Saturday, December 6, 2008

నిస్తేజం..నిర్వేదం..నిర్లిప్తం!

అనగనగా ఒక దేశం!

చాలా పెద్ద దేశం!

ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన దేశం! ఎంత ఘనం అంటే, ఒకప్పుడు ఈప్రపంచానికే, చాలా విషయాల్లో దిశా నిర్దేశం చేసిన ఘనకీర్తి దాని సొంతం!

ఆ దేశప్రజలు కూడా, తమ దేశానికిమల్లే ఎంతో విలక్షణమైన స్వభావం కలిగిన వాళ్ళు - జనాభాలో అధికశాతం ఉష్ట్రపక్షులు.ఈ ఉష్ట్రపక్షులు, తమ చుట్టూ రేగే తుఫాను ఎంత తీక్షణమైనదైనా,ఇసుకలో తలదూర్చి, తుఫాను తగ్గే వరకు ఎదురుచూసి, ఆ తరువాత దులుపుకొని వెళ్ళిపోతుంటాయి. తనూ, తనచుట్టూ గీసుకున్న చిన్న వృత్తం - ఇవే వీటికి పరమావధి. ఇవి, తుఫాను తరువాత ఇసుక విదిల్చుకొనడం చూసి, వీటిల్లో మార్పు వచ్చిందనుకుంటే, మనం పప్పులో కాలేసినట్లే. మళ్ళీ, తుఫానొచ్చేవరకు, వీటి ప్రస్తానం ఇంతే. తమ హక్కులుతప్ప భాద్యతలు పట్టించుకోని ఈ ఉష్ట్రపక్షులు, చదువుకున్న మధ్య తరగతి శ్రేణికి చెందినవి.

ఆ తరువాత చెప్పుకోవలసింది గొంగళిపురుగులు గురించి. ఇవి మేధావి వర్గానికి చెందినవి. తమ తెలివితేటలతో,వాదనా పటిమతో, ఏ విషయమ్మీదైనా అనర్గళంగా తమ అభిప్రాయాల్ని శలవిస్తుంటాయి. వీటికి ప్రపంచమే ఒక వేదిక. పుస్తకాలు, పత్రికల్లో వ్యాసాలూ గట్రా వ్రాస్తూ, టీవీ టాక్ షోల్లో సామాజిక స్థితిగతుల్ని విశ్లేషిస్తూ గొప్ప దేశసేవ చేస్తున్నామన్నట్లు ఫోజు కొడతాయి. అడపాదడపా వచ్చే బుకర్స్ ప్రైజులూ,పద్మశ్రీ అవార్డులూ, ఈ గొంగళి పురుగులకి అదనపు అలంకారం.

ఇకపోతే, బానిస చీమలు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్తితి వీటిది. వీటిలోకం వీటిది. ఉష్ట్రపక్షులు వీటినెలాగూ పట్టించుకోవు. కానీ, గొంగళిపురుగులు మాత్రం,ఈ బానిసచీమల్ని ఉద్దరించడమెలా అని తీవ్రంగా తర్కిస్తూ, విశ్లేషిస్తూ తమ పబ్బం గడుపుకుంటుంటాయి. అయితే, ఎవరెన్ని చేసినా ఈ చీమల తలరాత మాత్రం మారదు.

ఇక మిగిలింది గుడ్లగూబలు, నల్లులు, పందికొక్కులు. వీటి సంఖ్యాబలం తక్కువే అయినా, ఇవి పాలక వర్గానికి చెందినవి. వీటి గురించి కాస్త వివరంగా తెలుసుకుందాము.

ఈ దేశం తన స్వాతంత్ర్యాన్ని అరవై యేళ్ళకిందటే సాధించినా, ప్రజాస్వామ్య దేశంగా ఆవిష్కరించుకున్నా, తరతరాలుగా అలవడిన బానిసత్వం మాత్రం రాచరికవ్యవస్తని సజీవంగా ఉంచింది. ఈ దేశపు రాజకీయాలు మొత్తం ఒకే ఒక కుటుంబం చుట్టూ తిరుగుతుంటాయి. గుడ్లగూబలు, పందికొక్కులూ,జలగలూ, నల్లులూ మొదలైన పాలకవర్గపు జీవులు, మనుగడకోసం, ఈ కుటుంబమ్మీదే ఆధారపడి ఉన్నాయి. వీలైతే ఈ కుటుంబాన్ని పొగిడి, లేకపొతే తెగిడి, తమ ఉనికిని చాటుకుంటుంటాయి. చిత్రమేమిటంటే, అధికారంలో ఉన్నా, లేకున్నా, ఈ దేశ రాజకీయాలన్నీ, ఈ కుటుంబం చుట్టే పరిభ్రమిస్తుంటాయి.

