ఒళ్ళుమరచి నిద్దురపోతున్న నేను, ఎవరో దుప్పటి బలంగా లాగడంతో, ఉలిక్కిపడి లేచాను. డిస్టర్బ్ చేసింది ఎవరా అని చూస్తే, ఎదురుగా నా అంతరాత్మ. "ఇప్పుడెందుకొచ్చావురా బాబూ, కాసేపు నన్ను పడుకోనీ..." అంటూ మళ్ళీ నిద్రకుపక్రమిస్తున్న నన్ను బలంగా మంచమ్మీదనుంచి లాగేయడంతో,నిద్ర లేవక తప్పింది కాదు.
చిన్నప్పుడు జస్టిస్ చౌదరి సినిమాలో తన అంతరాత్మ వచ్చి పెద్ద ఎన్టీఅర్ తో సంవాదం చేయడం చూసినప్పటినుంచీ, అప్పుడప్పుడూ నా అంతరాత్మకూడా నాతో మాట్లాడం మొదలుపెట్టిందిలెండి.
"ఏమిటొ చెప్పు..." విసుగ్గా కసిరాను.
"నిన్న మీ ఆవిడ ఊరెళ్ళింది...నీకసలు గుర్తుందా?" కోపంగా ప్రశ్నించాడు రామలింగం, అదే నా అంతరాత్మ గాడు.
మా ఆవిడ ఊరెళ్ళిన విషయం గుర్తుకురాగానే ఒక్కసారిగా ఆనందం తన్నుకొచ్చింది కానీ, ఈ రామలింగం గాడిముందు అలుసైపోవడమెందుకని కంట్రోల్ చేసుకుని, "అయితే ఏంటట..." అన్నాను బింకంగా.
"లేక లేక దొరికిన గోల్డెన్ చాన్సుని, ఇలా నిద్రపోతూ వేస్టు చేసుకుంటావా? కాంతం లేని ఏకాంతాన్ని, కాస్త ఎంజాయ్ చేసే ప్లానేమన్నా ఉందా?" వాడి కోపం ఇంకా తగ్గినట్లు లేదు.
ఏమిచేద్దాం అన్నట్లు సాలోచనగా వాడివైపు చూసాను.
"మొదట అర్జెంటుగా వెళ్ళి బీరుబాటిళ్ళు తెచ్చి ఫ్రిజ్ నింపేసేయాలి", రామలింగం తన కోర్కెల చిట్టా విప్పాడు. “కరో...కరో జల్సా..." బీరు ప్రసక్తి రాగానే వాడిలోని ఆనందం రెట్టింపయ్యి,. పాట రూపంలో తన్నుకొస్తోంది.
"ఆ తరువాత హోటల్ నుంచి భోజనం తెచ్చుకుని, చల్లటి బీరు కొడుతూ, 'సింగ్ ఈజ్ కింగ్' డివిడి చూడాలి" అసెంబ్లీలో మైకు చేతికి దొరికిన తరువాత రోశయ్యలాగ రామలింగం రెచ్చిపోతున్నాడు.
ఇంతలో ఫోన్ మోగింది. నేనూహించినట్లే మా ఆవిడనుంచే ఫోను. రాక్షసి, నేనెప్పుడు బీరు గురించి అలోచించినా వెంటనే, తన పతి ఆలోచనలను టెలీపతీలో తెలుసుకొన్నట్లు, ఠంచనుగా, "నేను గమనిస్తూనే ఉన్నాను సుమా" అని ఏదో ఒకవిధంగా నన్ను హెచ్చరిస్తూనే ఉంటుంది.
ఏమి చేస్తున్నారంటూ, అనుమానంతో కూడిన ప్రేమతో, నా బుర్రలో ఏముందో కాస్త కూపీ లాగడానికి ప్రయత్నించి,ఈ మూడు రోజులూ నేను తీసుకోవలసిన జాగ్రత్తలను ఇంకోసారి వల్లె వేసి, నేను చెయ్యాల్సిన మార్నింగ్ వాక్ ని మరోసారి గుర్తుచేసి, రెండుగంటలు మాత్రమే మాట్లాడి ఫోన్ పెట్టేసింది.
