అమావాస్య రాత్రిని నిందించలేను, దాని గర్భంలో దాగిన సహస్రకిరణపిండం కోసం ప్రతిక్షణం నా ప్రతీక్షణం - సినారె
Monday, January 26, 2009
రాధామాధవీయం!
తన ఓటమిని అంగీకరిస్తూ, చీకటిని ఆహ్వానించడానికి పశ్చిమాన భానుడు సిద్దమౌతున్నాడు. ఆకాశంలో అరుణం బూడిదరంగులోనికి మసకబారుతూ, రాత్రిని స్వాగతిస్తోంది. క్షణక్షణానికీ పెరుగుతోన్న సాయంకాలపు నీడలను తన హృదయానికి హత్తుకుంటూ, మందగమన అయిన యమున, లయబద్దమైన తన గలగలతో బృందావనాన్ని జోకొట్టడానికి సిద్దంగాఉంది. చీకటివెలుగులకు తన వెండిమెరుపులను అద్దడానికి చంద్రుడు ఉత్సాహంగా ఉరకలువేస్తున్నాడు.
కానీ, యమున హొయలనూ, చంద్రుడి ప్రభనూ గమనించే స్థితిలో బృందావనమూ, అందులోని గోపకాంతలూ లేరు. తమ మానసచంద్రుడైన ఆ నందనందనుడు చెంతలేని లోటును, ఆ శరత్చంద్రుడేమాత్రం పూరించగలడు? ఆ మురళీకృష్ణుడి వేణుగాన సమ్మోహనాన్ని, శరత్పూర్ణిమ చల్లదనం మరిపించగలదా?
దారిపొడవునా తమ హృదయపు తివాచీని పరచి, చూపులతో తోరణాలల్లి ఆ లీలామోహనుడి రాకకోసం ఎదురుచూస్తున్నారు ఆ గోపికలు.
విరహబాధను ఓపలేని ఓ గోపిక, "కన్నయ్య మనతో ఉన్నంత సేపు ఘడియలు క్షణాలౌతాయి. తను మనచెంత లేనప్పుడు క్షణమొక యుగమౌతుంది" అంటు వాపోయింది.
"ఆహా, కనీసం వెదురుముక్కనైనా కాకపోతిని కదా, తన చేతి మురళినై కన్నయ్య సన్నిధి అనే పెన్నిధిని శాస్వతంగా పొందేదాన్ని" ఇంకొక గోపిక బాధపడింది.
"తను మనతో ఉన్నంతసేపూ, ఎప్పుడు వెళ్ళిపోతాడోనన్న భయం. వెళ్ళిపోగానే, మళ్ళీ ఎప్పుడొస్తాడోనన్న దిగులు, ఎదురుచూపు. నేను భరించలేకున్నాను సఖీ, ఈ ఎడబాటును...."
“గోవర్ధనగిరిని అలవోకగా ఎత్తిన ఆ గిరిధరుడు, దుఖభారముతో క్రుంగిన మన మనస్సులను పైకెత్తలేడా... పూతనాది రాక్షసులను అవలీలగా సంహరించిన వాడు తన ప్రత్యక్షమాత్రముచే మన విరహాగ్నిని హరించలేడా....” ఇలా తర్కించుకున్న కొద్దీ, వారి గుండెలు బరువెక్కి, దుఖం కన్నీరై ఉబికివస్తోంది.
ఇంతలో అందరి కళ్ళూ, ఓ పక్కన నిశ్శబ్ధంగా కూర్చున్న రాధపై పడ్డాయి. చిత్రంగా, రాధ మోములో చింత లేశమాత్రమైనా లేదు. దుఖపు ఆనవాలూ లేవు. వేయి పున్నముల ప్రకాశాన్ని వెదజల్లుతున్న మఖచంద్రముతో, ప్రశాంతవదన అయి, కృష్ణుడు తనచెంతలేడన్న బెంగ ఏమాత్రమూ లేనిదై, అలౌకికానంద స్థితిలోనున్న రాధను చూసిన గోపికలు ఆశ్చర్యచకితులయ్యారు.
