ఇది రెణ్ణెళ్ళ క్రితం జరిగిన సంగతి. ఓ ఆదివారపు ఉదయాన, బద్దకంగా వొళ్ళు విరుచుకుంటూ, మంచం దిగాలా వద్దా అని ఊగిసలాడుతున్నప్పుడు మా ఇంటి కాలింగ్ బెల్ మ్రోగింది. పొద్దున్నే ఎవరా అని విసుక్కుంటూ తలుపు తీద్దును కదా, "హయ్ మామా" అంటూ సుడిగాలిలా మా సుందరం లోపలికొచ్చాడు. ఇంత హటాత్తుగా ఊడిపడడానికి కారణమేముంటుందా అని ఆలోచిస్తుండగానే, వాడే మొదలుపెట్టాడు, "నీతో అర్జెంటుంగా ఒక విషయం డిస్కస్ చెయ్యాలిరా..." అని. వాణ్ణి కూర్చోమనిచెప్పి, మా ఆవిడకు కాఫీ పురమాయించి, మొహం కడుక్కోవడానికి నేను బాత్రూంలోకి దూరాను. సుందరం నా చిన్ననాటి స్నేహితుడు. మేము డిగ్రీ వరకు కలిసే చదువుకున్నాము. ఆ తరువాత నేను ఉద్యోగంలో సెటిల్ అయ్యాను. వాడేమో, వాళ్ళ నాన్న బిజినెస్ అందిపుచ్చుకున్నాడు.
వాడి రాకకు కారణం ఊహిస్తూ, నా పనులన్నిటినీ త్వరగా పూర్తి చేసుకుని, మా ఆవిడ ఇచ్చిన కాఫీ కప్పు తీసుకుని వాడిముందు సెటిల్ అయ్యి, విషయం చెప్పమన్నట్టు వాడికేసి సాలోచనగా చూసాను. ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్లు, వాడు సీరియస్ గా కాఫీ సిప్ చేస్తున్నాడు. వాడి నిశ్శబ్ధం నాలో సస్పెన్స్ పెంచుతోంది. మెల్లిమెల్లిగా, నాలోని ఉత్సుకత చిరాకుగా రూపాంతరం చెందుతున్న సమయంలో వాడు గొంతు సవరించుకుంటున్నట్లు దగ్గాడు.
"మామా, చిరంజీవి పార్టీ పెడుతున్నాడట కదరా..." అన్న మావాడి ఉపోద్ఘాతం విని నాకు మండుకొచ్చింది. ఈ విషయం చెప్పడానికా వీడు ఆదివారం పొద్దున్నే నా నిద్దుర చెడగొట్టాడు అన్న కోపమూ, వాడి మానసిక పరిస్థితిమీద చిన్న అనుమానమూ కలగలిసి నాబుర్రని తొలిచేస్తుంటే, వాడు మాత్రం ఇవేమీ పట్టనట్లు కొనసాగించాడు.
"నేను చిరు పార్టీలో చేరదామనుకుంటున్నానురా... వీలైతే ఎమ్మెల్యే టిక్కెట్టుకోసం ప్రయత్నిద్దామనుకుంటున్నా".
ఓ బాల్చీడు నీళ్ళు లాగిపెట్టి నామొహమ్మీద కొట్టినట్లు, వాడి మాటలకు కొద్దిసేపు ఉక్కిరిబిక్కిరి అయ్యాను. ఏమ్మాట్లాడాలో నాకైతే అర్ధం కాలేదు. నా అయోమయంలో నేనుండగానే, వాడు మళ్ళీ కొనసాగించాడు.
"మనూరినుంచి ఎమ్మెల్యే టిక్కెట్టుకోసం ట్రై చేద్దామనునుకుంటున్నా. మనం జాగ్రత్తగా ప్లాను చెయ్యాలి. కాంపిటీషను బాగానే ఉన్నట్లుంది......ఎలా ప్రొసీడ్ అవ్వాలి అన్నదానిపై నీ సలహా కావాలి"
మెల్లగా స్పృహలోకొచ్చిన నేను, నా సందేహాల చిట్టా విప్పాను.