రామలింగం ధుమమలాడిపోతున్నాడు. నేను వాడివైపు అపాలజెటిగ్గా, సర్ది చెబుతున్నట్లు చూసాను. "నిన్న ఊరెళ్ళినావిడకి, రెండుగంటలసేపు మాట్లాడటానికి విషయాలేముంటాయి?" వాడి గొంతులో కోపం నాకు తెలుస్తూనే ఉంది.
"మొగుడూ పెళ్ళాలన్నతరువాత ఆ మాత్రం కబుర్లుండవా ఏంటి?" సాధ్యమైనంతవరకు మామూలుగా ధ్వనించడానికి ప్రయత్నించాను.
"ఓహో, వాటిని కబుర్లంటారా....ఇంటరాగేషనులాగుంటేను, డౌటొచ్చిందిలే..." ఎత్తిపొడిచాడు.
వీడినిలాగే వదిలేస్తే నా పరువు గంగలో కలిపేస్తాడనిపించి, బయటకెళ్ళి బీరు, బిర్యానీ తెచ్చే నెపంతో, తయారవ్వడానికి బాత్రూంలోకి దూరాను.
త్వరత్వరగా రెడీ అయ్యి వెళ్ళి, బీరు, కాసిన్ని స్నాక్సూ, నందినీ నుంచి బిరియానీ తీసుకొచ్చాను.
"పెళ్ళయిన ఏడేళ్ళలో ఎంత మారిపోయావ్? నన్నసలు పట్టించుకోవడమే మానేసావు. మనమిలా కూర్చొని బీరుకొట్టి ఎన్నాళ్ళైందో గుర్తుందా..?" చికెన్ ముక్క కొరుకుతూ రామలింగం నిష్టూరపడ్డాడు.
టాపిక్ మార్చడానికన్నట్లు, టీవీ ఆన్ చేసాను. కానీ, విషయాన్నంత తేలిగ్గా వదిలేసేవాడైతే వాడు నా అంతరాత్మ గాడెలా అవుతాడు...
"నీ ఇష్టాఇష్టాల్ని, సంతోషాల్ని అంత తేలిగ్గా ఎలా మరిచిపోగలిగావ్?" నిలదీసాడు.
"నీకూ, నాకూ పెద్ద తేడా ఏముంది...నా సంతోషమే నీ సంతోషం...I am happily married. నేను సంతోషంగానే ఉన్నాను" అని సర్ది చెప్పబోయాను.
"అవునవును...నీ సంతోషం సంగతి నాకెందుకు తెలీదు. నీకు పెళ్ళైంది, మీ ఆవిడ సంతోషంగా ఉంది, you both are happily married!"...రామలింగం నన్ను దెప్పి పొడవడానికి ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోడు.
"సరేలేరా...మరీ అంత ఫీలవ్వకు. పెళ్ళి అనేది ప్రతిఒక్కరి జీవితంలో అంతర్భాగమే. పెళ్ళయ్యాక మార్పు కూడా సహజమే. అందుకు నువ్వు అలా దెప్పక్కర్లేదు.పెళ్ళయ్యిన తరువాత కాస్త బిజీఅయ్యి, నీతో ఎక్కువ టైముగడపలేదు. అయినా పెళ్ళికిముందు నీతో వివరంగా చర్చించే నిర్ణయం తీసుకున్నానుకదా... ఇప్పుడు దీనికి నన్ను మాత్రమే భాద్యుడిని చేస్తావే?"
"అవును, agreed. ఒక్కసారి మనమేమి డిస్కస్ చేసామో గుర్తుతెచ్చుకో. నీ పెళ్ళికి నేను పెట్టిన ఒకేఒక్క కండీషను, నీ ఇష్టాఇష్టాలకు ఏమాత్రమూ తేడారాకూడదు. అంతా నీ అభీష్టం ప్రకారమే జరగాలి అని. కానీ, నువ్వుమాత్రం ఈ సూత్రాన్ని, మాంగళ్యసూత్రధారణ తరువాత పూర్తిగా మరచిపోయావు....."