ప్రస్తుతం ఈ కుటుంబం పెద్ద, రాజమాత. యువరాజు పట్టాభిషేకానికి ఇంకా సిద్ధమవ్వలేదు కాబట్టి, అంతవరకూ సింహాసనం చేజారిపోకుండా జాగ్రత్తగా కాపుకాస్తోంది. అందులో భాగంగానే, యువరాజు పూర్తిగా సన్నద్ధమయ్యేంతవరకు,సింహాసనమ్మీద ఒక వానపామును కూర్చొబెట్టింది. ఈ వానపాము బాగా చదువుకున్నదే అయినా, దానికి వెన్నుముక లేకపోవడం రాజమాతకు బాగా కలిసొచ్చింది. యువరాజు రాజకీయ భవిష్యత్తుకి, ఈ వానపాము వలన ఏమాత్రమూ ప్రమాదం లేదనే నమ్మకంవల్లే సింహాసనాధీష్టానికి రాజమాత ఒప్పుకుందనే సత్యం తెలిసినా, ఆమెను ఒక త్యాగశీలిగా అభివర్ణిస్తాయి ఇక్కడి గొంగళిపురుగులు. బానిస చీమలు ఔరా, నిజమే కాబోలు అని నమ్మేస్తాయి. ఇకపోతే,ఉష్ట్రపక్షులకి ఈవిషయం ఎలాగూ పట్టదు. ఎందుకంటే, ఓటు వెయ్యమని ప్రభుత్వమిచ్చిన శలవుని,ఈ ఉష్ట్రపక్షులు విహారయాత్రకు ఉపయోగించుకుంటాయి కాబట్టి. ఇంకో మాట చెప్పాలంటే, ఈ దేశ జనాభాలో అధికశాతమైన ఈ ఉష్ట్రపక్షుల అలసత్వమే, ఈ రాబందులపాలిట వరం.

ఈ నేపధ్యంలో, తను నియమించిన వానపాము ద్వారా,తన వందిమాగధులైన ఇతర గుడ్లగూబల సహకారంతో,ఈ దేశాన్ని జనరంజకంగా రాజమాత పరిపాలిస్తుండగా, ఒక పెద్ద విపత్తు సంభవించింది. పొరుగు దేశానికి చెందిన కొన్ని రాబందులు ఈ దేశంపై దండెత్తాయి.

ఇటువంటి దాడులకి ఈ దేశం చాన్నాళ్ళక్రితమే అలవాటు పడింది. సాధారణంగా, ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు, ఒకట్రెండు రోజులపాటు గొంగళిపురుగుల ఉపన్యాసాలు, టీవీల్లో టాక్ షోలు, వానపాము ప్రధానమంత్రి ఇచ్చే భరోసా, ముష్కరుల అంతుచూస్తామనే అంతర్గత భద్రతాశాఖామాత్యుని ఉత్తరకుమార ప్రగల్భాలు....ఇంతలో ఉష్ట్రపక్షులు దులుపుకొని తమ తమ వృత్తాల్లోకి వెళ్ళిపోతాయి..చీమలు మళ్ళీ పనిలో పడిపొతాయి... అహా ఏమి స్థైర్యము అని జబ్బలు చరుచుకుని, జరిగిన ఘోరాన్ని అంతా మరిచిపోతారు. కానీ, దురదృష్టవశాత్తూ, ఈసారి రాబందుల దాడి కాస్త తీవ్రంగానే ఉంది.