"పార్టీ పెడుతున్నట్లు అయనికా ఒక్కసారి కూడా నోరువిప్పి చెప్పలేదు...అప్పుడే పార్టీ టిక్కెట్టూ, కాంపిటీషను, ప్లాను ఏవిట్రా...నాకైతే ఏమీ అర్ధం కావట్లేదు... అసలు నీకీ ఆలోచనెలా వచ్చింది...?"
నేనో తింగరివెధవన్నట్లుగా నావైపు ఓ చూపు విసిరి, "ఎక్కడున్నావురా నువ్వు...చిరు పార్టీ గురించి ఆంధ్ర రాష్ట్రమంతా కోడై కూస్తుంటే, ఏమీ తెలియదన్నట్లు మాట్లాడుతున్నావు. ఆయన పార్టీ పెడుతున్నట్లు, ఆయన తమ్ముళ్ళూ, బావమరదులూ హింట్స్ ఇస్తూనే ఉన్నారుకదా... అంతమాత్రం అర్ధం చేసుకోకపోతే ఎలా?"
ఇవేమీ పట్టనట్లు, వాడు చెప్పుకుంటూ పోతున్నాడు..."ఓ నాలుగు రోజులక్రితం చిరంజీవి తమ్ముడి బావమరిదికి, వేలువిడిచిన మేనమామకు తోడల్లుడు ఒకాయన,మనూళ్ళో మీటింగ్ పెట్టాడు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితులను, రాజకీయ ప్రత్యామ్నాయం ఆవశ్యకతనూ, రాష్ట్రంలోనున్న రాజకీయ శూన్యతను,కొత్త రక్తం అవసరాన్నీ వివరించి చెప్పాడు. ఎమ్మెల్యేగా పోటీ చెయ్యాలని అప్పుడే నిర్ణయించుకొన్నాను".
నాకు ఒక్కసారిగా మూర్చ వచ్చినంత పనైంది... వాడి మాటలు విని. ఆదివారం ఉదయాన్నే ఈ షాకులేమిట్రా బాబూ, అనుకుంటూ చెప్పమన్నట్లు వాడికేసి చూసాను.
"మూఢం పోయాక ఆగస్టులో, మంచి ముహూర్తం చూసి, పార్టీని పరకటిస్తారట. ఈలోపల, ఆయన తమ్ముళ్ళూ, బావమరదులూ,వాళ్ళ బంధువులూ ఊరూరా తిరిగి గ్రౌండు ప్రిపేర్ చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ గెలుపుగుర్రాలెవరా అని సీక్రెట్ సర్వేలు జరుగుతున్నాయట. ఈ సర్వేలు ఎవరు చేస్తున్నారోమాత్రం తెలియట్లేదు. మనకి టిక్కెట్టు రావాలంటే, మనం ఈ సర్వేరాయుళ్ళ కంట్లో పడాలి....అందుకు ఏమి చెయ్యాలో కాస్త సలహా ఇస్తావేమోనని నీ దగ్గరకొచ్చాను....."
మొదట్లో వాడి మాటలు కాస్త అయోమయానికి గురిచేసినా, మెల్లగా నాకూ కాస్త ఉత్సాహం కలిగింది. వీడు ఎమ్మెల్యే అయితే, మనకు కూడా ఎమ్మెల్యే ఫ్రెండుగా కాస్త పరపతి పెరుగుతుంది, వీడదృష్టం బాగుంటే యే సహాయమంత్రైనా అవ్వొచ్చేమో...నా మనసు అప్పుడే DTS లో కలలు కనడం మొదలుపెట్టింది.