"అయినా ఇప్పుడు నా అభీష్టం ప్రకారం ఏమిజరగట్లేదని నువ్విలా దాడి చేస్తున్నావు?" రామలింగం గాడి వాక్ప్రవాహాన్ని ఆపడానికి అన్నాను కానీ, నా గొంతులో కాంఫిడెన్సులేదని నాకే తెలిసిపొతోంది.
అంతే, నామాట వినగానే వాడు ఆవేశంతో ఊగిపోయాడు, "అవునవును,అంతా నీ ఇష్టప్రకారమే జరుగుతోంది. చాలాతెలివిగా మీఆవిడ ఇష్టాన్ని నీఇష్టంగా చేసుకున్నావు కాబట్టి, అంతా నీఇష్టప్రకారమే జరుగుతోందని సర్దిచెప్పుకుంటున్నావు. నువ్వు చివరిసారిగా మీఆవిడపై నెగ్గిన సందర్భమేదో ఒక్కసారి గుర్తుచేసుకో. నేను చెప్పనా, మీ పెళ్ళితరువాత, బిందెలో ఉంగరమేసి మీఇద్దరిచేత వెతికించినప్పుడు నువ్వుగెలిచావు. అదే చివరిసారి, ఏవిషయంలోనైనా ఆవిడతో నెగ్గడం... Marriage is a relationship in which one person is always right and the other is a husband అన్నకొటేషను ఎంతకరెక్టో నువ్వు నిరూపించావు”, కోపంతో వాడు బీరుబాటిలుమొత్తం లాగించేసాడు.
"అయితే ఇప్పుడునన్నేమి చెయామంటావ్?", వాణ్ణి అర్జెంటుగా శాంతపరచకపోతే,నన్నుకూడ నంజుకుతినేసేటట్లున్నాడు.
నా మాటతో కాస్త స్తిమితపడ్డట్లున్నాడు, ఇంకో బీరుబాటిలు ఓపెన్ చేస్తూ,"నేను చెప్పినట్లు చేసే ధైర్యముందా? మాటమీద నిలబడగలవా?"
"నువ్వలా మాటిమాటికీ దెప్పక్కర్లేదు. ఏమిచెయ్యాలో చెప్పు?" కాస్త కోపం నటించాను.
“Start asserting yourself. నీ ఇష్టాఇష్టాలను పూర్తిగా వదిలేయకు. నీకోసం, అంటే నాకోసం కాస్త టైము కేటాయించు. పూర్తిగా సరెండర్ అయిపోకు. నీ మార్నింగ్ వాక్ విషయమే చూడు. మీ ఆవిడ ఎలా నీ మెడలువంచిందో? ఇంకా..."
"మార్నింగ్ వాక్ నా ఆరోగ్యంకోసమే కదా...తను చేసిందాంట్లో తప్పేముంది?", పాయింటు దొరకగానే నేను అడ్డుతగిలాను.
"మరైతే, కనీసం పార్టీల్లోకుడా మందుపుచ్చుకోవద్దని ఎందుకుకట్టడి చేసింది. ఒక్కసారి పెళ్ళికిముందురోజులు గుర్తుచేసుకో...ఎంత సంతోషంగా గడచిపోయాయి.." గతం గుర్తుకురాగానే ప్రేమాభిషేకం చివరిసీన్లో, చనిపోయే ముందు నాగేశ్వర్రావు చూసినట్లు, జాలిగా అనంతంలోకి చూస్తూ నాస్టాలజెటిగ్గా మారిపోయాడు
"చూడు రామలింగం, పెళ్ళి తరువాత మార్పు అనేది సహజం. దాన్ని అంగీకరించి తీరాలి... సంసారమన్నాక కాస్త సర్దుకుపోకతప్పదు.." మా టీవీలో మంతెన సత్యనారాయణ రాజులా, మంద్రమైన గొంతుతో హితబోధచెయ్యబోయాను..
"ఎన్నైనా చెప్పు, నువ్విలా సరెండరైపోవడం నాకేమాత్రమూ నచ్చలేదు. నువ్వు మారాలి..." అని గంయ్ మన్నాడు రామలింగం.