నెమ్మదిగా తేరుకున్న వానపాము, అధికారంలో ఉన్న గుంటనక్కలూ, పందికొక్కులు, వీటన్నిటికీ పెద్ద దిక్కైన అమ్మ ఇంట్లొ సమావేశమై, ఏమి చెయ్యాలని చర్చించసాగాయి. అమ్మ చాలా కోపంగా ఉంది. యువరాజు కోసం చాలా జాగ్రత్తగా కాపుకాస్తున్న సిం హాసనం కాస్తా, పట్టాభిషేకమహోత్సవం దగ్గరపడుతున్న తరుణంలో చేజారిపోయే పరిస్తితి. అమ్మ కోపంతో ఊగిపోతూంది. "మనమేదో ఒక్కటి చెయ్యాలి", ఆ భయంకరమైన నిశ్శబ్ధాన్ని పోగొట్టడానికా అన్నట్లు, అమ్మ బూట్లు తుడుస్తున్న వానపాము అంది. "సంభవామి యుగే యుగే,అని గీతలో చెప్పారు.దేవుడు తప్పకుండా ఏదో ఒకటి చేస్తాడు", అమ్మ మనుమల్ని ఆడిస్తున్న అంతర్గత వ్యవహారాలు చూసే ముసలి నక్క అంది. ఈ నక్క గతంలో భగవద్గీతమీద ఒక పుస్తకం కూడా వ్రాసిందిలెండి, అందుకే దాన్ని ఉదహరిస్తూంటుంది. కానీ అమ్మ ఒక్కసారిగా ఉరిమి చూసేసరికి, నక్క టక్కున నోరు మూసేసింది. "అసలు నిన్ను మంత్రిని చెయాడమే నా బుద్ది తక్కువ.." అమ్మ కోపంతో ఊగిపోతూంది.సలహా కోసం అన్నట్లు, గొప్ప న్యాయవాదిగా పేరున్న ఇంకో గుంటనక్కవైపు చూసింది.

"ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చెయాలి. ముఖ్యంగా, ఆ రాబందుల మతం గురించి అస్సలు మాట్లాడకూడదు. మనకున్న బలమంతా ఈ మతంవాళ్ళే. కాబట్టి, ఎవ్వరూ నోరు జారకుడదు", గుంటనక్క అందరికీ జాగ్రత్తలు చెబుతోంది.

"ఆ వృద్ద జంబూకం కాసుక్కూచుంది. బాబుని అందలమెక్కించడానికి అంతా సిద్దం చేసుకుంటున్న సమయంలో, ఇలా జరిగింది" మాటలు వంటింట్లోంచి వినబడడంతో, అంతా అటుతిరిగారు. కోపంగా ఉన్న అమ్మని చల్లబరచడానికోసం పళ్ళరసం తీసుకొస్తూ, ఆ దేశ రాష్ట్రపతి కనబడింది. ముందు జాగ్రత్తగా, బాబు పట్టాభిషేకానికి ఎటువంటి అడ్డూ ఉండకూడదని, గతంలో తన ఇంట్లో పనిచేసిన వంటకత్తెనే రాష్ట్రపతిని చేసింది అమ్మ.

ఎంతో జాగ్రత్తగా వేసిన ప్లాను ఇలా బెడిసికొట్టడంతో కోపంతో ఊగిపోతున్న అమ్మను చల్లబరచడమెలాగో ఎవ్వరికీ అర్ధం కావట్లేదు.

కాసేపు తర్జనబర్జనలు పడి, అమ్మ వందిమాగధులంతా కలిసి, తప్పంతా ఆ ముసలి నక్కదే అని నిర్ణయించేసి, దాని చేత రాజీనామా చేయించేసారు. కుర్చీ కోసం మారాం చేస్తున్న యువరాజుని బుజ్జగించి, వానపాముని తీసుకుని అమ్మ దాడిజరిగిన ప్రాంతాన్ని చుట్టివచ్చింది. ఈ విపత్తుకి కారణమైన రాబందుల్ని తుడముట్టిస్తామని భీకర ప్రతిజ్ఞ చేసింది వానపాము. ముసలినక్క ఖాళీ చేసిన కుర్చీలో, ఇంకో నక్కని కూర్చోబెట్టింది అమ్మ. వానపాము ప్రభుత్వం అలసత్వాన్ని ఎండగట్టి, వీలైతే ఎన్నికల్లో గెలిచి, ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోవచ్చని వృద్ద జంబూకం మళ్ళీ దేశమ్మీద పడింది. అమ్మ చుట్టూ ఉండే పందికొక్కులంతా కలిసి అమ్మకుటుంబం ఇన్నాళ్ళూ చేసిన త్యాగాన్ని ఏకరువు పెట్టి, ఇప్పుడు జరిగిన ఘోరం అమ్మ కుటుంబానికి జరిగిన విపత్తుకంటే చాలా చిన్నదని చెప్పే ప్రయత్నం మొదలు పెట్టాయి. సందట్లో సడేమియా అని, గొంగళిపురుగులన్నీ మహా ఘాటుగా ఉపన్యాసాలు దంచేస్తున్నాయి. టీవీ చానెళ్ళన్నీ, భావోద్వేగాలతో కూడిన కార్యక్రమాల్ని ప్రసారం చేస్తూ తమ తమ టీఆర్పీల్ని పెంచుకున్నాయి.

