అమావాస్య రాత్రిని నిందించలేను, దాని గర్భంలో దాగిన సహస్రకిరణపిండం కోసం ప్రతిక్షణం నా ప్రతీక్షణం - సినారె
Sunday, August 23, 2009
అమ్మకు అశ్రునివాళి!
'అమ్మ ' పదానికి నిండు అర్ధం
మానవత్వపు నిలువటద్దం,
మంచితనానికి మనిషి రూపం,
నా జన్మజన్మల అదృష్టం
నీ ఋణం ఎలా తీర్చుకోను?
పీడకలకు బెదిరిపోయి
నిద్రలేచి ఏడుస్తుంటే,
గుండెకదుముకొని జోలపాడి
ఊరడించిన నిండు పున్నమి
నీ ఋణం ఎలా తీర్చుకోను?
కష్టాల చీకటిలో చిక్కుకొని
దిక్కుతోచక నిలచిపోతే,
వెలుగుదివ్వెగ మారి నాకు
దారి చూపి కరిగిపోయిన వెన్నెలమ్మా,
నీ ఋణం ఎలా తీర్చుకోను?
అలసటెరుగని బ్రతుకుపోరులో
బాధనంతా తొక్కిపెట్టి,
నవ్వు మాత్రం మాకుపంచి
నువ్వేమో మాయమైతివి, మాతృమూర్తీ,
నీ ఋణం ఎలా తీర్చుకోను?
రెక్కలొచ్చిన బిడ్డ ఎగిరిపోతే,
మధ్య పెరిగిన దూరాన్ని మరచి,
బిడ్డ ఎగిరిన ఎత్తు చూసి
మురిసిపోయిన పిచ్చితల్లీ,
నీ ఋణం ఎలా తీర్చుకోను?
గోడమీద వాలిన కాకి అరిస్తే,
బిడ్డ వస్తాడన్న ఆశ,
వీలు పడక రాలేదని
సర్దిచెప్పుకున్న వెర్రితల్లీ,
నీ ఋణం ఎలా తీర్చుకోను?
నుదిటి మీద వెచ్చని ముద్దు,
నువ్వు పెట్టిన గోరుముద్ద,
నిద్రపుచ్చిన పిట్టకథలు,
నాకుమిగిలిన తీపిగురుతులు.
అమ్మా, నీ ఋణం ఎలా తీర్చుకోను?
నా ఎదుగుదలకు పునాదివి,
గుండెనిండా స్థైర్యానివి,
బ్రతుకుబాటన మార్గదర్శివి,
ప్రాణమిచ్చిన పసిడిముద్దా,
నీ ఋణం ఎలా తీర్చుకోను?
కళ్ళముందే పువ్వులా
నువ్వు కరిగిపోతుంటే,
నెలరోజుల పోరాటం
నిన్ను నిలుపలేకపోతుంటే,
వెక్కిరించిన నిస్సహాయత...
అమ్మప్రేమకు నోచుకోని
కన్నుకుట్టిన దేవుడు,
స్వర్గానికి నిన్ను
పిలుచుకెళ్ళాడు కాబోలు...
గుండెనిండా తీపిగురుతులు,
తోడుగా ముప్పైఅయిదేళ్ళ అనుబంధం,
ఉబికివచ్చే కన్నీళ్ళు,
ఇవి మాత్రమే మిగుల్చుకున్న అసక్తుణ్ణి!
అందనంత ఎత్తులో ఉన్న నిన్ను
అక్షరాలలో ఆవిష్కరించాలన్న
నా వృధా ప్రయత్నం,
నీవు నేర్పిన మాటలే
గుండెగొంతున కొట్టుకుంటూ,
కన్నీరుగా మారి
మసకబారిన చూపు..
నిశ్శబ్ధంగా రోదించడం తప్ప
ఏమీ చెయ్యలేని అసక్తుణ్ణి!