"మన రాధమ్మను చూడవే. కన్నయ్య చెంతలేడన్న బెంగ అస్సలు లేదు. ఈ ఎడబాటును భరించలేక, క్షణమొక యుగమై, విరహాగ్నిలో జ్వలిస్తున్న మనమెక్కడ, ఏ మాత్రమూ చీకూచింతలేని ఈ రాధ ఎక్కడ? అయినా కానీ, కన్నయ్యకు ఈ రాధే ప్రియసఖి...", ఆశ్చర్యము, కాస్త అసూయతో ఓ గోపిక నిరసించింది.
"తనకోసం తపనపడే మనమెప్పుడూ కన్నయ్య కళ్ళకు కనిపించం. తనకోసం అంతగా ఆరాటపడని ఆ రాధమ్మంటే ఎంతప్రేమో..." ఇంకో గోపిక నిష్టూరమాడింది.
కృష్ణుడిపై ఉన్న అపారమైన ప్రేమ వలన కలిగిన చనువుతో, తనను చూడవలెనన్న గాఢమైన కోరికతో, పరిపరివిధాలుగా వారు మాట్లాడుకొంటుండగానే, ఆ గొపికలకిష్టుడు, గోపాలకృష్ణుడు రానే వచ్చాడు. ఆ నందనందనుడి మురళీగానం వారిని ఆనందలోకాలలో విహరింపజేస్తోంది. ఆ నల్లనయ్య కాలి మువ్వల సవ్వడి వారి మనసులలో అలజడిరేపుతోంది.
అంతవరకూ ఎవ్వరిరాకకై పరితపించారో, ఆ సమ్మోహనాసుందరుడు రానేవచ్చాడు.
కన్నయ్యను చూసిన ఆనదాతిశయాలనుంచి వారందరూ తేరుకోకమునుపే, వారెవ్వరినీ చూడనట్టే, నేరుగా రాధ దగ్గరికెళ్ళాడు.
తనువచ్చాడన్న హర్షాతిరేకంలో తమ బాధాతప్తహృదయాలు సేద తీరకమునుపే, తమని అలా నిర్లక్ష్యం చెయ్యడం ఆ గోపికలను చాలా క్లేశానికి గురిచేసింది. ఇంతసేపూ తాముపడ్డ వేదన, తమని అలక్ష్యం చేసాడన్న బాధ, కోపం, తనకోసం ఏమాత్రమూ చింతించని రాధ దగ్గరకే వెళ్ళాడన్న అసూయ, అన్ని భావాలూ కలిసి ఖిన్నులై చూస్తుండగానే, ఆ అల్లరివాడు మబ్బుచాటు చంద్రుడివలే మాయమయ్యాడు.
బృందావనం తెల్లబోయింది! కన్నయ్య వచ్చాడన్న గోపకాంతల ఆనందం, తమను పలకరించలేదన్న కోపంగామారి, అంతలోనే అదృశ్యమవడంతో ఆశ్చర్యంగా రూపాంతరంచెంది, దుఖతరంగమై ఉవ్వెత్తున ఎగసిపడింది. నీళ్ళునిండిన కళ్ళతో, మసకబారిన చూపుతో ప్రతి చెట్టూ, ప్రతి పుట్టా, ఆ నల్లనయ్యకోసం గాలించసాగారు. వచ్చినట్లే వచ్చి మాయమైన ఆ మాయామోహనుడి కోసం శరీరమంతా కళ్ళు చేసుకొని వెదకసాగారు.
కన్నీటియమునలో మునిగిన గోపికల మదిలోని తమస్సును హరిస్తూ, కృష్ణోదయపు ఉషస్సు మళ్ళీ ప్రకటితమయ్యింది. వియోగం మహద్భాగ్యానికి పునాది అయ్యింది. విషాదం వికాసానికి హేతువయ్యింది. పద్మనయనంబులవాడు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. ఒక్కడు కాదు. ఇద్దరు కాదు. ఎటుచూసినా కృష్ణులే. ప్రతి గోపిక పక్కనా కృష్ణుడే. ఇద్దరు కృష్ణులనడుమ గోపిక. ఇద్దరు గోపికలనడుమ కృష్ణుడు. ఎటుచూస్తే అటు కృష్ణుడు. అంతా కృష్ణమయం. బృందావనం ఆనందవనమయ్యింది. ఆనందం అనంతమయ్యింది. అనంతుడు అంతా తానయ్యాడు.
