Wednesday, July 9, 2008

నా మితాహార దీక్ష!

నిశ్చల తటాకంలోని ప్రశాంతతను ఓ అల్లరిపిల్లవాడు విసిరిన రాయి చెదరగొట్టినట్లు, ఏడాది క్రితం జరిగిన ఓ సంఘటన, నాజీవితంలోని ప్రశాంతతను పూర్తిగా తుడిచిపెట్టింది. ఎన్నో ఏళ్ళ నా నమ్మకాలనూ, నేనేర్పరచుకున్న తర్కాలనూ, నా అలవాట్లనూ, ఆ సంఘటన సమూలంగా పెకలించివేసింది. ఇంత భారీ బిగినింగు చూసి, వీడు మళ్ళీ ఏదో సీరియస్ సోది వ్రాస్తున్నాడని ఓ నిర్ణయానికొచ్చేయకండి! దయచేసి కాస్త ఓపిక పట్టండి. ఆ సంఘటన, ఆ తరువాత నా తిప్పలూ తెలుసుకుంటే మీ సానుభూతి వర్షం తప్పకుండా నన్ను తడిపేస్తుంది!

ఏడాది క్రితం ఓ వీకెండ్ ఫ్యామిలీ పార్టీకి, నేనూ మా ఆవిడా కలిసి, మా బాసు ఇంటికి వెళ్ళాము. ఎప్పట్లానే, నేను వేసుకున్న క్యాజువల్ డ్రెస్సూ, మాసిన నా గడ్డమూ మా అవిడకు నచ్చలేదు. అలవాటు ప్రకారం, తన రుసరుసలను చిర్నవ్వు చాటున కప్పెట్టి మా ఆవిడా, ఏమీ జరగనట్లు బ్లాంక్ ఫేసుతో నేను, మా బాసు ఇంట్లోకి అడుగు పెట్టాము. మేమెళ్ళేటప్పటికి పరచియకార్యక్రమాలవుతున్నాయి. మా బాసు, బయోటెక్ ఇంజనీరైన తన కూతుర్ని మాకు పరిచయం చేసాడు. ఇంత వరకూ కథ బాగానే జరిగింది. జరగబోయేదాని గురించి ఏ మాత్రం క్లూ లేని మేము మాట్లాడుతుండగా, హటాత్తుగా పేలిన ఆత్మాహుతి బాంబు వలే, జరిగిందా సంఘటన.

"అంకుల్, కూల్ డ్రింక్ కావాలా, ఫ్రూట్ జూస్ కావాలా?" అంటూ చేతిలో ట్రేతో మా బాసుకుట్టి ప్రత్యక్షం. ఉలిక్కి పడి వెనక్కి తిరిగి చూసి, ఎవరూ లేకపోవడంతో, పిలిచింది నన్నేనని నాకర్ధమయ్యేలొపె ఇంకో డామేజ్ జరిగిందండీ. "ఆంటీ, మీరేమి తీసుకుంటారు?" అంటూ మా ఆవిడ్ని కూడా వదల్లేదు! మా ఆవిడ్ని కూడ ఆంటీ అని సంబోధించి, మా బాసుకుట్టి ప్రదర్సించిన సమానత్వం నాకు చాలా ఆనందం కలిగించినా, ఐపిఎల్ లో మాచ్ ఓడిపోయిన తరువాత రాహుల్ ద్రావిడ్ లా మొహంలో ఏ భావమూ ప్రదర్సించకుండా (పెళ్ళైన ఏడేళ్ళలో ఈ విద్య బాగా వంటపట్టింది లేండి!) ఫ్రూట్ జూస్ తీసుకుని మా ఆవిడ వైపు తిరిగాను.

పాపం, షాకు నుంచి తనింకా తేరుకొన్నట్లు లేదు. తనకు సహాయం చేసే ఉద్దేశంతో గ్లాసు చేతికివ్వబోతే, విసురుగా నా చేతినుంచి లాక్కొని, ఓ తీక్షణమైన చూపు నావైపు విసిరింది. ఆ తీక్షణత అర్ధం కావాలంటే చిన్న ఫ్లాష్ బాక్ మీరు తెలుసుకోవాలి.

ఈ సంఘటన జరగడానికి కొన్ని రోజుల ముందునుంచి, మా ఇంట్లో వాడివాడిగా జరుగుతున్న చర్చా విషయం - నా డైటింగ్! గత ఏడు సంవత్సరాలుగా నా జిహ్వచాపల్యాన్ని నియంత్రించాలని ప్రయత్నించి విసిగి వేసారి, కనీసం నా చేత మార్నింగ్ వాక్ అన్నా చేయించాలని మా ఆవిడ శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. అప్పటికి నేను పది కేజీలు అధికబరువున్నానని లెక్కకట్టి, నా తిండి కంట్రోల్ చేయడానికి, మార్నింగ్ వాక్ చేయడానికి, నన్ను కర్తవ్యోన్ముఖుణ్ణి కావించడానికి చాలా ప్లానులుతో, తన ప్రయత్నాన్ని తీవ్రతరం చేసింది.