నన్ను మన్నించు అమ్మా...అసక్తుణ్ణి నేను.
(నెలరోజులపాటూ మణిపాల్ హాస్పిటల్లో సాగించిన పోరాటం వృధా అయ్యి, నిస్సహాయుణ్ణై నేను చూస్తుండగానే, జూలై పంతొమ్మిదిన, యాభై ఏడేళ్ళ వయసుకే ఇక శలవంటూ వెళ్ళిపోయిన అమ్మకు స్మృత్యంజలి - గిరీష్.)
Monday, January 26, 2009
రాధామాధవీయం!
తన ఓటమిని అంగీకరిస్తూ, చీకటిని ఆహ్వానించడానికి పశ్చిమాన భానుడు సిద్దమౌతున్నాడు. ఆకాశంలో అరుణం బూడిదరంగులోనికి మసకబారుతూ, రాత్రిని స్వాగతిస్తోంది. క్షణక్షణానికీ పెరుగుతోన్న సాయంకాలపు నీడలను తన హృదయానికి హత్తుకుంటూ, మందగమన అయిన యమున, లయబద్దమైన తన గలగలతో బృందావనాన్ని జోకొట్టడానికి సిద్దంగాఉంది. చీకటివెలుగులకు తన వెండిమెరుపులను అద్దడానికి చంద్రుడు ఉత్సాహంగా ఉరకలువేస్తున్నాడు.
కానీ, యమున హొయలనూ, చంద్రుడి ప్రభనూ గమనించే స్థితిలో బృందావనమూ, అందులోని గోపకాంతలూ లేరు. తమ మానసచంద్రుడైన ఆ నందనందనుడు చెంతలేని లోటును, ఆ శరత్చంద్రుడేమాత్రం పూరించగలడు? ఆ మురళీకృష్ణుడి వేణుగాన సమ్మోహనాన్ని, శరత్పూర్ణిమ చల్లదనం మరిపించగలదా?
దారిపొడవునా తమ హృదయపు తివాచీని పరచి, చూపులతో తోరణాలల్లి ఆ లీలామోహనుడి రాకకోసం ఎదురుచూస్తున్నారు ఆ గోపికలు.
విరహబాధను ఓపలేని ఓ గోపిక, "కన్నయ్య మనతో ఉన్నంత సేపు ఘడియలు క్షణాలౌతాయి. తను మనచెంత లేనప్పుడు క్షణమొక యుగమౌతుంది" అంటు వాపోయింది.
"ఆహా, కనీసం వెదురుముక్కనైనా కాకపోతిని కదా, తన చేతి మురళినై కన్నయ్య సన్నిధి అనే పెన్నిధిని శాస్వతంగా పొందేదాన్ని" ఇంకొక గోపిక బాధపడింది.
"తను మనతో ఉన్నంతసేపూ, ఎప్పుడు వెళ్ళిపోతాడోనన్న భయం. వెళ్ళిపోగానే, మళ్ళీ ఎప్పుడొస్తాడోనన్న దిగులు, ఎదురుచూపు. నేను భరించలేకున్నాను సఖీ, ఈ ఎడబాటును...."
“గోవర్ధనగిరిని అలవోకగా ఎత్తిన ఆ గిరిధరుడు, దుఖభారముతో క్రుంగిన మన మనస్సులను పైకెత్తలేడా... పూతనాది రాక్షసులను అవలీలగా సంహరించిన వాడు తన ప్రత్యక్షమాత్రముచే మన విరహాగ్నిని హరించలేడా....” ఇలా తర్కించుకున్న కొద్దీ, వారి గుండెలు బరువెక్కి, దుఖం కన్నీరై ఉబికివస్తోంది.