వీడికెలా సర్దిచెప్పాలా అని సతమతమౌతుంటే, నేను బీరుకొడుతున్న విషయం టెలీపతీ ద్వారా తెలుసుకున్న మా ఆవిడమళ్ళీ ఫోన్ చెసింది. అన్నీ మర్చిపోయి మా ఆవిడతో మాట్లాడుతున్న నన్ను చూసి, "థూ...నీయవ్వ, నిన్ను మార్చడం ఆ జేజమ్మతరం కూడా కాదు..." అంటు, మిగిలిన బీరు లాగించేసి, నా లోనికి దూరి రామలింగం మాయమైపోయాడు.
(అంకితం - మా ఆవిడకి! )
25 comments:
హహ..నాకు బీరకాయ వేసినతర్వాతే అంతరాత్మగాడు బయటకు వస్తాడు. :-)
మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
హ.. హ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు
బాగారాసారు...:)నూతన సంవత్సర శుభాకాంక్షలు
:) ఇంతకీ ఈ టపా మీ ఆవిడ చూసారా?
పెళ్లయినాక భార్యా భర్తా ఇద్దరూ మారాలి, సర్దుకుపోవాలి. ఎవరు ఎక్కువ సర్దుకుపోవాలి అన్నది ఎవరికి వారికి వ్యక్తిగతం. ఇకనుండి మీ రామలింగాన్ని కాస్త దూరంగానే పెట్టండి, లేకపోతే అనవసరమైన గొడవలయిపోతాయి.
హ హ హ బాగా రాశారు. మీ అంతరాత్మ రామలింగానికే నా ఓటు. :)
హ హ గిరీష్ గారు చాలా బాగుందండీ, మొన్నే చదివాను కానీ వేరే పని తగలడంతో కామెంటకుండానే వెళ్ళాల్సి వచ్చింది కానీ చదివినంత సేపూ నవ్వుకుంటూనే ఉన్నాను.
"నువ్వు చివరిసారిగా మీఆవిడపై నెగ్గిన సందర్భమేదో ఒక్కసారి గుర్తుచేసుకో. నేను చెప్పనా, మీ పెళ్ళితరువాత, బిందెలో ఉంగరమేసి మీఇద్దరిచేత వెతికించినప్పుడు నువ్వుగెలిచావు. అదే చివరిసారి" :).. ... బాగుంది.
మీ బ్లాగు ఎప్పుడో ఒకసారి చదివాను. బావుంది మిగతా పోస్టు లన్నీ ఏకబిగిన చదవాలని అనుకున్నా, అంతలోనె ఎందుకో మీ బ్లాగు నా లిస్టులోంచి జారిపోయింది.. But not now
గిరీష్ గారూ,
ఏకబిగిన మీ బ్లాగులో పోస్టు లన్నీ చదివేసాను. ఆలోచనల్లో, నిజం చెప్పాలంటే రచనాశైలి లో కూడా మీకూ నాకూ కొద్దిపాటి సారూప్యతలున్నాయని అనిపిస్తోంది. మీకలా అనిపించకపోతే ఈ సారికి క్షమించెయ్యండి.
"గోదావరి గలగలనూ, కోనసీమ కొబ్బరాకునూ, వ్యక్తిత్వాన్నీ, దాని అవసరాన్నీ, ప్రేమనూ, ప్రేమించడాన్నీ, ప్రేమింపబడడాన్నీ, ముఖ్యంగా ప్రెమించడానికి కావలసిన అర్హతనూ, ప్రేమకూ ఆకర్షణకూ తేడానూ, మనిషి మనసునూ, దాని లోతునూ, హిపోక్రసినీ, ధైర్యాన్నీ, లౌక్యాన్నీ, కాస్త ఙానాన్నీ, నమ్మకాన్నీ, దాని ఆవస్యకతనూ సుతిమెత్తగా, నిష్కర్షగా మాకు తెలియజెప్పింది యండమూరి నవలలే. "
నా విషయంలో కూడా ఇది ప్రతి అక్షరం నిజం, నిజం. అలా అని మల్లాది ని పక్కన పెట్టలేను, మల్లాది ని చదువుతూ ఆనందిస్తే, యండమూరి ని ఆలోచిస్తూ, ఆచరిస్తూ ఆనందించాను,
Please keep writing. I liked all your posts.