ఇందుకు, తనిచ్చిన ఒక ముఖ్యమైన కారణం... కాస్త లావుగా ఉండడం వలన, నా వయసు కాస్త ఎక్కువగా కనిపిస్తుందని. అలాగైనా నన్ను ఉత్సాహపరచాలని తన ప్రయత్నం. కానీ, తన ఆర్గుమెంట్లన్నిటినీ, అసెంబ్లీలో వైయెస్సార్ లా, నా చిర్నవ్వుతో, మొండి లాజిక్కులతో తునాతునకలు చేసేస్తూ, రోజులు గడిపేస్తున్నాను. నిజం చెప్పాలంటే, నాకు డైటింగ్ అంటే చచ్చేంత భయం. నేను నిద్రకు దూరమై బ్రతకగలనేమో కానీ, కడుపు కట్టేసుకోవడం మాత్రం కలలో కూడా ఊహించలేను. "మీ ఆవిడంటే నీకెందుకు ఇష్టమో, మూడు కారణాలు చెప్పు" అని నన్నెవరైనా ప్రశ్నిస్తే, ఖచ్చితంగా నా మొదటి కారణం తన వంట అని టక్కున చెబుతాను. టైమ్స్ ఫుడ్ గైడు,శుక్రవారం బెంగళూరు టైమ్స్ (ఇందులో రెస్టారెంట్లపై రివ్యూలు రాస్తారు) వదలకుండా చదివే నా అభిరుచీ, బెంగుళూరులో ఏ కొత్త రెస్టారంటు ఓపెన్ అయినా తప్పకుండా ఓ సారి వెళ్ళే నా జిహ్వచాపల్యమూ, నా మిత్రులందరికీ సుపరిచితమే. మా ఆఫీసులో ఈ డైటింగ్ పేరుతో తన లంచ్ బాక్సులో పచ్చి కూరగాయలు తెచ్చుకునే మా వైస్ ప్రెసిడెంటు మూర్తి (క్యాలరీ మూర్తి అని నిక్ నేం నేనే పెట్టాను), నా కంటికి ఓ గ్రహాంతరవాసిలా కనిపిస్తాడు.

అటువంటి నేను, డైటింగ్ చెయ్యడమా....నెవ్వర్, అని దదాపుగా ఓ నిర్నయానికొచ్చేసిన సమయంలో, 'అంకుల్' అన్న మా బాసుకుట్టి పిలుపు, నా విల్ పవర్ని కాస్త దెబ్బతీసింది. అలాగే, మా ఆవిడ చేతికి ఓ బ్రహ్మాస్త్రమిచ్చినట్లయ్యింది. ఇక మా ఆవిడ దొరికిన చాన్సు అందబుచ్చుకొని, నా మార్నింగ్ వాక్ షెడ్యులు, నా డైటింగ్ ప్లాను నిర్ణయించేస్తుంటే, అసెంబ్లీలో అధికారపక్షం దబాయింపుని నిస్సహాయంగా చూసే చంద్రబాబులా ఉండిపోయాను.

కొత్తగా కొన్న ట్రాక్ సూటు, జాగింగ్ షూస్ తో, యుద్దభూమికెళ్ళే సైనికుడిలా ఇంటిదగ్గరి పార్కుకు మా అవిడ నన్ను సాగనంపుతుంటే, నాకుమాత్రం మా ఊళ్ళో జాతరకు బలిపీఠం వైపు నెట్టబడే మేకపిల్లే గుర్తుకొచ్చేది. అంతటితో ఆగితే పరవాలేదు. నా ఆహారపుటలవాట్లన్నిటిని మా ఆవిడ నిర్దాక్షిణ్యంగా పెకలించివేసింది. నూనె వస్తువులూ, మసాలా వంటలూ, అన్నిటికంటే ముఖ్యంగా నాన్-వెజిటేరియను..... అన్నిటినీ పూర్తిగా నిలిపివేయబడ్డాయి.