ఇంతలో అందరి కళ్ళూ, ఓ పక్కన నిశ్శబ్ధంగా కూర్చున్న రాధపై పడ్డాయి. చిత్రంగా, రాధ మోములో చింత లేశమాత్రమైనా లేదు. దుఖపు ఆనవాలూ లేవు. వేయి పున్నముల ప్రకాశాన్ని వెదజల్లుతున్న మఖచంద్రముతో, ప్రశాంతవదన అయి, కృష్ణుడు తనచెంతలేడన్న బెంగ ఏమాత్రమూ లేనిదై, అలౌకికానంద స్థితిలోనున్న రాధను చూసిన గోపికలు ఆశ్చర్యచకితులయ్యారు.
"మన రాధమ్మను చూడవే. కన్నయ్య చెంతలేడన్న బెంగ అస్సలు లేదు. ఈ ఎడబాటును భరించలేక, క్షణమొక యుగమై, విరహాగ్నిలో జ్వలిస్తున్న మనమెక్కడ, ఏ మాత్రమూ చీకూచింతలేని ఈ రాధ ఎక్కడ? అయినా కానీ, కన్నయ్యకు ఈ రాధే ప్రియసఖి...", ఆశ్చర్యము, కాస్త అసూయతో ఓ గోపిక నిరసించింది.
"తనకోసం తపనపడే మనమెప్పుడూ కన్నయ్య కళ్ళకు కనిపించం. తనకోసం అంతగా ఆరాటపడని ఆ రాధమ్మంటే ఎంతప్రేమో..." ఇంకో గోపిక నిష్టూరమాడింది.
కృష్ణుడిపై ఉన్న అపారమైన ప్రేమ వలన కలిగిన చనువుతో, తనను చూడవలెనన్న గాఢమైన కోరికతో, పరిపరివిధాలుగా వారు మాట్లాడుకొంటుండగానే, ఆ గొపికలకిష్టుడు, గోపాలకృష్ణుడు రానే వచ్చాడు. ఆ నందనందనుడి మురళీగానం వారిని ఆనందలోకాలలో విహరింపజేస్తోంది. ఆ నల్లనయ్య కాలి మువ్వల సవ్వడి వారి మనసులలో అలజడిరేపుతోంది.
అంతవరకూ ఎవ్వరిరాకకై పరితపించారో, ఆ సమ్మోహనాసుందరుడు రానేవచ్చాడు.
కన్నయ్యను చూసిన ఆనదాతిశయాలనుంచి వారందరూ తేరుకోకమునుపే, వారెవ్వరినీ చూడనట్టే, నేరుగా రాధ దగ్గరికెళ్ళాడు.
తనువచ్చాడన్న హర్షాతిరేకంలో తమ బాధాతప్తహృదయాలు సేద తీరకమునుపే, తమని అలా నిర్లక్ష్యం చెయ్యడం ఆ గోపికలను చాలా క్లేశానికి గురిచేసింది. ఇంతసేపూ తాముపడ్డ వేదన, తమని అలక్ష్యం చేసాడన్న బాధ, కోపం, తనకోసం ఏమాత్రమూ చింతించని రాధ దగ్గరకే వెళ్ళాడన్న అసూయ, అన్ని భావాలూ కలిసి ఖిన్నులై చూస్తుండగానే, ఆ అల్లరివాడు మబ్బుచాటు చంద్రుడివలే మాయమయ్యాడు.
బృందావనం తెల్లబోయింది! కన్నయ్య వచ్చాడన్న గోపకాంతల ఆనందం, తమను పలకరించలేదన్న కోపంగామారి, అంతలోనే అదృశ్యమవడంతో ఆశ్చర్యంగా రూపాంతరంచెంది, దుఖతరంగమై ఉవ్వెత్తున ఎగసిపడింది. నీళ్ళునిండిన కళ్ళతో, మసకబారిన చూపుతో ప్రతి చెట్టూ, ప్రతి పుట్టా, ఆ నల్లనయ్యకోసం గాలించసాగారు. వచ్చినట్లే వచ్చి మాయమైన ఆ మాయామోహనుడి కోసం శరీరమంతా కళ్ళు చేసుకొని వెదకసాగారు.
