Saturday, April 19, 2008

గీతాంజలి సినిమా


ఎక్కడో చదివిన జ్ఞాపకం - చిన్నపటి ఆనందాలు, చిగురించిన మందారాలని. పంచుకోవడానికి, ఆనందం పెంచుకోవడానికి, చిన్నప్పటి విషయాలకంటే వేరే ఏముంటాయి? అదీ, హస్టల్లో ఉంటే బోల్డన్ని స్మృతులూ, సంగతులూనూ.

నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, రామంతాపూర్ లో 11 వ తరగతి చదువుతున్నప్పటి విషయం. అప్పుడే నాగర్జున గీతాంజలి సినిమా విడుదలయ్యింది. ఎవ్వరి నోట విన్నా, ఆ సినిమా కబుర్లే. ఎలాగైనా, ఆ సినిమా చూడాల్సిందేనని మా ఫ్రెండ్సందరమూ నిర్ణయించుకున్నాము. కాకపొతే, ఆ సినిమాకెళ్ళడానికి ఒకటే దారి. శనివారం రాత్రి సెకండ్ షో కి దొంగతనంగా హాస్టల్ గోడ దూకి వెళ్ళడమే. ఆ సినిమా తార్నాక లోని ఆరాధన థియేటర్లో ఆడుతోంది.
ఇలా మేము ప్లాన్ చేసుకుంటుండగానే, మా సీనియర్లు ఆ సినిమాకు వెళ్ళి, వాళ్ళ అదృష్టం బాగాలేక, అదే సినిమాకొచ్చిన మా హౌస్ మాస్టర్ల చేతికి చిక్కి, ఒక వారం రోజులు సస్పెండ్ అయ్యారు. ఈ నేపధ్యంలో మేము అయిదుమందిమి, గోడ దూకి ఆ సినిమాకెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము.

ఈ విషయం మా సీనియర్లకు తెలిసింది. మేము ఇలా ఏ అవాంతరమూ లేకుండా, ప్రతీ వారమూ సినిమాకెళ్ళడం, వాళ్ళేమో ఒక్కసారి వెళ్ళి పట్టుబడడమూ, మా మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలూ ... అన్నీ కలసి వాళ్ళని కాస్త కుళ్ళుకునేలా చేసాయనుకుంటాను. ఈ సారి మేమెలాగైన పట్టుబడేలా చెయ్యలని వాళ్ళూ ప్లాన్ చేసుకున్నారు.

ఇవేమీ తెలియని మేము ఓ శనివారం రాత్రి, గీతాంజలి సెకండ్ షోకి వెళ్ళిపోయాము. మా హాస్టల్ బిల్డింగ్ పక్కనే ఒక చిన్న జామ తోట ఉండేది. దాని పక్కనే మా డైనింగ్ హాలు ఉండేది. మేము గోడ దూకడానికి వీలుగా డైనింగ్ హాల్ ముందు చిన్న దారి ఏర్పాటు చేసుకున్నాము. అందరూ సాధరణంగా ఇదే దారిని ఉపయోగించేవారు.

మేము అలవాటు ప్రకారం సినిమా చూసి, గోడ దూకి, జామ తోటలోకి వచ్చి చూద్దుముకదా... మా హాస్టల్ తలుపులన్నీ లోపలినుంచి గడియ పెట్టి ఉన్నాయి. మాకు విషయం అర్ధమయ్యెలోపే, ఇంకో వైపునుంచి ఇద్దరు వాచ్ మెన్లు, కుక్కలతో సహా జామ తోట వైపే వేగంగా వస్తూ కనిపించారు. ఒక్క సారిగా మా గుండెలు జారిపోయాయి. హౌస్ మాస్టర్లముందు మా పరేడ్, వారమో రెండు వారాలో సస్పెన్షన్, స్కూల్ అసెంబ్లీలో అనౌన్స్మెంటూ.. అన్ని సీన్లూ మా కళ్ళముందు కదలాడుతుంటే, భయంతో తలా ఒకమూలకు పరిగెట్టి, తోటలొ దాక్కున్నాము.

ఇంతలో, మాలో ఒకడు (జయ కుమార్) ఒక పక్క తెరచిఉన్న కిటికీలోంచి లొపలికి దూరి, హాస్టల్ తలుపులు తెరిచాడు. కాని, లొపలికెలదామంటే వాచ్ మెన్లిద్దరూ అడ్డాంగా ఉన్నారు. మమ్మల్ని పసిగట్టిన కుక్కలు భయంకరంగా అరుస్తున్నాయి.

కాసేపటికి, నేను ధైర్యం తెచ్చుకుని, వాచ్ మెన్ల దగ్గరికెళ్ళి, వాళ్ళ చెతిలో ఇరవై రూపాయలు పెట్టి, ఏదొ కథ చెప్పి, వాళ్ళు తేరుకునేంతలో, లోపలికి తుర్రుమన్నాను. ఇదే అదనుగా మిగతావాళ్ళూ లొపలికొచ్చేసారు.

తరువాత రోజు ఈ విషయం హాస్టల్లొ తెలిసి, మేమందరమూ గొప్ప హీరోలమైపోయాము. మమ్మల్ని ఇరికించడానికి ప్లాన్ చేసిన మా సీనియర్ల మొహంలో కత్తి వేటుకి నెత్తురు చుక్క లేదు.

అయితే, ఆ పిమ్మట చాలా రోజులపాటూ మేము దొంగతనంగా సినిమాకెళ్ళే ధైర్యం చెయ్యలేకపొయామనుకోండి. కానీ, గీతాంజలి సినిమా ప్రస్తావన వచ్చినప్పుడల్లా, ఈ సంఘటన జ్ఞప్తికి వచ్చి, నా బాల్యంలోకి జారిపోతాను!

1 comment:

VENKAT SEETHA said...

నాకు కూడా గీతాంజలి సినిమా గుర్తుకువచ్చినప్పుడల్ల
ఈ సంఘటన గుర్తుకువచ్చి బాల్యం ఎంతో మధురం గా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ గ్యాంగ్ లో నేను ఒక్కడిని
Thanks for remebering all those things Gireesh, keep going!