Tuesday, July 29, 2008

ప్రశ్న...

ప్రభూ..

నీ గురించిన ఎన్నో ప్రశ్నలు
అన్నిటికీ మౌనమే నీ సమాధానం,

నాలోని నిన్ను,నా తోడైన నిన్ను,
నా దారైన నిన్ను,నా గమ్యమైన నిన్ను....
నా సమస్తమూ నీవేనని ఎరిగినా,
నిన్ను శోధించడం మాత్రం ఆపను.

ఆశ, నిరాశ
కష్టం, సుఖం
నమ్మకం, సందేహం....
ద్వందాల నడుమ బందీనైన నేను,
నీ ఉనికిని ప్రశ్నిచడం మాత్రం ఆపను.

కానీ, నేనేమాత్రమూ ఊహించని రీతిలో
శతకోటిసూర్యప్రభలతో నీవు ఆవిష్కృతమైన నాడు,
ఈ ప్రశ్నల కారుమబ్బులన్నీ మాయమౌతాయి.
వాటికి సమాధానం దొరికి కాదు సుమీ,
వాటి నిరర్ధకత ఎరుక కలిగి మాత్రమే...

6 comments:

MURALI said...

వాటికి సమాధానం దొరికి కాదు సుమీ,
వాటి నిరర్ధకత ఎరుక కలిగి మాత్రమే...

చాలా బాగున్నాయి.

Bolloju Baba said...

ప్రభువుకోసం అన్వేషణ తో కూడుకొన్న కవితలు నన్ను నిత్యం జ్వలింపచేస్తూనే ఉంటాయి. మీకవిత కొంతకాలం నన్ను వెంటాడుతూనే ఉంటాది.
బొల్లోజు బాబా

GIREESH K. said...

మురళి గారూ, అభిప్రాయానికి కృతజ్ఞతలు.

బాబా గారు, మీరు వ్రాసే ఒకొక్క కవిత నాకు పాఠ్యాంశమే. భావాలను అత్యంత హృద్యంగా అక్షరీకరించే మీ శైలి అద్భుతం. మీ అభినందన నాకు అశీర్వచనమే! కృతజ్ఞతలు!!!

సుజాత వేల్పూరి said...

నా సమస్తమూ నీవేనని తెలిసినా
నిన్ను శోధించడం ఆపను

చాలా డీప్ గా ఉందీ భావం! రెండో పేరా కూడా 'ఉనికికి ప్రశ్నించడం ' చాలా బాగుంది.బావుందండి మీ కవిత. కవితా సౌందర్యాన్ని అనుభవించడమే కానీ స్వయంగా కవయిత్రిని కాకపోవడంతో ఇంతకంటే వ్యక్తీకరించలేకపోతున్నాను!

GIREESH K. said...

సుజాత గారు, కృతజ్ఞతలు.

నేను చాన్నాళ్ళనుంచీ "గీతాంజలి" (చలం అనువాదం) మత్తులోనే జోగుతున్నాను. నేనూ ఆ మత్తును పూర్తిగా ఆస్వాదిస్తున్నాను కనుక, అందునుంచి బయటపడే ప్రయత్నమేమీ చెయ్యట్లేదు. కాబట్టి, నా కవితల్లో గీతాంజలి ప్రభావం తప్పకుండా కనిపిస్తుంది.

(అందువలనేనేమో, నేను బ్లాగు మొదలుపెట్టి మూడు నెలలు కావస్తున్నా,ఆ "వెతుకులాట" గురించే ఎక్కువగా వ్రాసాను.)

అభినందనకు కృతజ్ఞతలు.

మోహన said...

వాటికి సమాధానం దొరికి కాదు సుమీ,
వాటి నిరర్ధకత ఎరుక కలిగి మాత్రమే...

:)