నేను నీకోసం సిద్దంగా ఉందని రోజులు ఉండేవి. నువ్వు గుంపులో ఒ సాధరణుడి వలె, ఆహ్వానం లేకండానే నా హృదయం లోకి ప్రవేశించి, నాకు తెలీకండానే, నా ప్రభూ, నా జీవితానేక నశ్వర క్షణాలపైన నీ అనంతత్వపు ముద్రని వుంచావు.
అనుకోకండా ఈనాడు ఆ క్షణాలు నా కంటపడి నీ ముద్రని చూసినప్పుడు, నేను మరచిపోయిన ప్రత్యేకతలేని రోజుల సుఖ దుఖ ఙాపకాలతో కలిసి అవి దుమ్ములో చెదిరి వుండిపోయినాయని తెలుస్తోంది.
- గీతాంజలి (చలం)
వసంతాన్ని కోల్పోయి మోడువారిన నా జీవనవృక్షాన్ని, నీ కృపారసగౌతమితో మొగ్గతొడిగించి , నా చుట్టూ అలముకున్న తమస్సునూ, దుఃఖాన్నీ, అవమానాన్నీ, ద్వేషాన్నీ, అసూయనూ, సమస్యల్నీ, భ్రమలనూ, భయాలనూ,ఒక్క నీ రాకతో మటుమాయంచేసి, "భగవంతుని పరీక్ష నెగ్గాలంటే మన నిరీక్షణా వైశాల్యం అనంతంగా ఉండాల"నే సత్యాన్ని వంటబట్టించిన తేజోమూర్తివైన నిన్ను వర్ణిచాలనుకోవడం వృధా ప్రయత్నమే.
కొనియాడ వలెనన్న కోర్కేయే కాని
భాషలోనట్టి పలుకులే లేవు;
తెలిసికోవలెనన్న దీక్షయే కాని
బుద్ధి కంతటి సుప్రభోధమే లేదు;
వర్ణింపవలెనన్న వాంచయే కాని
కవితకంతటి భావ గరిమయే లెదు.
- శ్రీ వేంకట పార్వతీశ్వర కవులు (ఏకాంతసేవ)
కన్నీటిచుక్కే భగవంతుని వీక్షిచడానికుపయోగపడే భూతద్దమనే సూక్ష్మాన్నీ తెలియపరచిన వాడివీ, పసిపాపల కనురెప్పల చప్పుళ్ళలో జీవనసంద్రాన్ని దాటించే 'గీత'ను వినిపించిన వాడవూ, మాయనూ మమతనూ ఎరుక పరచి, నన్ను నాకు ఎరుగించినవాడవూ,అనంతుడవూ, ఆత్మీయుడవూ,అయిన నిన్నెలా స్తుతించనూ?
విషయశోధనలోపడి, సాధనను మరచిన నాజీవితంలోకి నిశబ్ధంగా ప్రవేశించి, "చిరునవ్వు చిందించండానికి దెవుడిచ్చిన అవకాశమే ఈ జీవితమ"నే సత్యాన్నీ, నిత్యాన్నీ విశిదీకరించి, ప్రపుల్లమైన శరత్పూర్ణిమ వంటి నీ ప్రేమతో, తమోభరితమైన నా మనస్సును వెలిగించిన నిన్నెలా కీర్తించనూ?
నా అశక్తతనూ, అఙానాన్నీ మన్నించు తండ్రీ....నా చేయి విడువకు. నా యీ స్వేచ్చకూ, అనందాలకూ మూలకారణం నీవనే స్ఫురణ క్షణమైనా మరుగు పరచకు. నేను పోగొట్టుకొనడానికి వీలుపడని నమ్మకాన్నీ, విశ్వాశాన్నీ నాకివ్వు. నా కష్టాలలో, సుఃఖాలలో, నవ్వులలో, రోదనలో,నువ్వు నావెంటే వున్నావన్న ఎరుక నానుంచి మరుగు పరచకు.
No comments:
Post a Comment