అమ్మా!
హ్యాపీ బర్థ్ డే! ఈ రోజు 'మదర్స్ డే'. అందుకే, నీకు హ్యపీ బర్థ్ డే తో పాటుగా, 'హ్యాపీ మదర్స్ డే' కూడా...!
ప్రతి సంవత్సరమూ ఇదే రోజు, పొద్దున్నే ఈ మాటలు నీకు ఫోన్ చేసి చెప్పేవాడిని. కానీ ఈసారి, అలా చెప్పడానికి నువ్వు లేవు. అందుకే, నీకు రాస్తున్నట్లు నాకు నేను ఈ ఉత్తరం రాసుకుంటున్నాను.
నీకిలా ఉత్తరం రాస్తుంటే, చిన్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు, మనం రాసుకున్న ఉత్తరాలు గుర్తుకొస్తున్నాయి.
ఎవరో అన్నట్లు, మరణాన్ని పూర్తిగా అర్ధం చేసుకోవాలంటే అది మనకు అత్యంత ఆప్తులను కబళించాలి. ఎంత నిజం! కానీ, నువ్వు గమనిచావో లేదో, మరణం మనిద్దరినీ భౌతికంగా దూరం చేసిందేమో కానీ, ఇప్పుడు మనం మానసికంగా ఎంతో దగ్గరయ్యాం. ఇంతకముందు, నీతో మాట్లాడాలంటే, నీకు ఫోన్ చెయ్యాల్సొచ్చేది. ఇప్పుడు ఆ అవసరం లేదు. నాతో నేను మాట్లాడుకుంటే చాలు, నీతో మాట్లాడినట్లే.
ఆరోజు నాకింకా గుర్తుంది. కోల్పోవడానికి కూడా ఏమీ మిగలని పరిస్థితులలో, భుజాలపై ఇద్దరు పిల్లల బాధ్యత, భవిష్యత్తుపై ఆశ, గుండెనిండా ధైర్యము, జీవితంలో గెలవాలన్న పట్టుదల... కేవలం ఇవి మాత్రమే ఆలంబనగా, ఇరవైయ్యారు సంవత్సరాల క్రితం అంగన్ వాడి టీచర్ గా నువ్వు ఉద్యోగంలో చేరడం నాకింకా గుర్తుంది. ఏడుగురు తోబుట్టువులున్నా, ఎవ్వరినీ ఏమీ అర్ధించక, నీ ఆత్మాభిమానాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ, కష్టాలన్నిటినీ చిరునవ్వుమాటున దాచిపెట్టి, మమ్మల్ని పెంచి పెద్దచేసిన తీరు నేనెలా మరచిపోగలను చెప్పు.
ఇంకో విషయం గుర్తుందా నీకు? అప్పట్లో మనింట్లో ఒక రూల్ ఉండేది. రోజంతా ఎక్కడ తిరిగినా, రాత్రి భోజనం మాత్రం ముగ్గురమూ కలసే చేసేవాళ్ళం. నవ్వుకుంటూ సరదాగా కబుర్లుచెప్పుకుంటూ, వర్తమానాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తూ, భవిష్యత్తును కలల్లో ఆవిష్కరించుకుంటూ, తృప్తిగా భోంచేసేవాళ్ళం. ఈ పద్దతిని, నా ఇంట్లో పాటించాలని ఎంత ప్రయత్నిస్తున్నా కుదరటం లేదు. నేనింటికొచ్చేటప్పటికి, తొమ్మిది దాటిపోతుంది. ఒక్కోసారి, ఆ టైముకి పన్నుగాడు నిద్రలో ఉంటాడు. అప్పుడు చాలీచాలని కూరలూ, పచ్చడి మెతుకులే అయినా ఎంతో తృప్తిగా కడుపుతో పాటూ, మనసు కూడా నిండిపోయేది. ప్చ్... అరోగ్యం కోసం తినే ఆ రెండు పుల్కాలతో ఇప్పుడు కడుపూ, మనసూ రెండూ నిండట్లేదు.
మనిద్దరమూ ఇంత క్లోజ్ గా ఉండడం చూసి, ఊళ్ళో అందరూ అడిగేవారు... తల్లీ కొడుకులు ఫ్రెండ్స్ లా ఉండడం ఎలా సాధ్యం అని? నాకెంత గర్వంగా ఉండేదో! నాకు చిన్నప్పుడు ఇన్ని కష్టాలనిచ్చినందుకు దేవుడిపై ఎప్పుడూ నిష్టూరపడలేదు...ఎందుకంటే, ఆకష్టాలకు మారుగా నీ లాంటి అమ్మనిచ్చాడు. ఇంకేమి కావాలిచెప్పు నాకు. నిన్నింత తొందరగా నానుంచి తీసుకెళ్ళాడని, ఇప్పుడుకూడా దేవుడిపై నాకు కోపం లేదు. ఎందుకంటె, నాకు నువ్విచ్చిన గొప్ప ఆస్తి - ప్రశ్నిచకుండా జీవితాన్ని అనుభవించే విద్య.
అన్ని కష్టాలతో నిండిన జీవితాన్ని ఎంత హుందాగా అంగీకరించావో, అంతే హుందాగా మరణాన్ని కూడా హత్తుకున్న తీరు నాకు రెండు గొప్ప పాఠాల్ని నేర్పింది. ఆరోజు ఐసీయూలో నువ్వుసాగించిన చివరి పోరాటం, నా జీవితపు పరిధిని పునర్నిర్వచించింది. నా కష్టాలు ఎంత చిన్నవో నాకు తెలిసొచ్చింది. నీ మరణం నన్ను మరింత ధృడంగా తయారుచేసింది.
నీ చివరి కోరిక ప్రకారం, అంత్యక్రియలకోసం నిన్ను మనూరికి తీసుకెళ్ళిన నాకు, నువ్విచ్చిన చివరి పాఠం ఎదురయ్యింది. నీ కోసం ఊరు మొత్తం ఎదురు చూస్తూ ఉండింది. ఉద్యోగాల్లో ఎక్కడెక్కడో స్తిరపడ్డ నీ స్టూడెంట్సందరూ, చివరి చూపుకోసం వచ్చారు. తాము ఇష్టంగా "టీచరమ్మ" అని పిలుచుకునే నీ అంతిమ యాత్రకు ఏర్పాట్లు నా ప్రమేయం లేకుండానే చేయబడ్డాయి. అన్నిటికంటే నిన్ను నాకు పూర్తిగా ఎరుకపరచిన సంఘఠన - పూటగడవడం కోసం రోజువారి కూలీపై ఆధారపడే 'హరిజనవాడ ' ప్రజలు, తమ తమ పనుల్ని విడచిపెట్టి, పెద్ద గజమాలతొ ఊరేగింపుగా చివరి చూపుకోసం వచ్చిన తీరు, నీలోని ఇంకో పార్శ్వాన్ని ఆవిష్కరించింది. నాకు అప్పుడు అర్ధమయ్యింది - జీవితమంటే ప్రేమించడానికి, ప్రేమింపబడడానికి మనకివ్వబడిన ఒక అవాకాశం.
ఈ రెండు పాఠల్నీ నేనెప్పటికీ మరచిపోనమ్మా....!
ఉంటాను మరి,