వియోగంతో ఉబికిన కన్నీటి చుక్క చూపును మసకబారిస్తే, సంయోగంతో కలిగిన ఆనందాశ్రువు కుంభాకారకటకమై కృష్ణుడిని మరింతదగ్గరగా ఆవిష్కరించింది.
ఆ గిరిధరుడి అధరసంగమ మాధుర్యాన్ని మోసుకొచ్చే మురళీరవళి, ఘల్లుఘల్లుమంటూ మ్రోగే అందెల చడి,బృందావన పరిమళాల ఘమఘమలు, ఉరకలెత్తే యమున గలగలలు,శరత్చంద్రుడి మిలమిలలు, వీటన్నిటినీ మించి సుందర సమ్మోహనాస్త్రభరితమైన ఆ నల్లనయ్య నాట్యం. బృందావనం పరవసించింది.
జీవితానికి సరిపడా అనుభవాన్ని మూటగట్టుకున్న గోపికలు, అలసి సొలసి కన్నయ్య చెంత చేరారు. మెలమెల్లగా స్పృహలోకొచ్చిన గోపికలు, విడిపోవలసిన సమయమాసన్నమైనదన్న ఎరుక గలిగి, తమను వీడిపోవలదని కన్నయ్యను వేడుకొన్నారు.
వాళ్ళ ఆవేదనను కృష్ణుడు చిరునవ్వుతో చూస్తున్నాడు. చిత్రంగా, కృష్ణుడి పక్కనేవున్న రాధమోములో ఏ మాత్రమూ ఖేదము లేదు. దాన్ని చూసిన గోపికల గుండెల్లో చిన్నపాటి అసూయావీచికలు.
అంతా గమనిస్తున్న కృష్ణుడు, ఇలా చెప్పాడు.
"నా ప్రియసఖులారా, ఇతరులు మనల్ని ప్రేమించేలా చేసుకోవాలంటే, ఒకటే మార్గం మనం వాళ్ళ ప్రేమకి ఎంత అర్హులమో చెప్పటం కాదు. వాళ్ళనుంచీ ఏమీ ఆశించకుండా ప్రేమించడం మాత్రమే. సంభాషణ కాదు, సాన్నిహిత్యమే ప్రేమకు భూషణం. త్యాగం ప్రేమకి హృదయం. షరతులు లేని ప్రేమతో మీ హృదయం ఒక్కసారి నిండితే చాలు, మీరు నన్ను సాధించినట్లే.
నా చేతిలోని ఈ మురళిని చూడండి. ఒక చిన్న వెదురుముక్క, తన శరీరాన్ని చిద్రం చేసుకొని, ఎంతో కష్టాన్నోర్చి ఎనిమిది రంధ్రాలతో మురళిగా మారింది కాబట్టే, నా చేతి ఆభరణమయ్యింది. నాకే అలంకారమయ్యింది. చేత మురళి లేని నన్నూహించగలరా మీరు?
నా ప్రేమ, వివేకం పట్ల అచంచలమైన, షరతులులేని విశ్వాసమే, మీ దుఖాలన్నిటికీ పరిష్కారం. నేను ప్రక్కనున్నా, లేకున్నా, రాధ మోములోని ప్రశాంతతకు కారణం ఈ విశ్వాసమే. నేను భౌతికంగా తనప్రక్కన లేకున్నా, గుండెలనిండా నన్నేనిలుపుకున్న తను ఏనాడూ, నాకు దూరం కాలేదు. నాతోడును శాస్వతంగా పొందిన తనను, దుఖం దరి చేరదు.
ఒక చిన్న విషయం గుర్తెరగండి. మాయ వలన నేను మాయమవ్వలేదు. నేనులేకపోవడంవలనే మాయ మిమ్మల్ని లోబరుచుకుంది. మీరు దుఖావేశాలకు లోనయ్యారు.
జీవించడానికే ప్రేమిద్దాం. ప్రేమించడానికే జీవిద్దాం. జీవితాన్ని సంపూర్ణంగా అంగీకరిద్దాం. అలా అంగీకరించిన నాడు, ప్రతీ ఒక్కరి జీవితం బృందావనమే! జీవనం ఆనందనర్తనమే!”