రెక్కాడితే కానీ డొక్కడాని బానిస చీమలు, మళ్ళీ తమ జీవనపోరాటంలో మునిగిపోయాయి.

ఇసుకలో తలదూర్చి, ఈ గొడవ సద్దుమణిగే వరకు ఎదురుచూసిన ఉష్ట్రపక్షులు, మెల్లగా విదిల్చుకుంటున్నాయి. కాకపోతే, ఈసారి మాత్రం వాటికి తమ భవిష్యత్తు గురించి కాస్త చింత కలిగింది. కాస్త కదలిక వచ్చినట్లే ఉంది. కానీ, ఈ చైతన్యం ఎన్నాళ్ళుంటుంది? కనీసం రెండువందలమంది అమాయకుల ప్రాణత్యాగమైనా ఈ దేశంలో మార్పుకి కారణమౌతుందా? మతం పేరుతో, కులం పేరుతొ, భాష పేరుతొ ప్రజల్ని విజయవంతంగా విడకొట్టి, తమ పబ్బం కడుపుకుంటున్న ఈ పందికొక్కుల్ని, ఈ చైతన్యం నిలువరించగలదా? అన్నిటికంటే ముఖ్యంగా, దేశ రాజకీయానికి పట్టిన నపుంసకత్వాన్ని, ఈ చైతన్యం వదిలించగలదా?

**** ****

ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో,
ఎక్కడ మనుషులు తలెత్తి తిరుగుతారో,
ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో,
సంసారపు గోడలమధ్య ఎక్కడ భాగాలకింద ప్రపంచం విడిపోలేదో,
ఎక్కడ సత్యాంతరాళంలోంచి పలుకులు బైలు వెడలతాయో,
ఎక్కడ అలసటనెరగని శ్రమ తన బాహువుల్ని పరిపూర్ణతవైపు జాస్తుందో,
ఎక్కడ నిర్జీవమైన ఆచారపుటెడారిలో స్వచ్చమైన బుద్ది ప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో,
ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకి, కార్యాలలోకి నీచే నడపబడుతుందో,

ఆ స్వేచ్చా స్వర్గానికి, తండ్రీ, నాదేశాన్ని మేల్కొలుపు.

- గీతాంజలి, టాగోర్ (చలం)

9 comments:

Sarath said...

చాలా బాగా రాసారు.

రిషి said...

చైతన్యం మాట తెలీదుగానీ, ఖచ్చితంగా జనాల్లో (మీరన్న ఉష్ట్రపక్షులు) కదలిక వచ్చింది. లేకపోతే ఎప్పుడు ఏం జరిగినా 'కొవ్వొత్తులు ' వెలిగించి రెండునిమిషాలు మౌనం పాటించే జనం... ముంబై వీదుల్లో రాజ్ థాక్రే మొదలు విలాస్రావ్ దాకా ఎవడు కనిపిస్తే వాడ్ని మొహాన వుమ్మేసారు.

మీరు చెప్పిన ఉష్ట్రపక్షులు నిజానికి తమ బ్రతుక్కి ఎవరిమీదో (ముఖ్యంగా ప్రభుత్వం మీద) ఆదారపడడం తక్కువ...అందుచేతనేకావచ్చు ఏంజరిగినా తను,తన కుటుంబం క్షేమమా అని చూసుకుని దులుపుకుని మళ్ళీ తన దారిన పోతాడు...కానీ ఈసారి తనక్కూడా డౌట్ వచ్చేసింది ఒకపక్క బ్రతకడానికి తనతిప్పలేవో తను పడుతుంటే , ఈ టెర్రరిస్టులు వాళ్ళకన్న ప్రమాదకరంగా మారిన రాజకీయనాయకులు తనను సుఖంగా బ్రతకనిచ్చేటట్టు లేరని అర్ధమయ్యింది...అందుకే ఇసుకదులుపుకుని ఇప్పుడే ఆలోచించడం మొదలెట్టేడు.

