Sunday, November 2, 2008

నమ్మ బెంగుళూరు!

బెంగుళూరు...!
నేనిక్కడకు వచ్చి దాదాపు మూడేళ్ళు కావస్తున్నా, ఈ నగరం మాత్రం ఇప్పటికీ నాకు పూర్తిగా అంతుపట్టలేదు. తెలిసినట్లే ఉంటుంది...కాని ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది.

లిపిలో ఉన్న సారూప్యత వల్ల, నేనిక్కడకు వచ్చిన కొత్తలో, కనిపించిన సైన్ బోర్డునల్లా చదివేస్తూ, మహా ఉత్సాహపడిపోయేవాడిని. కాకాపొతే, తెలుగు పరిజ్ఞానంతో కన్నడ బోర్డులు చదివితే, "అయ్యో, అమ్మో" అంటూ గుండెలు బాదుకున్నట్లు ఉంటుంది. ఉదాహరణకు, "Ganesh Bar & Restaurant" కాస్తా "గణెశో బారో & రెస్టారంటో (అయ్యో అమ్మో & ఓరి నాయనో)" అవుతుంది. ఇలా చదువుకుని, నాలో నేను నవ్వుకుంటున్నప్పుడు, పక్కనవాళ్ళు నన్ను అనుమానంగా చూసిన సందర్భాలున్నాయి :).

అయితే, ఒక్కవిషయం మాత్రం మనం ఒప్పుకుని తీరాలి. కన్నడిగుల మాతృభాషాభిమానం ముందు మనం దిగదుడుపే. తిరుమల బ్రహ్మోత్సవాలకోసం వేసే special బస్సులకు, మన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వాళ్ళు "స్పెషల్ బస్సు" అని తెలుగులో రాసిన బోర్డు తగిలిస్తే, ఇక్కడి బస్సులకు "విశేష వాహన" అని స్వచ్చమైన కన్నడలో రాస్తారు. అలాగే, ఇక్కడ BSNL మొబైల్ నంబరుకు డయల్ చేస్తే, మనకు తరచుగా వినపడే ప్రకటన "నీవు కరియమాడిద చందాదారరు వ్యాప్తిప్రదేశ హొరగిద్దారె". (ఈ ప్రకటన తెలుగులో "మీరు డయల్ చేసిన నంబరు కవరేజ్ ఏరియాలో లేదు). అయితే, మనం కాల్ చేసిన వ్యక్తి మనపక్కనే నిలుచుని వున్నా కూడా, ఈ ప్రకటన వినిపిస్తుందనుకోండి, అది వేరేవిషయం.

ఆ తరువాత చెప్పుకోవాల్సింది, ఇక్కడి ట్రాఫిక్కు గురించి. గిన్నిస్ బుక్ గుర్తించలేదు కాని, బెంగుళూరు చాలా విషయాల్లో రికార్డు సృష్టించింది. మామూలుగా అయితే, ఎక్కడైనా ఫ్లై ఓవర్ కింద ట్రాఫిక్ సిగ్నల్ ఉంటుంది. కానీ, ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా, పైనకూడా ట్రాఫిక్ సిగ్నల్ కలిగి ఉన్న ఏకైక వంతెన (ఫ్లైఓవరు) ఇక్కడమాత్రమే ఉంది (రిచ్ మండ్ సర్కిల్ ఫ్లైఓవర్)! SM కృష్ణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టబడిన ఈ వంతెన, ఒక గొప్ప architectural blunder గా విరాజిల్లుతోంది!!! అలాగే,"ఎక్కువ కాలంపాటూ సాగిన వంతెన నిర్మాణం" కేటగిరీలో బెంగుళూరుదే అగ్రస్థానం. ఇక్కడ ఒక్కో వంతెన (ఫ్లై ఓవరు) దీ ఒక్కో చరిత్ర.. ఈ మధ్యే ప్రారంభింపబడిన మత్తికెరె వంతెన నిర్మాణం, అత్యధికంగా, పది సంవత్సరాలపాటూ సాగింది. కొద్ది నెలల క్రితం మొదలైన మెట్రో రైలు నిర్మాణం, అన్ని రికార్డులనూ తిరిగి రాస్తుందని, పూర్తి కావడానికి కనీసం ఇరవై ఏళ్ళన్నా పడుతుందని, ఇక్కడ వాళ్ళ గట్టి నమ్మకం!