కన్నీటియమునలో మునిగిన గోపికల మదిలోని తమస్సును హరిస్తూ, కృష్ణోదయపు ఉషస్సు మళ్ళీ ప్రకటితమయ్యింది. వియోగం మహద్భాగ్యానికి పునాది అయ్యింది. విషాదం వికాసానికి హేతువయ్యింది. పద్మనయనంబులవాడు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. ఒక్కడు కాదు. ఇద్దరు కాదు. ఎటుచూసినా కృష్ణులే. ప్రతి గోపిక పక్కనా కృష్ణుడే. ఇద్దరు కృష్ణులనడుమ గోపిక. ఇద్దరు గోపికలనడుమ కృష్ణుడు. ఎటుచూస్తే అటు కృష్ణుడు. అంతా కృష్ణమయం. బృందావనం ఆనందవనమయ్యింది. ఆనందం అనంతమయ్యింది. అనంతుడు అంతా తానయ్యాడు.
వియోగంతో ఉబికిన కన్నీటి చుక్క చూపును మసకబారిస్తే, సంయోగంతో కలిగిన ఆనందాశ్రువు కుంభాకారకటకమై కృష్ణుడిని మరింతదగ్గరగా ఆవిష్కరించింది.
ఆ గిరిధరుడి అధరసంగమ మాధుర్యాన్ని మోసుకొచ్చే మురళీరవళి, ఘల్లుఘల్లుమంటూ మ్రోగే అందెల చడి,బృందావన పరిమళాల ఘమఘమలు, ఉరకలెత్తే యమున గలగలలు,శరత్చంద్రుడి మిలమిలలు, వీటన్నిటినీ మించి సుందర సమ్మోహనాస్త్రభరితమైన ఆ నల్లనయ్య నాట్యం. బృందావనం పరవసించింది.
జీవితానికి సరిపడా అనుభవాన్ని మూటగట్టుకున్న గోపికలు, అలసి సొలసి కన్నయ్య చెంత చేరారు. మెలమెల్లగా స్పృహలోకొచ్చిన గోపికలు, విడిపోవలసిన సమయమాసన్నమైనదన్న ఎరుక గలిగి, తమను వీడిపోవలదని కన్నయ్యను వేడుకొన్నారు.
వాళ్ళ ఆవేదనను కృష్ణుడు చిరునవ్వుతో చూస్తున్నాడు. చిత్రంగా, కృష్ణుడి పక్కనేవున్న రాధమోములో ఏ మాత్రమూ ఖేదము లేదు. దాన్ని చూసిన గోపికల గుండెల్లో చిన్నపాటి అసూయావీచికలు.
అంతా గమనిస్తున్న కృష్ణుడు, ఇలా చెప్పాడు.
"నా ప్రియసఖులారా, ఇతరులు మనల్ని ప్రేమించేలా చేసుకోవాలంటే, ఒకటే మార్గం మనం వాళ్ళ ప్రేమకి ఎంత అర్హులమో చెప్పటం కాదు. వాళ్ళనుంచీ ఏమీ ఆశించకుండా ప్రేమించడం మాత్రమే. సంభాషణ కాదు, సాన్నిహిత్యమే ప్రేమకు భూషణం. త్యాగం ప్రేమకి హృదయం. షరతులు లేని ప్రేమతో మీ హృదయం ఒక్కసారి నిండితే చాలు, మీరు నన్ను సాధించినట్లే.
నా చేతిలోని ఈ మురళిని చూడండి. ఒక చిన్న వెదురుముక్క, తన శరీరాన్ని చిద్రం చేసుకొని, ఎంతో కష్టాన్నోర్చి ఎనిమిది రంధ్రాలతో మురళిగా మారింది కాబట్టే, నా చేతి ఆభరణమయ్యింది. నాకే అలంకారమయ్యింది. చేత మురళి లేని నన్నూహించగలరా మీరు?