దాంతో నా సందేహాలని కాసేపు కట్టిపెట్టి, వీడికేమి సలహా ఇవ్వాలా అని అలోచించడం మొదలుపెట్టాను. కాసేపు చించిన తరువాత నాకో అయిడియా తట్టింది...."నువ్వెంటనే చిరంజీవి పేరుమీద ఒక అభిమాన సంఘాన్నో, సేవా సంఘాన్నో మొదలుపెట్టరా.."
"ఓ అయిడియా, జీవితాన్నే మార్చెస్తుంది" అని అనందంతో నన్ను కౌగిలించుకుంటాడనుకుంటే, మనీ సినిమాలో ఖాన్ దాదాలా ఓ చూపు విసిరి, "నువ్వేలోకంలో ఉన్నావురా? ఇప్పటికే దాదాపు ఓ ముప్పై సంఘాలున్నాయి. ఇప్పుడు మనం కొత్తగా పెడితే ఎవరు గుర్తిస్తారు.... ఏదైనా వెరైటీగా ఉండాలి...అలోచించు".
నాకు దిమ్మె తిరిగిపోయింది. వార్నాయనో! ఇంత సీను జరుగుతోందా. చెప్పొద్దూ, నా IQ లెవెల్ మీద, నాకే అనుమానమేసింది.
మళ్ళీ అలోచించడం మొదలుపెట్టాను....రక్తదాన శిబిరమూ, ట్యాంకర్లలో నీళ్ళ సరఫరా, సేవా కార్యక్రమాలూ.... ఇలా నేనేమి చెప్పినా, తల అడ్డంగా ఊపేస్తూ, ఇంకోమాట చెప్పమంటాడు.
కాసేపటికి, వాడికే విసుగొచ్చి, నాతో పనికాదనుకొని, నన్ను అలోచించి చెప్పమని, వెళ్ళిపోయాడు. ఎమ్మెల్యే ఫ్రెండుగా నా పరపతి (అదృష్టం బాగుంటే మినిస్టర్ ఫ్రెండు కూడా)....నా కల కరిగిపోతుంటే, నిస్సహాయంగా ఉండిపోయాను.
అందని ద్రాక్ష పుల్లన అని నాకునేను సర్దిచెప్పుకుంటున్న సమయంలో, సుందరం నుంచి ఓ రోజు ఫోన్, "చిరంజీవి ముఖ్యమంత్రవ్వాలని, మళయాళ మాంత్రికులతో పెద్ద యాగం చేస్తున్నాను,నువ్వు పొద్దున్నే ఫలానా చోటుకి వచ్చేసేయి. మన అదృష్టం బాగుంటే, చిరంజీవి తమ్ముళ్ళెవరైనా కూడా రావొచ్చు", మా వాడి గొంతులో ఎక్సైట్మెంటు.
మర్నాడు వాడు చెప్పినచోటుకి వెళ్ళి చూద్దునుకదా, అక్కడ దాదాపు డజను యాగాలు జరుగుతున్నాయి! ఆ జనంలో మా వాణ్ణి వెతికిపట్టుకునేటప్పటికి నాకు దేవుడే కనిపించాడు. సుందరం బిక్కమొహం వేసుకొని కనిపించాడు, "నా ప్లాను బయటికెలా పొక్కిందో తెలియట్లేదురా. ఒకళ్ళకుమించి ఒకళ్ళు, ఇంతమంది తయారైపోయారు. ఈ జనంలో నన్నెవరు గుర్తిస్తారు...."మీ కోసం యాత్ర ముగించుకున్న చంద్రబాబులా దిగాలుగా ఉన్నాడు సుందరం.
అయితే మా వాడు మాత్రం ఆశ పూర్తిగా వదులుకోలేదు. పబ్లిసిటీ కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు. కొద్ది రోజుల క్రితం వాణ్ణి మళ్ళీ కలిసాను. వాడి రూపమంతా మారిపోయింది. ఖద్దరు బట్టలూ, పక్కనే ఇద్దరు మనుషులూ....సుందరాన్ని గుర్తుపట్టలేకపొయ్యాను.