ఇంత మంచి కత్తి లాంటి పొస్టును వెకేషన్లో ఉండి చదవలేకపోయాను అప్పుడు. అయితే ప్రతి భరకీ ఒక రామలింగం ఉంటాడన్నమాట, నేను మా ఇంట్లోనే అనుకున్నాను ఇన్నాళ్ళూ!
"ఓహో, వాటిని కబుర్లంటారా....ఇంటరాగేషనులాగుంటేను, డౌటొచ్చిందిలే..." - మాస్టారూ, మోత.. మోతెత్తించేసారు!!
@మధు, చైతన్య, నేస్తం, నెనర్లు!
@ సిరిసిరిమువ్వగారు, ఈ టపాని తను చూసిందండీ. అందుకేకదా తనకి అంకితమిచ్చాను :)
@ నాగప్రసాద్, వేణూశ్రీకాంత్, కామెంటుకు కృతఙతలు!
@ ఉమాశంకర్
నిన్న మీ బ్లాగులో చెప్పినట్లు, చాన్నాళ్ళక్రిందట మీ టపా చదివినప్పుడు, అచ్చంగా మీకనిపించినట్లే, నాక్కూడా అనిపించింది. నిజానికి, అప్పుడే మీ బ్లాగులో ఓ కామెంటు రాసాను. ఎందువలనో పబ్లిష్ కాలేదు. ఆ తరువాత మీ బ్లాగును మిస్సయ్యాను. పోనీలెండి, మళ్ళీ ఇలా కలుసుకున్నాము.
నేనుకూడా, యండమూరితో పాటు, మల్లాదినికూడా పిచ్చిగా చదివేవాడిని. కాకపోతే, నన్ను నేను మలుచుకోవడంలో యండమూరి రచనల పాత్ర ఎంతైనా ఉంది. రెండేళ్ళ క్రితం, ఇదే విషయాన్ని వివరిస్తూ ఆయనకి వివరంగా మెయిలు చేస్తే, తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఆయన్నుంచి రిప్లై వచ్చింది.
నా పోస్టులన్నీ నచ్చినందుకు కృతఙతలు!
సుజాత గారు, మీ కామెంటు రాకపోతే, నచ్చలేదేమోననుకున్నాను.
ప్రతీ భర్తకీ ఒక రామలింగం ఉంటాడు. వాడికి కాస్తోకూస్తో అసంతృప్తి ఉంటుంది, ముఖ్యంగా మందు, మార్నింగ్ వాక్ విషయంలో! :)
చదువరిగారూ, నెనర్లు!
good post :)))
నిజాల్ని ఇలా పబ్లిక్ గా చెప్తే ఎలాగండి?
:))
చివర్లో కూల్ చెయ్యటానికా, అంకితం ఇచ్చేసారు?
@ మధుర వాణి గారు,
Thank you very much..
Venu గారు,
అందుకేకదా తనకి అంకితమిచ్చాను :)
good one :-)
మొత్తానికి చివర్లో "ఈ పోస్ట్ మా ఆవిడ కి అంకితం " అన్న ఒక్క మాట తో భలే తప్పించుకునేశారు గా..ఘటికులే!!
నేను చేద్దామనుకున్న కామెంటు చదువరిగారు చేసేశారు. :-)
రెండుగంటలు మాత్రమే మాట్లాడి ఫోన్ పెట్టేసింది. :-))
mari mee ramalingani okasari office ki thisukurakuda..!!! me mu oksari palakaristamu...
by Prakash
emandoi saru nenna mekosam vachanu me cabin ki evaro kurchunivunnaru me kurichilo bhahusaa me ramalinamemo....
:)
by prakasam....
నా విషయంలో అయితే, ఈ రామలింగం నేరుగా వచ్చి నాతోనే మాట్లాడి మాటల్తోనే నన్ను మింగేస్తాడండీ! మీ భార్య అదృష్టవంతురాలు! ;)
Post a Comment