గోపకాంతల మనోనేత్రాలను కమ్మిన పొరతొలగింది. సందేహపు కారుమబ్బులు విడిపోయాయి. జగమంతా కృష్ణమయంగా కనపడుతోంది. తనప్రక్కన కృష్ణుడు. తనలోన కృష్ణుడు. రాధలో కృష్ణుడు. రాధతో కృష్ణుడు. అంతా కృష్ణుడే! అన్నిటా కృష్ణుడే!
అహా, వినండి. ఆ కమ్మని వేణుగానం మన మనోద్వారకాద్వారాలు మీటి, మనలోని బృందావనాన్ని ఆవిష్కరిస్తోంది. సందేహపు మరకల్ని కడిగేస్తోంది!
Subscribe to:
Post Comments (Atom)
12 comments:
చాలా బాగా రాసారండీ..
"ఒక చిన్న విషయం గుర్తెరగండి. మాయ వలన నేను మాయమవ్వలేదు. నేనులేకపోవడంవలనే మాయ మిమ్మల్ని లోబరుచుకుంది."
"జీవించడానికే ప్రేమిద్దాం. ప్రేమించడానికే జీవిద్దాం. జీవితాన్ని సంపూర్ణంగా అంగీకరిద్దాం. అలా అంగీకరించిన నాడు, ప్రతీ ఒక్కరి జీవితం బృందావనమే! జీవనం ఆనందనర్తనమే!”"
ఒక్క ప్రేమ భావనే కే కాదు, ఈ కక్షలూ, కార్పణ్యాలూ, అపార్ధాలూ, కష్టాలూ, కన్నీళ్ళూ.. అన్నీ చాలా వరకు మటుమాయమైపోతాయి ఈ మాయను పక్కనపెట్టి తనలోకి తను తరచిచూసుకొనే శక్తి ఉండాలే గాని..: .. ఇది మీ పోస్టు చదవగానే నాకొచ్చిన ఆలోచన.. (కొద్దిగా అసందర్భం గా ఉండొచ్చు.... )
"మాయ వలన నేను మాయమవ్వలేదు. నేనులేకపోవడంవలనే మాయ మిమ్మల్ని లోబరుచుకుంది"
చాలా బాగా రాశారు
ప్రేమ గురించి మంచి నిర్వచనాన్ని ఇచ్చారు. మీరు వ్రాసిన శైలి, వాడిన పదాలు కూడా వెన్నెల్లో బృందావనం అంత హాయిగా ఉన్నాయి. చాలా బాగా వ్రాశారు.
నాకూ ఇదే నచ్చింది. "మాయ వలన నేను మాయమవ్వలేదు....." ! చాలా బాగా వర్ణించారు. మీరు పెట్టిన ఫొటో ఎన్లార్జ్ చేసి దాచుకోవాలన్నంత మనోహరంగా ఉంది.
@ ఉమాశంకర్
మీకొచ్చిన ఆలోచన అసందర్భమేమీకాదు. ఈ టపా వెనుక నా ఉద్దేశ్యం కూడా దాదాపు అదే. మీ అభినందనకు కృతఙతలు.
@ ఫణి ఫ్రదీప్ గారు, వేణు గారు, మీ అభినందనకు ధన్యవాదాలు.
@ సుజాత గారు, నాక్కూడా చాలా ఇష్టమైన ఫోటో అది. ధన్యవాదాలు.
గిరీష్ గారు,
బాగుందండి
"ఒక చిన్న విషయం గుర్తెరగండి. మాయ వలన నేను మాయమవ్వలేదు. నేనులేకపోవడంవలనే మాయ మిమ్మల్ని లోబరుచుకుంది."
చిన్న విషయం కాదు అదే జీవితానికి ఎప్పుడు గుర్తుంచుకునేంత పెద్ద విషయం...
గిరీష్, "జీవించడానికే ప్రేమిద్దాం. ప్రేమించడానికే జీవిద్దాం. జీవితాన్ని సంపూర్ణంగా అంగీకరిద్దాం."
