Sunday, August 3, 2008

భోజనప్రియులు - బహుజనప్రియులు

అన్ని పాట్లూ సాపాటుకోసమేనన్నది నానుడి. కానీ, ఇప్పటి పోకడ చూస్తే సాపాటుకంటే, సాపాటు తగ్గించుకోవడానికే ఎక్కువపాట్లు పడాల్సి వస్తోంది. ఒక్కప్పుడు, మన దగ్గరివాళ్ళ భోజనప్రియత్వం గురించి గొప్పగా చెప్పుకునేవాళ్ళం. అదే, ప్రస్తుతం భోజనప్రియత్వం ఒక పెద్ద నేరం, నిషిద్ధం! నేను డైటింగ్ మొదలుపెట్టిన తరువాత కానీ నా భోజనప్రియత్వం నాకు పూర్తిగా అవగతమవ్వలేదు. అప్పట్నుంచీ, నాకుతెలిసిన వాళ్ళ ఆహారపుటలవాట్లను గమనించడం ఒక హాబీ అయ్యింది.

అందరికంటే ముందు చెప్పుకోవాల్సింది మా ఆఫీసులోని వైస్ ప్రెసిడెంటు మూర్తి గారి గురించి. ఈయనకు, నాలుగు సంవత్సరాల క్రితం మధుమేహం ఉందని కాకతాళీయంగా బయటపడింది. అప్పట్నుంచీ ఈయన తన కడుపు కట్టేసుకుని, "మనం తినే తిండి, అందులోని క్యాలరీలు" అన్న విషయమ్మీద విపరీతమైన రీసెర్చి చేసి, అహారపుటలవాట్లమీద ఉపన్యాసాలివ్వడం మొదలు పెట్టారు. ఒక్క గులాబ్ జామూన్లో ఎన్ని క్యాలరీలుంటాయి, అవి కరగాలంటే ఎంత సేపు వాకింగ్ చెయ్యాలి....ఇటువంటి విషయాలమీద అనర్గళంగా ఉపన్యసించే ఈయన లంచ్ రూం లో ఉన్నాడంటే, మేమెవ్వరమూ అటువైపు వెళ్ళడానికి కూడా సాహసించము. అసలు నేను తెచ్చుకునేదే చిన్న లంచ్ బాక్సు, నా అర్ధాకలికి తోడుగా నేను తినే క్యాలరీలు లెక్కగడుతూ తినడమంటే పెద్ద శిక్షే నాకు!

నా మితృడొకడు నాలాగే ఆకలి బాధితుడు. కాకపోతే, ఫక్తు శాకాహారి. రుచికి అంతగా ప్రాముఖ్యత ఇవ్వకపోయినా, సాంప్రదాయక ఆంధ్రా భోజనం, లేకపోతే కనీసం దక్షిణ భారత వంటకాలను మాత్రమే ఇష్ట పడతాడు. దానికి తగ్గట్లు, అల్సర్ ఉంది కాబట్టి, చివర్లో మజ్జిగన్నం ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈ విషయం లో మా వాడికి కాస్త చాదస్తం పాలు ఎక్కువే. మెనూలో ఏ మాత్రం తేడాని కూడా అంగీకరించడు. కాంటినెంటల్ రెస్టారంటుకెళ్ళినా, ఆంధ్రా భోజనం కోసం వెతికే రకం. మేము బాంబేలో కలిసి పనిచేసే రోజుల్లో, ఇద్దరమూ ఒక చిన్న బిజినెస్ మీటింగుకు "సన్ & సాండ్స్" అనే రెస్టారెంటుకెళ్ళాము. ఆ రెస్టారెంట్లో బఫే లంచ్ ప్రతీ రోజూ ఒక్కో థీం ప్రకారం ఉంటుంది. మావాడి దురదృష్టం కొద్దీ, మేమేళ్ళిన రోజు థీం "థాయ్ ఫుడ్డు"! ఇక చూస్కోండి మా వాడి అవస్త. శాకాహారం కోసం వెతికి వెతికి ఏదో భోజనమయ్యింది అనిపించాడు. కానీ, చివర్లో మజ్జిగ/పెరుగు కోసం పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తుంటే, ఆ థాయ్ చెఫ్ చూసి ఏమి కావాలని వచ్చీ రాని ఇంగ్లీషులో అడిగాడు. మావాడు, వెంటనే ఏమాత్రం మొహమాటం లేకుండా, "ఏనీ థింగ్ కర్డ్ బేస్డ్?" అని అడిగాడు. ఇక చూస్కోండి ఆ చెఫ్ అవస్త. అసలు కర్డ్ అంటే ఏమిటొ అర్ధమయ్యి, అటువంటి పదార్ధమేదీ లేదు అని చెప్పేటప్పటికి, వాడి తలప్రాణం తోకకొచ్చింది.