ఇంతలో చిరంజీవి పార్టీ పెడుతున్నట్లు ప్రకటించాడు.
సుందరం కూడా ప్రయత్నాలు తీవ్రతరం చేసాడు. రెండు, మూడు సార్లు హైదరాబాదు కూడా వెళ్ళొచ్చాడు. పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. చిరంజీవి కటౌట్లు పెట్టించాడు. ఖర్చులకోసం కొంచెం ఆస్తి కూడా అమ్మేసుకున్నాడని విన్నాను.
ఓ రోజు కలిస్తే, వాడి బాధనంతా వెళ్ళబోసుకున్నాడు..."పోటీ చాలా తీవ్రంగా ఉందిరా. ఆ సర్వేలు తీసేది ఎవ్వరో, ఏమీ అంతుచిక్కట్లేదు. లోకల్ కాంపిటీషను అనుకుంటే, ఇప్పుడు ఇంటర్నేషనల్ గా కూడా పోటీ ఎదుర్కోవాల్సి వస్తోంది. టిక్కెట్టు కోసం, కొంతమంది ఎన్నారైలు కూడా తయరయ్యారు..ఏమిచెయ్యాలో అర్ధం కావట్లేదు" అంటూ వాడి బాధను వెళ్ళబోసుకున్నాడు.
సుందరాన్ని చూస్తే నాకు జాలేసింది. ఎంత సరదాగా ఉండేవాడు, ఇలా పిచ్చివాడిలా అయిపోయాడు. వాణ్ణి చూసి బాధ పడటం తప్ప ఏమీ చెయ్యలేకపోయాను. ఆసలు, నేను చెపితే వినిపించుకునే స్టేజిలో ఉంటే కదా.
ఓ రోజు ఉందయాన్నే అర్జెంటుగారమ్మని సుందరం ఇంటినుంచి కబురొస్తే, ఏమయ్యిందోనని హడావుడిగా వెళ్ళాను. రెండు మోకాళ్ళకు కట్లతో మంచమ్మీద పడున్నాడు. చిరంజీవి ముఖ్యమంత్రి కావాలని, మోకాళ్ళతొ తిరుమలకొండ ఎక్కాడట. మోచిప్పలు రెండూ రాసుకుపోయాయి.
ప్రెస్సు వాళ్ళొచ్చి ఫొటోలు తీసుకుంటున్నారు. న్యూస్ చానెల్సు వాళ్ళు వాళ్ళావిడ ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు.
ఇంతలో ఎవరో హడావుడిగా వచ్చి, చిరంజీవి సన్నిహితుడు పరామర్శించడానికి వస్తున్నట్లు చెప్పారు. సుందరాన్ని చూడడానికి బయట జనాలు క్యూ కట్టేసారు. సుందరం మగతగా నిద్రలో జోగుతున్నాడు. ఏదొ మాట్లాడుతున్నట్లుంటే, ముందుకు వంగాను. నిద్రలో కలవరిస్తున్నాడు..."రాజకీయ శూన్యం, సమాజంలో మార్పు.....నేను సైతం, నేను సైతం" అంటున్నాడు!!!
*** *****
మీరే చెప్పండి, మా సుందరానికి చిరంజీవి టిక్కెట్టిస్తాడా?
11 comments:
హ్హ హ్హ హ్హా సుందరానికి తొందరెక్కువ:)
ముందుగా సెటైర్ బాగా పేలింది ... అభినందనలు
ఇకపోతే మీ సుందరానికి టిక్కెట్ ఖచ్చితంగా రాదు.
ముందు కోటాలో ఇచ్చేది/వచ్చేది ... ఇప్పటిదాకా సొంత పార్టీలో ఉంటూ దానినే తిట్టే వారు, వేరే పార్టీలో బాగా అధికారాన్ని అనుభవించి, ఫ్యాక్షనిజంతో అన్నీ సాధించిన/సాధించుకున్న వారు, ఇప్పుడు అధికార పార్టీలో వాళ్లను చూసి ఇంతకు ముందు సంపాదించుకున్నది లెక్కలోకి రాదు వీళ్ల కన్నా ఎక్కువ నొక్కెయ్యాలి ఈ సారి అనుకునే వారు ..