KumarN said...

ఏం గిరీష్, చాలా రోజులకు కనబడ్డారు?
బాగా రాసే మీరు కూడా మొఖం చాటెస్తే ఎలా?

"తమ హక్కులుతప్ప భాద్యతలు పట్టించుకోని ఈ ఉష్ట్రపక్షులు, చదువుకున్న మధ్య తరగతి శ్రేణికి చెందినవి"

You nailed it right there. A very high significant part of us forget that rights and responsibilities go hand in hand. They have go together.

ఇకపోతే గొంగళిపురుగులు గురించి, I completely agree

Kathi Mahesh Kumar said...

మీ పదచిత్రణా పరిస్థితి వర్ణణా రెండూ బాగున్నాయ్! ఇలా మనుషుల్లాగే స్పందిస్తే ఎంత హృద్యంగా ఉంటుంది.

కానీ ఏంచేద్దాం, చాలా మంది కేవలం భావజాలంతోనే స్పందించగలం.అక్కడే సమస్యకు సమాధానంకన్నా సమస్యను మరింత జటిలం చేసుకునే తంత్రాలే కనిపిస్తాయ్.

యోగి said...

At last, a sane voice!!


"ఆ తరువాత చెప్పుకోవలసింది గొంగళిపురుగులు గురించి. ఇవి మేధావి వర్గానికి చెందినవి. తమ తెలివితేటలతో,వాదనా పటిమతో, ఏ విషయమ్మీదైనా అనర్గళంగా తమ అభిప్రాయాల్ని శలవిస్తుంటాయి. వీటికి ప్రపంచమే ఒక వేదిక. పుస్తకాలు, పత్రికల్లో వ్యాసాలూ గట్రా వ్రాస్తూ, టీవీ టాక్ షోల్లో సామాజిక స్థితిగతుల్ని విశ్లేషిస్తూ గొప్ప దేశసేవ చేస్తున్నామన్నట్లు ఫోజు కొడతాయి. అడపాదడపా వచ్చే బుకర్స్ ప్రైజులూ,పద్మశ్రీ అవార్డులూ, ఈ గొంగళి పురుగులకి అదనపు అలంకారం."


You are right on! These lunatics, my friend, are the bane of society.

an old adage comes to my mind. "Some wars are won by choosing not to fight them." The more I observe, more I feel politics is one of those(This is my perception). If we dethrone congress and BJP or the Left and kill em all(I am not suggesting you kill em all.. its just an assumption), some other parties will come to power and trust me the situation won't be any different. The only difference will be the names. If history is to be trusted, this is a logical observation.

The reason is this, as long as underlying theories, assumptions which a society is based on are intact , juggling parties, political reforms are futile. I have a monumental hatred for our lunatic intellectuals, who instead of using their energies on thinking about those fundamental assumptions/theories of the society, spend their time and energies on perpetuating borrowed ideas and pass them for knowledge.

VENKAT SEETHA said...

"ఎవరో వస్తారని! ఎదో చేస్తారని!!
ఎదురు చూసి మోసపోకుమా!
నిజం మరచి నిదురపోకుమా!!"
అని ఏనాడో శ్రీ శ్రీ హెచ్చరించారు, అయినా ఉష్ట్రపక్షులు ఈ మారరు.
మారతారని అశిద్దాం!!

Unknown said...

మీ ఆవేదన అర్ధం చేసుకోదగినది. అది అందరిదీ.

మీరు పుస్తకాలు, పత్రికల్లో వ్యాసాలూ గట్రా వ్రాస్తూ, టీవీ టాక్ షోల్లో సామాజిక స్థితిగతుల్ని విశ్లేషిస్తూ గొప్ప దేశసేవ చేస్తున్నామన్నట్లు ఫోజు కొట్టేవాళ్ళ గురించి ఆవేదనగా రాశారు.

సామాజిక విషయాలమీద బ్లాగులలో రాసేమనం నిర్మాణాత్మకంగా, కార్య శీలకంగా ఏమీ చేయక (లేక) పోతే ఎవరో ఒకరు సమీప భవిష్యత్తులోనే మనల్ని కూడా ఆ లిస్టులో జమకట్టేస్తారు.