అన్నట్లు, బఫే అంటే గుర్తుకొచ్చింది. నన్ను బాగా ఇబ్బంది పెట్టే కఠినమైన శిక్ష ఏమిటంటే, బాగా ఆకలిమీద ఉన్న నన్ను, బఫే భోజనానికి తీసుకెళ్ళడం! ఈ పద్దతిని ఎవడు కనుక్కున్నాడో కానీ, వాడికి నా ఉసురు తప్పకుండా తగుల్తుంది. బఫేలో, కంటికింపుగా పలురకాల పదార్ధాలు కనిపిస్తాయి. కానీ, ఏది మొదట తినాలో,ఏది ఎంత తినాలో అన్న సంఘర్షణ నన్ను తినేస్తుంది. దానికి తగ్గట్లు, వడ్డించుకోవడంలో ఇబ్బంది, నిల్చుని ఓ చేత్తో ప్లేటు పట్టుకుని అవస్తలు పడుతూ తింటూ, నాజూగ్గా తింటున్నట్లు నటిస్తూ.. మారు వడ్డించుకోవాలంటే అందరూ మనల్నే చూస్తున్నారనే ఫీలింగు..... అబ్బ అంతకంటే పెద్ద శిక్ష ఉండదు నాకు. ఇటువంటి పార్టీలనుంచి సాధారణంగా అర్ధాకలితోనే బయటపడతాను. అయితే, ఇంట్లో నా డైటింగ్ ప్రసహనం మొదలయ్యినప్పట్నుంచి ఇటువంటి పార్టీల్లో నా మొహమాటాన్నీ, కాంప్లెక్సుల్నీ పక్కన పెట్టి, కడుపునిండా తినే అవకాశాన్ని వదులుకోవట్లేదులెండి.

ఇంకొందరుంటారు. వీరికి జిహ్వచాపల్యం ఎక్కువే కానీ, పైకి మాత్రం మితాహారం గురించి విపరీతమైన ఉపన్యాసాలు దంచుతుంటారు. వీళ్ళ అసలు రంగు పార్టీల్లో కానీ బయట పడదు. వీళ్ళు సాధారణంగా శాకాహారులు, మద్యం ముట్టని వాళ్ళూ అయివుంటారు. మా ఆఫీసులో వీరి శాతం ఎక్కువే. అన్ని పార్టీల్లో వీరి రొటీను ఒకేవిధంగా ఉంటుంది. నాబోటి బడుగుజీవులం దొరికిన అవకాశాన్ని వదులుకోలేకుండా, ఏ బీరో, ఓడ్కానో ఆర్డర్ చేసి కూర్చుంటాం. మావి రెండు పెగ్గులు పూర్తయ్యేలోపల, వీళ్ళు మాత్రం, మెనూ కార్డు మొత్తం వెతికి,రీసెర్చి చేసి, ఎప్పుడూ రుచి చూడని మాక్ టైల్సూ/ఫ్రూట్ పంచ్ లు నాలుగు రకాలు, వాటితో పాటు,ఓ అరడజను స్టార్టర్లూ లాగించేస్తారు. పైకి మాత్రం ఫోజు. వీళ్ళు మందెప్పుడు ఫినిష్ చేస్తార్రా బాబూ అని, ప్రధాని పదవికోసం ఎదురు చూసే అద్వానీలా మా మొహాలకేసి దిగులుగా చూస్తూ కూర్చుంటారు. అప్పటికే కడుపులు నింపేసుకున్న వీళ్ళు, మెయిన్ కోర్సు మాత్రం మితంగా తీసుకుని, చాలా కంట్రోల్ గా తింటున్నట్లు ఒక ఫోజు కొడతారు.

నా మితృడొకతను నాకుమల్లే భోజనప్రియుడు, మాంసాహారి. కాకపోతే, తన జిహ్వచాపల్యాన్ని సమర్ధించుకోవడానికి ఒక లాజిక్కు కనిపెట్టాడు. ఈయనగారి ప్రకారం, మనం నిత్యం తినే ఆహార పదార్ధాలు రెండు రకాలు - అంతగా హాని కలిగించనివి, ఎక్కువ హాని కారకమైనవి. కాని చిత్రంగా తనకిష్టమైనవన్నీ మొదటి వర్గంలోనే ఉండడం కాకతాళీయమెలాగో నాకర్ధం కాదు! కాస్త సైన్సుని జోడిస్తాడు కనుక ఇతని వాదన బలంగానే ఉంటుంది. అయితే, వచ్చిన చిక్కల్లా, మనం ఎంతో ప్రియంగా తినే తిండి మనకెలా హాని కలిగిస్తుందో నమ్మలేని, నా లాంటి మట్టి బుర్రలతోనే. ఇతని వాదన ప్రకారం, మాంసాహారాల్లో తినగలిగినవి చేపలు, చికెనూ మాత్రమే. మటన్ అత్యంత హానికరం. ఈ వాదన వింటున్నప్పుడల్లా నా అవస్త కాస్త ఊహించుకోండి. మటనూ, చుక్కాకు కలిపి మా అవిడవండే కూర, అందులోకి రాగి సంగటి అంటే పడి చచ్చే నేను, మటన్ చెడ్డ చేస్తుందంటే ఎలా నమ్మమంటారు చెప్పండి? (మటనూ, చుక్కాకు కలిపి వండే కూరను "దాల్చా" అని అంటారు. ఇది మా రాయలసీమ స్పెషల్. ఇక రాగి సంగటి గురించి చెప్పక్కర్లేదు. రాయలసీమలో సాధారణ వంటకం)