మీ సుందరం లాంటి వాళ్లకి మిగిలేదేమిటి అంటారా ... మోకాళ్ల నొప్పులు, గొంతు పూడుకుపోవటం(జిందాబాద్ లు కొట్టి).. అంతే
చాలా మంచి సెటైర్..సుందరానికి కాదుగానీ మీకుమాత్రం టిక్కెట్టు ఖచ్చితంగా రాదు.
mla kavalanukune Sundaraniki,
mla friend kavalanukune meeku
kachhitanga ticket raadhu.
prajaseva cheyalanukune variki matrame ticket vastundi,
vaaru yekkadunna gurtimpu labistundi.
మీ సుందరం ఒకటి మరిచాడు, మానసిక వికలాంగుల దగరకు వెళ్లి స్వీట్లు పంచడం, జెండా ఎగరవేయటం.
మీ సుందరం ఇవ్వాళ్టి పేపరు చూసాడో లేదో మరి -ఒకాయన పొర్లు దండాలు పెడుతూ తిరుమల కొండ ఎక్కుతున్నాడు! :)
సుందరానికి టికెట్ రాదు. ఎందుకంటే ఇలాంటి తొందరపాటు సుందరాలని ప్రెస్ వాళ్ళూ, జనాలు రెండు రోజులయ్యేప్పటికి మర్చిపోతారు. అసలు టికెట్ వస్తుందో రాదో చిరంజీవి కి కూడా తెలీదు,"భలే ఉందే, నాకేం తెలుసు? నేనేం అరవింద్ నా లేక మిత్రానా ఇలాంటి విషయాలు తెలీడానికి " అంటాడు.. ఎందుకంటే పార్టీలో ఆయన ప్రస్తుతమైనా తరవాతైనా ఉత్సవ విగ్రహం మాత్రమే కాబట్టి! అరవింద్ ని కలిస్తే ప్రయోజనం ఉండొచ్చు.
అన్నట్టు సుందరం ఇవాల్టి పేపరు చూళ్ళేదా?
@ రాజేంద్ర కుమార్ దేవరపల్లి గారు:
కాంపిటీషను అంత తీవ్రంగా ఉంటే, సుందరం తొందరపడకుండా ఎలా ఉంటాడండీ....?
@ తెలుగు'వాడి'ని గారు :
పాపం, సుందరం లాంటి వాళ్ళకు అంత తెలివే ఉంటే, ఇంత హంగామా ఎందుకు జరుగుతుంది?
@ కత్తి మహేష్ కుమార్ గారు:
మీరంత point blank లో పేలిస్తే, సుందరం తట్టుకో లేడండీ!
@ sri గారు:
చిరంజీవికి కూడా (సారీ, ఆయన తమ్ముళ్ళకు, బావమరిదికి, సన్నిహితులకూ) ఈ విషయం తెలుసనుకుంటాను....!
@ యవన్ గారు:
good one.
@ chaduvari గారు:
సుందరం అంటే అతనేనండీ !
@ సుజాత గారు:
అంత తెలివే ఉంటే,ఇంతమంది లోకల్ సుందరం లు,NRI సుందరం లు ఎందుకు తయారవుతారండీ...
అన్నట్లు, మన సుందరం తిరుపతి సభకెళ్ళాడు, చూద్దాం ఇప్పుడేమి చేస్తాడో!
Thank you all!
గిరీష్..
"సుందరం అంటే అతనేనండీ !": హహ్హహ్హా, అదిరింది :)
చదువరిగారు, నెనర్లు!
హ హ హ అదిరింది
బొల్లోజు బాబా
Post a Comment