ఇకపోతే, ట్రాఫిక్ ను నియంత్రించడానికి, ఇక్కడి యంత్రాంగం ఉపయోగించే గొప్ప ఆయుధం - "ఒన్ వే ట్రాఫిక్"! ఈ "ఒన్ వే"ల పుణ్యమా అని, మెయిన్ రోడ్డుకీ, చిన్న గల్లీకీ తేడా తెలియదు. ఎక్కడ, ఎప్పుడు,దేనిని ఒన్ వే చేస్తారో చెప్పలేము. కొన్నిసార్లు, పొద్దున్న ఆఫీసుకెళ్ళేటప్పుడు మామూలుగా ఉన్న రోడ్డు, సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి ఒన్ వేగా రూపాంతరం చెంది ఉంటుంది. దానికి తగ్గట్లు, వీళ్ళు రోడ్లకు పెట్టే పేర్లు కూడా చిత్రంగా ఉంటాయి. ప్రతీ రోడ్డుకూ ఒక నంబరు తగిలించి "ముఖ్య రస్త" లేక "అడ్డ రస్త" అని నామకరణం చేస్తారు. చాలా చోట్ల,ట్రాఫిక్ పరంగా ఈ రెండిటికీ పెద్ద తేడా లేకపోవడంతో, ఏది ముఖ్యరస్తానో,ఏది అడ్డరస్తానో తెలియక మనం జుట్టు పీక్కోవాలి. మా ఇంటినుంచి బస్టాండుకు (మెజిస్టిక్)రూటు పూర్తిగా అర్ధమవ్వడానికి దాదాపు ఒక సంవత్సరం పట్టింది. ఎందుకంటే, సగానికి పైగా రూటు ఒన్ వే. వెళ్ళే టప్పుడు ఒకదారి, వచ్చేటప్పుడు ఒకదారి. బస్సులో వస్తే ఒకదారి. ప్రి-పెయిడ్ ఆటోలో వస్తే ఇంకోదారి. బేరమాడుకున్న ఆటో అయితే, యే దారి అన్నది మన అదృష్టం, ఆటో వాడి మంచితనంపై ఆధారపడి ఉంటుంది. అందుకే, తప్పనిసరి పరిస్తితులలో ఆటో ఎక్కవలసి వస్తే, ముందుగా ఆ రోజు రాశిఫలాలు చూసుకుని, పెద్దగా ఆర్ధిక నష్టం లేదు అని నిర్ధారించుకున్న తరువాతే, ఆటో కోసం ప్రయత్నిస్తాను.

అన్నట్లు, ఆటో అంటే గుర్తుకొచ్చింది...బెంగుళూరు ఆటోవాళ్ళ గురించి ఇప్పటికే చాలామంది పుంఖానుపుంఖాలుగా రాసేసారు. కాబట్టి, నేనుకొత్తగా చెప్పొచ్చేది ఏమీ లేదు. నేను జీవితంలో ఎప్పుడైనా అత్యంత నిరర్ధకుడిగా, ఏమాత్రమూ విలువలేనివాడిగా ఫీలయ్యానూ అంటే, అది బెంగుళూరులోకొచ్చిన కొత్తల్లో, ఆటో కోసం ప్రయత్నించినప్పుడు మాత్రమే. మనమడిగిన చోటుకి రాకపోతే పోయే, కనీసం మనమడిగింది వినిపించుకున్నట్లు కూడా రియాక్షనివ్వరు. వాళ్ళ కాళ్ళమీద పడి బతిమాలి, నెల జీతం మొత్తం ఇస్తామని చెబితేకానీ, ఆటొ స్టార్ట్ చెయ్యరు. వీళ్ళ తీరుకి ఎంతగా బెదిరిపోయానంటే, నాకు మా ఆవిడకంటే, ఈ ఆటో వాళ్ళంటేనే ఎక్కువ భయం.