నా ప్రేమ, వివేకం పట్ల అచంచలమైన, షరతులులేని విశ్వాసమే, మీ దుఖాలన్నిటికీ పరిష్కారం. నేను ప్రక్కనున్నా, లేకున్నా, రాధ మోములోని ప్రశాంతతకు కారణం ఈ విశ్వాసమే. నేను భౌతికంగా తనప్రక్కన లేకున్నా, గుండెలనిండా నన్నేనిలుపుకున్న తను ఏనాడూ, నాకు దూరం కాలేదు. నాతోడును శాస్వతంగా పొందిన తనను, దుఖం దరి చేరదు.
ఒక చిన్న విషయం గుర్తెరగండి. మాయ వలన నేను మాయమవ్వలేదు. నేనులేకపోవడంవలనే మాయ మిమ్మల్ని లోబరుచుకుంది. మీరు దుఖావేశాలకు లోనయ్యారు.
జీవించడానికే ప్రేమిద్దాం. ప్రేమించడానికే జీవిద్దాం. జీవితాన్ని సంపూర్ణంగా అంగీకరిద్దాం. అలా అంగీకరించిన నాడు, ప్రతీ ఒక్కరి జీవితం బృందావనమే! జీవనం ఆనందనర్తనమే!”
గోపకాంతల మనోనేత్రాలను కమ్మిన పొరతొలగింది. సందేహపు కారుమబ్బులు విడిపోయాయి. జగమంతా కృష్ణమయంగా కనపడుతోంది. తనప్రక్కన కృష్ణుడు. తనలోన కృష్ణుడు. రాధలో కృష్ణుడు. రాధతో కృష్ణుడు. అంతా కృష్ణుడే! అన్నిటా కృష్ణుడే!
అహా, వినండి. ఆ కమ్మని వేణుగానం మన మనోద్వారకాద్వారాలు మీటి, మనలోని బృందావనాన్ని ఆవిష్కరిస్తోంది. సందేహపు మరకల్ని కడిగేస్తోంది!
Friday, January 2, 2009
మా ఆవిడా, నేనూ., నా అంతరాత్మ!
ఒళ్ళుమరచి నిద్దురపోతున్న నేను, ఎవరో దుప్పటి బలంగా లాగడంతో, ఉలిక్కిపడి లేచాను. డిస్టర్బ్ చేసింది ఎవరా అని చూస్తే, ఎదురుగా నా అంతరాత్మ. "ఇప్పుడెందుకొచ్చావురా బాబూ, కాసేపు నన్ను పడుకోనీ..." అంటూ మళ్ళీ నిద్రకుపక్రమిస్తున్న నన్ను బలంగా మంచమ్మీదనుంచి లాగేయడంతో,నిద్ర లేవక తప్పింది కాదు.
చిన్నప్పుడు జస్టిస్ చౌదరి సినిమాలో తన అంతరాత్మ వచ్చి పెద్ద ఎన్టీఅర్ తో సంవాదం చేయడం చూసినప్పటినుంచీ, అప్పుడప్పుడూ నా అంతరాత్మకూడా నాతో మాట్లాడం మొదలుపెట్టిందిలెండి.
"ఏమిటొ చెప్పు..." విసుగ్గా కసిరాను.
"నిన్న మీ ఆవిడ ఊరెళ్ళింది...నీకసలు గుర్తుందా?" కోపంగా ప్రశ్నించాడు రామలింగం, అదే నా అంతరాత్మ గాడు.
మా ఆవిడ ఊరెళ్ళిన విషయం గుర్తుకురాగానే ఒక్కసారిగా ఆనందం తన్నుకొచ్చింది కానీ, ఈ రామలింగం గాడిముందు అలుసైపోవడమెందుకని కంట్రోల్ చేసుకుని, "అయితే ఏంటట..." అన్నాను బింకంగా.