ఇంకొంతమంది, అసలు పుట్టడమే కడుపు మాడ్చుకోవడానికే అన్నట్లుంటారు. ఆహారపు నియమాలను చాలా ఖచ్చితంగా పాటిస్తారు. ఇందులో ఏ మాత్రం తేడాను అంగీకరించరు. హోటలుకెళ్ళినా కూడా, వీళ్ళ మెనూలో ఏ కొంచెం తేడా ఉండదు. కొత్త వంటకాలను అస్సలు ముట్టుకోరు.వీళ్ళకు మెనూకార్డుల్లోని ఐటెమ్స్ చాలావరకు తెలీవు. వీళ్ళవరకు ఎలావున్నా పరవాలేదు. కానీ, ఎదుటివాళ్ళనుంచి కూడా ఇదే ప్రవర్తన ఆశిస్తారు. వీరి చాదస్తం ఎంతంటే, చివరికి తిరుపతి లడ్డూని కూడా అలోచించి తింటారు! ఇటువంటివాళ్ళు, సాధారణంగా నసరాముళ్ళై ఉంటారు. నలుగుర్లో సరదాగా కలవలేరు. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లు, చిరచిరలాడుతూ ఉంటారు. ఫ్లెక్సిబిలిటీ అస్సలుండదు. తిండి దగ్గరే ఇంత పట్టింపుగా ఉండే వీళ్ళు, నిజజీవితంలో ఎలా ఉంటారో ఊహించుకోండి! వీళ్ళని ప్రేమించే వాళ్ళకన్నా, వీరంటే భయపడే వాళ్ళు,ఇష్టపడని వాళ్ళే ఎక్కువగా ఉంటారు.

అదే, తిండిదగ్గర ఉత్సాహంగా ఉండేవాళ్ళను చూడండి. వీళ్ళు, నిజజీవితంలో కూడా చాలా సరదాగా ఉంటారు. అందరూ వీరి కంపెనీని ఇష్టపడతారు. వీరు ఏ పని చేసినా అందరినీ కలుపుకు పోయే రకం. ఆఫీసుల్లో కూడా, ఇటువంటి వాళ్ళు చాలా పాపులర్! ఒక్క మాటలో చెప్పాలంటే, భోజనప్రియులు సహజంగా బహుజనప్రియులు....ఏమంటారు?

8 comments:

Purnima said...

Good company is essential to enjoy food. adi maatram cheppagalanu.

Nice post!!

యడవల్లి శర్మ said...

అయ్యా..అది శాకాహారం...

శాఖాహారం కాదు...దయచేసి సవరించుకోగలరు..

చిలమకూరు విజయమోహన్ said...

అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు.
భోజనం చేసేటందుకు మన పూర్వీకులు కొన్ని పద్దతులు ఏర్పాటు చేసారు.అవి భోజనాన్ని ఎప్పుడు పడితే అప్పుడు
ఎక్కడ పడితే అక్కడ,
ఎంత పడితే అంత,
ఎలా పడితే అలా
తినకూడదంటారు.
ప్రస్తుత పరిస్థితుల్లో మనం వాటిని ఆచరింకపోవటంవల్లే జీర్ణకోశవ్యాధులు,మధుమేహాలు వచ్చిపడుతున్నాయి.

Sujata M said...

I agree with your opinion on Baffet system.

But if I am served with some food, I will loose appetite. Just seeing the food is enough !

If I hv some expectation abt food, I cant eat.

Which category do I fall under ?

:D Your post will be a hit !

GIREESH K. said...

శర్మగారు, తప్పు సరిచేసాను. ధన్యవాదాలు!

పూర్ణిమగారు, నెనర్లు.

విజయమోహన్ గారు, నా ఉద్దేశం పద్దతి లేకుండా తినమని కాదండీ. మనం ఎంత తిన్నా, ఏమి తిన్నా, ఆనందంగా ఎంజాయ్ చేస్తూ తినాలనే!

సుజాత గారు, అభినందనకు కృతజ్ఞతలు!

Anonymous said...

ఒక్క మాటలో చెప్పాలంటే, భోజనప్రియులు సహజంగా బహుజనప్రియులు....ఏమంటారు?

I totally agree with you gireesh. nice post.

chaala comments lo choosaanu, ee "nenarlu" ante emiti??

రాధిక said...

భోజనప్రియులు - బహుజనప్రియులు" agree with u :)

పెదరాయ్డు said...

వేడి వేడి రాగి సంగటి తొ ఏదితిన్న అదిరిపోతుంది. మటన్, చికెన్, బెండకాయతో కూడిన ఆకుకూర, వంకాయ+వేయించిన పప్పు....