బెంగుళూరుకొచ్చే ప్రతీ తెలుగువాడినీ అయోమయంలో పడేసే విషయం - ప్రతీ చిన్న చితకా రెస్టారంటు మీద కనపడే బోర్డు "ఆంధ్రా స్టైల్ మీల్స్"! బహుశా, అంధ్రా భోజననానికి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇంత పాపులారిటీ ఉండదేమో. కాకపొతే, ఆంధ్రా మీల్స్ అన్న పేరుతో వీళ్ళు వడ్డించే నానా గడ్డీ చూస్తే, మనం తెలుగు మర్చిపోవడం మాత్రం ఖాయం!

మీరు శాకాహరి అయితే, మీరు బెంగుళూరులో తప్పకుండా వెళ్ళవలసిన ఫుడ్ కోర్టు - “ఇస్కాన్ టెంపుల్”. ఇక్కడ, సమోసా నుంచి పిజ్జాలవరకూ, మిరపకాయ బజ్జీలనుంచీ బర్గర్ల వరకూ, అన్ని రకాల తినుభండారాలు లభిస్తాయి (అన్నీ వెజిటేరియనే సుమా!). ఇక్కడ గుడికంటే, భోజనాలయమే పెద్దది. మీకు కాస్త రియల్ ఎస్టేట్లో ఆసక్తి ఉంటే, ఇస్కాన్ వాళ్ళు కట్టిస్తున్న అపార్టుమెంట్ల గురించి కూడా తెలుసుకోవచ్చు. ఈ కుర్రసన్యాసుల మార్కెటింగ్ సామర్ధ్యం ముంధు క్రెడిట్ కార్డులమ్మే ఎక్సిక్యూటివ్సు కూడా ఎందుకూ పనికిరారు. ఆన్నట్లు, ఈ ఇస్కాన్ టెంపుల్లోఓ మూలన దేవుడు కూడా వుంటాడ్లెండి.

ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, సాఫ్టువేరు ఉద్యోగి కానివాడి పాలిట, ఈ బెంగుళూరు నిజంగా 'బెంగ'లూరే! కామిగానివాడు మొక్షగామి కాలేడన్నట్లు, సాఫ్టువేరు ఇంజనీరు కానివాడు, బెంగుళూరువాసి కాలేడు. ముఖ్యంగా, నాబోటి బ్యాంకు ఉద్యోగికైతే మరీను. వారంలో అయిదురోజులు మాత్రమే పనిచేసే వాళ్ళ అదృష్టం చూస్తే నాకు కించిత్ ఈర్ష్య. సాఫ్టువేరు ఉద్యోగి కానివాడికి ఇల్లు అద్దెకు దొరకడం మరీ కష్టం. బ్రహ్మచారి అయితే అంటరానివాడితో సమానం!

చివరిగా, బెంగుళూరు గిగాబైట్లకే కాదు, డాగ్ బైట్లకు (కుక్క కాట్లకు) కూడా ప్రసిద్ధి. నెలకు, సగటున, మూడువేలమంది బెంగుళూరువాసులు కుక్కకాటుకు గురౌతారని ఒక అంచనా. The joke is – Bangalore is famous for three: Software professionals, Girls and Stray Dogs!

12 comments:

బళ్ల సుధీర్ said...

ayya

iam also in balgaore only

but i thoughth this kammada people are very good
friendly natured

uma blog said...

neevu heliddu nija

దేవన said...

ఈ కార్టూన్స్ చూడండి,,
http://treebeard31.wordpress.com/2006/08/26/about-bangalore/

Techie said...

హ్హ హ్హ హ్హ.......బెంగలూరులో గత రెండు సంవత్సరాలుగా నేను చూస్తున్న...అనుభవిస్తున్న సంగతులు అన్నీ భలే సరదాగా చెప్పారు....
పైన కామెంట్లో ఉన్న కార్టూన్ సూపర్......

రాధిక said...