"లేక లేక దొరికిన గోల్డెన్ చాన్సుని, ఇలా నిద్రపోతూ వేస్టు చేసుకుంటావా? కాంతం లేని ఏకాంతాన్ని, కాస్త ఎంజాయ్ చేసే ప్లానేమన్నా ఉందా?" వాడి కోపం ఇంకా తగ్గినట్లు లేదు.
ఏమిచేద్దాం అన్నట్లు సాలోచనగా వాడివైపు చూసాను.
"మొదట అర్జెంటుగా వెళ్ళి బీరుబాటిళ్ళు తెచ్చి ఫ్రిజ్ నింపేసేయాలి", రామలింగం తన కోర్కెల చిట్టా విప్పాడు. “కరో...కరో జల్సా..." బీరు ప్రసక్తి రాగానే వాడిలోని ఆనందం రెట్టింపయ్యి,. పాట రూపంలో తన్నుకొస్తోంది.
"ఆ తరువాత హోటల్ నుంచి భోజనం తెచ్చుకుని, చల్లటి బీరు కొడుతూ, 'సింగ్ ఈజ్ కింగ్' డివిడి చూడాలి" అసెంబ్లీలో మైకు చేతికి దొరికిన తరువాత రోశయ్యలాగ రామలింగం రెచ్చిపోతున్నాడు.
ఇంతలో ఫోన్ మోగింది. నేనూహించినట్లే మా ఆవిడనుంచే ఫోను. రాక్షసి, నేనెప్పుడు బీరు గురించి అలోచించినా వెంటనే, తన పతి ఆలోచనలను టెలీపతీలో తెలుసుకొన్నట్లు, ఠంచనుగా, "నేను గమనిస్తూనే ఉన్నాను సుమా" అని ఏదో ఒకవిధంగా నన్ను హెచ్చరిస్తూనే ఉంటుంది.
ఏమి చేస్తున్నారంటూ, అనుమానంతో కూడిన ప్రేమతో, నా బుర్రలో ఏముందో కాస్త కూపీ లాగడానికి ప్రయత్నించి,ఈ మూడు రోజులూ నేను తీసుకోవలసిన జాగ్రత్తలను ఇంకోసారి వల్లె వేసి, నేను చెయ్యాల్సిన మార్నింగ్ వాక్ ని మరోసారి గుర్తుచేసి, రెండుగంటలు మాత్రమే మాట్లాడి ఫోన్ పెట్టేసింది.
రామలింగం ధుమమలాడిపోతున్నాడు. నేను వాడివైపు అపాలజెటిగ్గా, సర్ది చెబుతున్నట్లు చూసాను. "నిన్న ఊరెళ్ళినావిడకి, రెండుగంటలసేపు మాట్లాడటానికి విషయాలేముంటాయి?" వాడి గొంతులో కోపం నాకు తెలుస్తూనే ఉంది.
"మొగుడూ పెళ్ళాలన్నతరువాత ఆ మాత్రం కబుర్లుండవా ఏంటి?" సాధ్యమైనంతవరకు మామూలుగా ధ్వనించడానికి ప్రయత్నించాను.
"ఓహో, వాటిని కబుర్లంటారా....ఇంటరాగేషనులాగుంటేను, డౌటొచ్చిందిలే..." ఎత్తిపొడిచాడు.
వీడినిలాగే వదిలేస్తే నా పరువు గంగలో కలిపేస్తాడనిపించి, బయటకెళ్ళి బీరు, బిర్యానీ తెచ్చే నెపంతో, తయారవ్వడానికి బాత్రూంలోకి దూరాను.
త్వరత్వరగా రెడీ అయ్యి వెళ్ళి, బీరు, కాసిన్ని స్నాక్సూ, నందినీ నుంచి బిరియానీ తీసుకొచ్చాను.