కాబట్టి, మనమేవిధంగా నిర్మాణాత్మకంగా ఉండాలో కూడా అందరూ రాయాలి. అలాంటి వాటిని చదవాలి. ప్రొత్సాహం అందించాలి.

GIREESH K. said...

@ Sarath,

Thank you very much.

@ రిషి,
కనీసం, ఇంతమంది అమాయకుల రక్తపాతమైనా ఈ ఉష్ట్రపక్షుల నిద్రని కడిగేస్తుందనే నా ఆశ.

నాకు బాగా గుర్తుంది. క్రితంసారి ఎన్నికలప్పుడు, నేను ముంబైలోనే ఉన్నాను. అక్కడ పోలింగ్ శుక్రవారం నాడు జరిగింది. ఆ వారాంతంలో, ముంబై చుట్టుపక్కల ఉన్న అన్ని రిసార్ట్స్, పిక్నిక్ స్పాట్సు కళకళలాడాయి. కలిసివచ్చిన శలవుని, ముంబైవాసులు విహారయాత్రకెళ్ళడానికి ఉపయోగించుకున్నారే కానీ, వోటు వేయడమనే తమ భాద్యతను అసలు పట్టించుకోలేదు. పోలింగ్ కూడా 50-55% జరిగినట్లు గుర్తు.

ఇప్పుడొచ్చిన చైతన్యం, వాళ్ళు వెలిగించిన కొవ్వొత్తుల్లా, కొద్దిరోజులకే ఆరిపోదని ఆశిద్దాం!

@ Kumar,

Thank your verymuch for following my blog.

పని ఒత్తిడివలన, రాయడం కాస్త తగ్గింది. అంతేకానీ, రాయడం పూర్తిగా అపేయలేదు. ఇది కూడా, మూడు రోజులపాటు నా మార్నింగ్ వాక్ ని త్యాగం చేస్తే కానీ, ఈ పోస్ట్ పూర్తిచెయ్యలేకపోయాను.

GIREESH K. said...

@ కత్తి మహేష్ కుమార్,

పరవళ్ళు తొక్కే ఆవేశం, అప్పుడప్పుడూ అలోచనను పక్కకు తోసేస్తుంది.


@ యోగి,
Thanks a lot for your complement.

ఇరవైనాలుగ్గంటల న్యూస్ చానెల్సు పుణ్యమా అని, మన డ్రాయింగ్ రూముల్లోకి చొరబడ్డ ఈ గొంగళిపురుగులని చూసినప్పుడల్ల, నాకు తిలక్ మాటలే గుర్తుకొస్తాయి:

దేవుడా
రక్షించు నా దేశాన్ని
పవిత్రులనుండి, పతివ్రతలనుండి
పెద్దమనుషులనుండి, పెద్దపులులనుండి
నీతుల రెండు నాల్కలు సాచి బుసలుకొట్టే
నిర్హెతుక కృపా సర్పాలనుండి,
లక్షలాది దేవుళ్ళనుండి, వారి పూజరులనుండి,
వారివారి ప్రతినిధులనుండి,
సిద్దంతకేసరులనుండి, సిద్దులనుండి,
శ్రీ మన్మద్గురు పరంపరనుండి.

@venkat,

ఓ ఇంగ్లీషు సామెత అన్నట్లు, ఏనుగులను నర్తింప చేయడం కష్టం, కానీ అవి నర్తించిన నాడు ఎవ్వరూ వాటి దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేరు.

పదిమంది తెగించిన యువకులచేతిలో, నూరుకోట్ల జనాభా కల ఈ దేశం, పరువు, ప్రతిష్టా మంటగలిసి,ఈ దేశపౌరులమైన మన అస్తిత్వానికే సవాలు ఎదురైన ఇప్పుడు కూడ మనం మేలుకొనకపోతే,ఈ దేశాన్ని ఎవ్వరూ కాపాడలేరు.

@ సీతారాం రెడ్డి గారు,

గొంగళిపురుగుగా మిగిలిపోకుండా, నిర్వర్తిచవలసిన భాద్యతను చాలా సున్నితంగా గుర్తుచేసారు.

Thank you very much.