నాకు ప్రతి సంఘటనలో, జీవితానుభవంలో కర్మయోగాన్ని బట్టి ఒక సంస్కారానికి, దైవసంకల్పానికి ఒక ముడి వేయటం తెలియకుండానే చేస్తాను. అన్నిటా ఏదో సందేశం వెదుక్కోవటం అలవాటు. నిన్న రాత్రి మా అమ్మ గార్ని తలుచుకుంటూ, ఏదో ప్రేమరాహిత్యానికి గురైన భావనని భరిస్తూ వున్న మానసిక స్థితిలో నా బ్లాగులో మీ వ్యాఖ్య 3:30am కి చూసాను. అలా మీ బ్లాగుకి వచ్చాను. మీ ప్రొఫైలులోని గీతంజలిలోని వాక్యం, latest రెండు టపాలు నాకు conversation with god and a message మాదిరి అనిపించాయి. ఒకవిధమైన సంతృప్తితో నిద్రపట్టింది, ఈ ఉదయం కూడా అనిర్వచనీయమైన ఆనందంతో లేచాను. ఇంత ప్రభావం చూపిన మీ టపా గురించి ఈ నాల్గు మాటలు వ్రాయకుండా నా దైనందిన జీవితంలోకి వెళ్ళను మనస్కరించలేదు. అందువలన, నా ధ్యాన సమయంలో ఈ వ్యాఖ్య వ్రాసాను. ఈ యాదృఛ్ఛిక ఘటనకి పరమాత్మకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా పరిచయం ఇలా చేసుకుంటున్నాను.
ఉష గారు, మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నా టపాలు మిమ్మల్ని ప్రభావితం చెయ్యడమనేది నా అదృష్టం. భగవంతుడు, pre-determinism, భగవంతుని ప్రేమ...నాకు వీటన్నిటి మీదా అచంచలమైన విశ్వాసం ఉంది అనుకునేవాణ్ణి. అందుకే కాబోలు, ఇంతవరకు నేను వ్రాసిది కొంచమే అయినా, వీటిమీదే ఎక్కువగా వ్రాసాను. కానీ, మా అమ్మగారి మరణం నా నమ్మకాలకు పెనుసవాలుగా నిలచింది. అమ్మ అకాలమరణం నన్ను నిరత్తురిడిని చేసింది. ఈ మరణం వెనుకు ఉన్న భగవంతుని logic ని ప్రశ్నించకుండా, దాన్ని అంగీకరించడానికి నేను విశ్వప్రయత్నమే చెయ్యాల్సివచ్చింది. ఇప్పటికీ పూర్తిగా అంగీకరించానా అన్నది నాకే స్పష్టంగా తెలియదు.
ఏమైనా, నా ఆలోచనలతో సారూప్యం ఉన్న మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషాన్ని, మీ మాటలు స్వాంతనను ఇచ్చాయి. Thank You very much! - Gireesh
@ఉష గారు,
"నాకు ప్రతి సంఘటనలో, జీవితానుభవంలో కర్మయోగాన్ని బట్టి ఒక సంస్కారానికి, దైవసంకల్పానికి ఒక ముడి వేయటం తెలియకుండానే చేస్తాను".
నాకు తెలుసు, అది చాలా ఉన్నతమైన స్థితి. అదృష్టవంతులు. నేనేదో, నాకునేను స్పష్టథ కలిగించుకునే ప్రయత్నంలో రాసిన రాతలు,మీ సంతృప్తికి కారణమయ్యాయని తెలిసి చాలా సంతోషమేసింది. మీ అభిమానానికి ధన్యవాదాలు!
గిరీష్, "జీవించడానికే ప్రేమిద్దాం. ప్రేమించడానికే జీవిద్దాం." ఈ రెండిటినీ పొడిగిస్తూ మరువం వేసిన చివురిది. "నిను చేరక నేనుండలేను"http://maruvam.blogspot.com/2009/08/blog-post_26.html
కృతజ్ఞతలు.
Beautiful.
Thanks to Ushagaru for pointing here.
మనం వాళ్ళ ప్రేమకి ఎంత అర్హులమో చెప్పటం కాదు. వాళ్ళనుంచీ ఏమీ ఆశించకుండా ప్రేమించడం మాత్రమే. సంభాషణ కాదు, సాన్నిహిత్యమే ప్రేమకు భూషణం. త్యాగం ప్రేమకి హృదయం. షరతులు లేని ప్రేమతో మీ హృదయం ఒక్కసారి నిండితే చాలు...
Beautiful.. chala baaga raasarandi.
Post a Comment