ఉదయాన్నే ఇడ్లీ/దోస, వేరుశనగపప్పుల చట్నీ లేని ఉపాహారాన్ని అసలు ఊహించుకోలేని నేను, ఒక్కసారిగా బ్రెడ్డూ,పుల్కాలు, జొన్న రొట్టెలు మొదలైన వాటితో సరిపుచ్చుకోవలసి వచ్చింది. అలాగే నా లంచ్ బాక్సు, రాత్రి భోజనం మెనూ కూడా మారిపోయింది. అన్నిటికన్నా ముఖ్యంగా, మాంసాహారం పూర్తిగా నిషేదించబడింది. ఇలా ఓ వారం రోజులు అతి భారంగా గడిచాయి. నాకు జీవితమ్మీద ఇచ్చ పూర్తిగా ఆవిరైపోయి, మార్నింగ్ వాక్ కు కాళ్ళీడ్చుకుంటూ వెళుతుండగా, ఓ రోజు పార్కు పక్కనే చిన్న టిఫిన్ సెంటర్ నా కంటపడింది. వెంటనే నా కళ్ళు మెరిసాయి. ఒక్కరోజుకే అని సరిపుచ్చుకుని,వెంటనే లోపలికి దూరి ఓ సెట్ దోశ లాగించేసి, కాసేపు వాకింగ్ చేసి, ఇంటికెళ్ళిపోయాను. ఇలా, ఏ రోజుకా రోజు, ఇదే చివరి రోజు అని సర్దిచెప్పుకోవడం, బయటే టిఫిన్ లాగించేయడం, ఏమీ అనుమానం రాకుండా ఇంటికెళ్ళిపోవడం... ఇలా సాగింది నా మార్నింగ్ వాక్ ప్రసహనం కొద్దిరోజుల పాటూ.

డైటింగ్ మొదలుపెట్టి ఇన్ని రోజులవుతున్నా నానుంచి ఏమాత్రం వ్యతిరేకత లేకపోవడంతో, మా ఆవిడకు అనుమానం వచ్చి, మొత్తానికి కూపీ లాగి, నేను చేస్తున్న వెధవ పనిని పసిగట్టేసింది. అంతే...చిన్నపాటి యుద్దమే జరిగింది మా ఇంట్లో. నిన్ను బాగుచెయాడం నావల్ల కాదూ అని అస్త్రసన్యాసం చేసిన మా అవిడను శాంతపరచడానికి నాకు జేజమ్మలు కనిపించారు. ఆ తరువాత, కొద్ది రోజులకే, నా అదృష్టం బాగాలేక, మేము ఇల్లు మారాము. ఈ కొత్త అపార్ట్ మెంట్ లో, కాంపస్ లోపలే క్లబ్ హౌసూ, అందులో జిమ్మూ ఉండడంతో, ఇక మార్నింగ్ వాక్ కు బయటకు వెళ్ళే అవసరం లేకపోయింది. అలాగే దొంగచాటుగా కడుపు నింపుకునే అవకాశమూ పోయింది.

ప్రస్తుతం, రాముడు మంచి బాలుడు అన్న టైపులో రోజు ఉదయాన్నే జిమ్ముకెళుతున్నాను. విజయగర్వంతో, మా ఆవిడ అప్రతిహతంగా నా డైటింగును (అదే నా కడుపు మాడ్చడాన్ని) కొనసాగిస్తోంది. అయితే, కాస్త వెసులుబాటేంటంటే, అప్పుడప్పుడూ నా మీద దయతలచి మామూలు టిఫిన్లూ అవీ చేస్తు ఉంటుంది. నేనుకూడా, అప్పుడప్పుడూ వచ్చే పండగరోజుల కొసం ఎదురుచూస్తూ, నా మితాహార దీక్షను కొనసాగిస్తున్నాను.

12 comments:

Anonymous said...

నాక్కుడా జిహ్వచాపల్యమూ ఎక్కువ....

కొత్త రెస్టారంటులకు నెను కుడా వెళతాను ...

బెంగుళూరులో వున్న మా౦చి ....రెస్టారంటులు గురి౦చి ..నాకు చెప్పరా.....నెను ప్రయత్నిస్తాను ....Please ...

Anonymous said...

చీ చీ, ఈ పెళ్ళాలిప్పుడూ ఇంతే...హు...

సుజాత వేల్పూరి said...

గిరీష్ గారు, కొంచెం మీ ఆవిడగారినిలా పిలవండి, గిల్లేసుకోవాలి! నాకిప్పుడు మా వారిని మార్నింగ్ వాక్ కి వెళ్లమనాలంటే భయంగా ఉంది! అయినా తను అలా లొంగడు లెండి. 'నేను పొద్దున్నే లేచి కాఫీ, టిఫిను తినమంటే తింటాను గానీ వాకింగ్ కెళ్ళె సంగతి మర్చిపో అని చెప్పేసాడు. అందుకే ఆఫీసులోనే జిమ్ము పని కానిచ్చి(అలా చెప్తున్నాడు మరి) ఇంటికొస్తాడు. మీ టపా అదిరిపోయింది.