"పెళ్ళయిన ఏడేళ్ళలో ఎంత మారిపోయావ్? నన్నసలు పట్టించుకోవడమే మానేసావు. మనమిలా కూర్చొని బీరుకొట్టి ఎన్నాళ్ళైందో గుర్తుందా..?" చికెన్ ముక్క కొరుకుతూ రామలింగం నిష్టూరపడ్డాడు.
టాపిక్ మార్చడానికన్నట్లు, టీవీ ఆన్ చేసాను. కానీ, విషయాన్నంత తేలిగ్గా వదిలేసేవాడైతే వాడు నా అంతరాత్మ గాడెలా అవుతాడు...
"నీ ఇష్టాఇష్టాల్ని, సంతోషాల్ని అంత తేలిగ్గా ఎలా మరిచిపోగలిగావ్?" నిలదీసాడు.
"నీకూ, నాకూ పెద్ద తేడా ఏముంది...నా సంతోషమే నీ సంతోషం...I am happily married. నేను సంతోషంగానే ఉన్నాను" అని సర్ది చెప్పబోయాను.
"అవునవును...నీ సంతోషం సంగతి నాకెందుకు తెలీదు. నీకు పెళ్ళైంది, మీ ఆవిడ సంతోషంగా ఉంది, you both are happily married!"...రామలింగం నన్ను దెప్పి పొడవడానికి ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోడు.
"సరేలేరా...మరీ అంత ఫీలవ్వకు. పెళ్ళి అనేది ప్రతిఒక్కరి జీవితంలో అంతర్భాగమే. పెళ్ళయ్యాక మార్పు కూడా సహజమే. అందుకు నువ్వు అలా దెప్పక్కర్లేదు.పెళ్ళయ్యిన తరువాత కాస్త బిజీఅయ్యి, నీతో ఎక్కువ టైముగడపలేదు. అయినా పెళ్ళికిముందు నీతో వివరంగా చర్చించే నిర్ణయం తీసుకున్నానుకదా... ఇప్పుడు దీనికి నన్ను మాత్రమే భాద్యుడిని చేస్తావే?"
"అవును, agreed. ఒక్కసారి మనమేమి డిస్కస్ చేసామో గుర్తుతెచ్చుకో. నీ పెళ్ళికి నేను పెట్టిన ఒకేఒక్క కండీషను, నీ ఇష్టాఇష్టాలకు ఏమాత్రమూ తేడారాకూడదు. అంతా నీ అభీష్టం ప్రకారమే జరగాలి అని. కానీ, నువ్వుమాత్రం ఈ సూత్రాన్ని, మాంగళ్యసూత్రధారణ తరువాత పూర్తిగా మరచిపోయావు....."
"అయినా ఇప్పుడు నా అభీష్టం ప్రకారం ఏమిజరగట్లేదని నువ్విలా దాడి చేస్తున్నావు?" రామలింగం గాడి వాక్ప్రవాహాన్ని ఆపడానికి అన్నాను కానీ, నా గొంతులో కాంఫిడెన్సులేదని నాకే తెలిసిపొతోంది.
అంతే, నామాట వినగానే వాడు ఆవేశంతో ఊగిపోయాడు, "అవునవును,అంతా నీ ఇష్టప్రకారమే జరుగుతోంది. చాలాతెలివిగా మీఆవిడ ఇష్టాన్ని నీఇష్టంగా చేసుకున్నావు కాబట్టి, అంతా నీఇష్టప్రకారమే జరుగుతోందని సర్దిచెప్పుకుంటున్నావు. నువ్వు చివరిసారిగా మీఆవిడపై నెగ్గిన సందర్భమేదో ఒక్కసారి గుర్తుచేసుకో. నేను చెప్పనా, మీ పెళ్ళితరువాత, బిందెలో ఉంగరమేసి మీఇద్దరిచేత వెతికించినప్పుడు నువ్వుగెలిచావు. అదే చివరిసారి, ఏవిషయంలోనైనా ఆవిడతో నెగ్గడం... Marriage is a relationship in which one person is always right and the other is a husband అన్నకొటేషను ఎంతకరెక్టో నువ్వు నిరూపించావు”, కోపంతో వాడు బీరుబాటిలుమొత్తం లాగించేసాడు.
