ఇప్పుడే పూర్తిచేసాను. గత తొమ్మిదినెలల నా మానసిక పరిస్థితిని అద్దంపట్టినట్లు నా ముందు ఆవిష్కరించింది! Thanks for referring such a wonderful book.
నా బ్లాగులో పెట్టినా మీరు చూడరేమోనని ఇక్కడ పెడుతున్నాను. పబ్లిష్ చేయవద్దు.
* * *
గిరీష్ గారు, మీ మనస్థితి తెలిసే మరింత భావోద్వేగానికి గురి చేస్తానేమోనన్న సంశయం పీడిస్తున్నా ఈ లింక్ ఇచ్చిన కారణం కాస్త దుఃఖాతిశయం కలిగినా తెలియని సాంత్వన అమ్మ సమక్షంలో దొరుకుతుందనే ఆశతోనే పంపాను. అమ్మ అన్నది భౌతికం కావచ్చు కానీ అమ్మతనం అమరం. అది వేర్వేరు రూపాల్లో పరామర్శిస్తూనే ఉంటుంది. అమ్మ పరిచయం చేసిన ఆ "తనం" వెదకాలే గానీ మనని వెచ్చగా తాకే ఉదయకిరణాన, చల్లగ తాకే పూరేకునా ఇలా అన్నిటా అగపడుతూనే ఉంటుంది. ప్రయత్నించి చూడండి. నిజానికి అమ్మతనం, నాన్నతనం లింగబేధం లేనివి. ఇంతకన్నా ఈ మాధ్యమంలో ఎక్కువగా చెప్పి దీనిమీద అది మోయలేని భారం మోపలేను. మనమూ ఆ "తనాన్ని" మన పిల్లలకి పంచుతున్నవారమేగా! కనుక ప్రకృతి ఆవిష్కరిమ్చే ప్రతి అమ్మతనాన్నీ కమ్మగా ఆస్వాదించండి. అమ్మని ఎల్లవేళాలా దర్శించి పులకరించండి.
మీ లేఖ నన్ను కదిలించింది.
మా అమ్మ కూడా ఒంటిచేత్తో ఇద్దరు పిల్లల్ని పైకి తీసుకొచ్చింది. చిన్నప్పుడంతా నాకు ఆట్టే అర్థమయ్యేది కాదు మా అమ్మ డైనమిజం. బాగా పెద్దై స్వతంత్రంగా బ్రతకడం మొదలుపెట్టాక, కొంత జీవితం చూశాక గానీ మా అమ్మంటే ఏమిటో అర్థం కాలేదు నాకు. అయినప్పటికీ, ఇప్పుడు నేను ఫోను చేసి "నువ్వంటే నాకెంత వావ్ ఫీలింగో తెలుసా!" అన్నానంటే... "ఊ.." అని ఊరుకునే రకం మా అమ్మ అని నాకు తెలుసు కనుక, చెప్పను ;)
Post a Comment