శంకర్ రెడ్డి గారు, రాసుకోండి,
1.అడిగాస్(బన్నేరు ఘట్ట రోడ్)

2.పంజాబ్ టైంస్ (బన్నెర్ ఘట్ట రోడ్, షాపర్స్ స్టాప్ ఎదురు)

3. పక్కా తెలుగు భోజనం కోసం..నాగార్జున చిమ్నీ, జయనగర్ మూడో బ్లాకు.

4.inchara జెపి నగర్ ఆరో ఫేజ్! నందిని పక్క లేన్లో.

5.క్రిషి-జయనగర్ షాపింగ్ కాంప్లెక్స్ 1st floor

6.new yorker, church street ..
ప్రస్తుతానికివి కానివ్వండి మరి!

క్రాంతి said...

:-)

Anonymous said...

నేను మాత్రం ఇలాంటివేవీ చేయకుండా బరువు తగ్గే మార్గం గురించి వెదుకుతున్నాను.:):)

కొత్త పాళీ said...

Brother! I feel your pain.

@Ravi - you said a mouthful, but be careful your wife doesn't see your comment :)

Purnima said...

బాగుంది..ప్రస్తుతం మా అమ్మగారు నా మీద అదే ప్రయత్నంలో ఉన్నారు.. నేను మంచిగా మీలా మారిపోవాలి ఏమో!!

Naga said...

భలే తోడు దొరికారు. మూడు రోజుల నుండి లేవ గానే గొంతు వరకు నీళ్ళు నింపుతున్నాను. ఇవాళే కారట్లు, వెజ్జీ డిప్ తీసుకొచ్చి ఆఫీసు ఫ్రిడ్జిలో పడేసాను.

GIREESH K. said...

@ శంకర్ రెడ్డి గారు
సుజాతగారు చెప్పినవే కాకుండా, ఇంకొన్ని:

చెట్టినాడు నాన్-వెజ్ కావాలంటే కోరమంగళ సోనీ సిగ్నల్ దాటిన తరువాత వచ్చే "అంజప్పర్" కానీ రెసిడెన్సీ రోడ్డులోని "పొన్నుస్వామీ" కానీ ట్రై చెయ్యండి.

అలాగే, మంచి ముఘలాయి వంటకాలు కావాలంటే ఫోరం లోని "సాహిబ్ సింధ్ సుల్తాన్", ఆఫ్ఘానీ కోసం ఇన్ ఫాంట్రీ రోడ్డులోని "సమర్ఖండ్", చైనీస్ వంటలకోసం ఈవా మాల్ లోని "అరోమాస్ ఆఫ్ చైనా" ట్రై చెయ్యండి.

స్వచ్చమైన అప్పం మరియూ కేరళా పరోటాలు కావాలంటే, ఇందిరా నగర్ 100 ft రోడ్డులోని "సౌత్ ఇండీస్" వెళ్ళాలి.

దురదృష్ట వసాత్తూ, బెంగళూరులో "ఆంధ్రా స్టైల్" అన్న పదం బాగా misuse అయ్యింది. ప్రతిచిన్న హోటలుకూ "అంధ్రా భోజనం" అన్న బోర్డు తగిలిస్తారు. సుజాత గారు చెప్పిన "ఇంచర" తప్పించి, నాకిక్కడ వేరే రెస్టారంట్లేవీ తగల్లేదు.

రవీంద్ర గారు...ఏ కష్టమూ పడకుండా బరువు తగ్గే విధానమేదైనా మీకు తగిలితే కాస్త మాతో కూడా పంచుకోండి!

Anonymous said...

@సుజాత గారు ...థా౦క్స్
మీరు చెప్పిన వాటిల్లొ నాగార్జునా తప్ప మిగతావి ప్రయత్ని౦చ లెద౦డి ....ఈ వార౦ ఒక పట్టు పట్టాలి ..
@గిరిశ్ గారు ...థా౦క్స్
మీరు చెప్పిన వాటిల్లొ "పొన్నుస్వామీ" మరియు "సౌత్ ఇండీస్" తప్ప మిగతావి ప్రయత్ని౦చాలి ...


ఇందిరా నగర్ 100 ft రోడ్డులోని "సౌత్ ఇండీస్" ఎదురుగా ఉ౦డె ..."టా౦జరిన్ (ఇటాలియన్ సిజ్-లర్స్)" ప్రయత్ని౦చారా.....లెద౦టె ఒక్కసారి వెళ్ల౦డి .... నాకు అక్కడి సీ ఫుడ్ అ౦టె భలె ఇష్ట౦....

వేణూశ్రీకాంత్ said...

Nice post Gireesh gaaru.

MURALI said...

నేనుకూడా ఈ మార్నింగ్ వాక్ ని, యోగా ని సంవత్సరంగా వాయిదా వేసుకుంటు వస్తున్నా.