"అయితే ఇప్పుడునన్నేమి చెయామంటావ్?", వాణ్ణి అర్జెంటుగా శాంతపరచకపోతే,నన్నుకూడ నంజుకుతినేసేటట్లున్నాడు.
నా మాటతో కాస్త స్తిమితపడ్డట్లున్నాడు, ఇంకో బీరుబాటిలు ఓపెన్ చేస్తూ,"నేను చెప్పినట్లు చేసే ధైర్యముందా? మాటమీద నిలబడగలవా?"
"నువ్వలా మాటిమాటికీ దెప్పక్కర్లేదు. ఏమిచెయ్యాలో చెప్పు?" కాస్త కోపం నటించాను.
“Start asserting yourself. నీ ఇష్టాఇష్టాలను పూర్తిగా వదిలేయకు. నీకోసం, అంటే నాకోసం కాస్త టైము కేటాయించు. పూర్తిగా సరెండర్ అయిపోకు. నీ మార్నింగ్ వాక్ విషయమే చూడు. మీ ఆవిడ ఎలా నీ మెడలువంచిందో? ఇంకా..."
"మార్నింగ్ వాక్ నా ఆరోగ్యంకోసమే కదా...తను చేసిందాంట్లో తప్పేముంది?", పాయింటు దొరకగానే నేను అడ్డుతగిలాను.
"మరైతే, కనీసం పార్టీల్లోకుడా మందుపుచ్చుకోవద్దని ఎందుకుకట్టడి చేసింది. ఒక్కసారి పెళ్ళికిముందురోజులు గుర్తుచేసుకో...ఎంత సంతోషంగా గడచిపోయాయి.." గతం గుర్తుకురాగానే ప్రేమాభిషేకం చివరిసీన్లో, చనిపోయే ముందు నాగేశ్వర్రావు చూసినట్లు, జాలిగా అనంతంలోకి చూస్తూ నాస్టాలజెటిగ్గా మారిపోయాడు
"చూడు రామలింగం, పెళ్ళి తరువాత మార్పు అనేది సహజం. దాన్ని అంగీకరించి తీరాలి... సంసారమన్నాక కాస్త సర్దుకుపోకతప్పదు.." మా టీవీలో మంతెన సత్యనారాయణ రాజులా, మంద్రమైన గొంతుతో హితబోధచెయ్యబోయాను..
"ఎన్నైనా చెప్పు, నువ్విలా సరెండరైపోవడం నాకేమాత్రమూ నచ్చలేదు. నువ్వు మారాలి..." అని గంయ్ మన్నాడు రామలింగం.
వీడికెలా సర్దిచెప్పాలా అని సతమతమౌతుంటే, నేను బీరుకొడుతున్న విషయం టెలీపతీ ద్వారా తెలుసుకున్న మా ఆవిడమళ్ళీ ఫోన్ చెసింది. అన్నీ మర్చిపోయి మా ఆవిడతో మాట్లాడుతున్న నన్ను చూసి, "థూ...నీయవ్వ, నిన్ను మార్చడం ఆ జేజమ్మతరం కూడా కాదు..." అంటు, మిగిలిన బీరు లాగించేసి, నా లోనికి దూరి రామలింగం మాయమైపోయాడు.
(అంకితం - మా ఆవిడకి! )
Thursday, January 1, 2009
నా బ్లాగు పేరు మారింది!
"నేనూ....నాలోకం" అన్నపేరుతో మరిరెండు బ్లాగులు ప్రారంభమవడంవలన, అనవసరపు కంఫ్యూజన్ ఎందుకని, నా బ్లాగుపేరును "కెలైడోస్కోప్" గా మార్చడమైనది. గమనించగలరు.