కళ్ళకు కట్టినట్టు చెప్పాఉ సార్.ఈ కష్టాలన్నీ బ్లాగర్ల పుణ్యమా అని కామెడీ అయిపోయాయి :).
బ్లాగర్లలో బెంగుళూరు వాళ్ళు ఎక్కువయిపోతున్నారు.సమావేశాలు మొదలెట్టొచ్హేమో ఇక.

రిషి said...

భలే రాసారు :)))

అది నమ్మ బెంగలూరు కాదు ....హమ్మో బెంగలూరు :)

మేధ said...

>>నేను జీవితంలో ఎప్పుడైనా అత్యంత నిరర్ధకుడిగా, ఏమాత్రమూ విలువలేనివాడిగా ఫీలయ్యానూ అంటే, అది బెంగుళూరులోకొచ్చిన కొత్తల్లో, ఆటో కోసం ప్రయత్నించినప్పుడు మాత్రమే

ఇది మాత్రం పచ్చి నిజమండీ.. ఆటో వాళ్ళందరితోను ఇల్ల అనిపించుకున్న తరువాత, ఇంకా ఎందుకు జీవించి ఉన్నానా అనిపిస్తుంది!!

ఇస్కాన్ గురించి కూడా చాలా కరెక్ట్ గా చెప్పారు...

rams2303 said...

chaala baaga chepparu andi. Mee vyasam chdivaka gani nenu konni observe cheyaledu. Udaharana ki BSNL mobile lo vache not reachable.

Venky said...

Chala baga raasaru...bangalore lo 1995 to 1999 lo naaku edurina auto anubhavaalu gurthu chesaru...ee auto vaalla valla malli bangalore lo work cheyakoodadu anukunnanu.

GIREESH K. said...

@ సుధీర్,
I never said that they are bad.

@ Uma,
Thanq.

@ దేవన గారు,
బెంగుళూరు పై మీరు ఇటీవల రాసిన టపా, ఈ కార్టూన్లు... రెండూ అదిరాయండి!

@ techie,

thanks for the comment.

@ రాధిక గారూ,
బెంగళూరు తెలుగు బ్లాగర్ల సమావేశానికై నేనుకూడా ఎదురుచూస్తున్నానండీ...

@ రిషీ,
వామ్మో ...బెంగుళూరో...

@ మేధ,
బెంగుళూరు ఇస్కాన్ గురుంచి ఎంత రాసినా తక్కువేనండీ...

@ rams & venky,
thank you...

Bolloju Baba said...

చాలా బాగుంది. హాయిగా నవ్వుకొనేలా ఉంది. కొన్ని వర్ణనలు అదిరి పోయినయ్.
మచ్చుకి,
మనం కాల్ చేసిన వ్యక్తి మనపక్కనే నిలుచుని వున్నా కూడా, ఈ ప్రకటన వినిపిస్తుందనుకోండి, అది వేరేవిషయం.
గణెశో బారో & రెస్టారంటో (అయ్యో అమ్మో & ఓరి నాయనో)"
వీళ్ళ తీరుకి ఎంతగా బెదిరిపోయానంటే, నాకు మా ఆవిడకంటే, ఈ ఆటో వాళ్ళంటేనే ఎక్కువ భయం.

చాలా కాలం తరువాత జాలీ రీడింగ్ ని ఇచ్చిన పోస్ట్.

బొల్లోజు బాబా

Anonymous said...

మా హై. కు మీ బెంగ. సరిజోడన్నమాట! మా ఊళ్ళో ఒక పైదారి (ఫ్లైవోవరు) కథ చెప్పాలి. ఒకేపు నుంచి కట్టుకుంటూ లేపుకొచ్చారు. ఇక అవతలేపున దింపాలి కదా.. అక్కడే వచ్చింది చిక్కు -ఎటేపు దించాలో తెలీలా! కొన్నేళ్ళు చూసాక ఇక లాభం లేదనుకుని ఒహ గల్లీలోకి దింపారు. తెలుగుతల్లి పైదారి దానిపేరు -సచివాలయం ముందుదే.