అమావాస్య రాత్రిని నిందించలేను, దాని గర్భంలో దాగిన సహస్రకిరణపిండం కోసం ప్రతిక్షణం నా ప్రతీక్షణం - సినారె
Saturday, December 6, 2008
నిస్తేజం..నిర్వేదం..నిర్లిప్తం!
చాలా పెద్ద దేశం!
ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన దేశం! ఎంత ఘనం అంటే, ఒకప్పుడు ఈప్రపంచానికే, చాలా విషయాల్లో దిశా నిర్దేశం చేసిన ఘనకీర్తి దాని సొంతం!
ఆ దేశప్రజలు కూడా, తమ దేశానికిమల్లే ఎంతో విలక్షణమైన స్వభావం కలిగిన వాళ్ళు - జనాభాలో అధికశాతం ఉష్ట్రపక్షులు.ఈ ఉష్ట్రపక్షులు, తమ చుట్టూ రేగే తుఫాను ఎంత తీక్షణమైనదైనా,ఇసుకలో తలదూర్చి, తుఫాను తగ్గే వరకు ఎదురుచూసి, ఆ తరువాత దులుపుకొని వెళ్ళిపోతుంటాయి. తనూ, తనచుట్టూ గీసుకున్న చిన్న వృత్తం - ఇవే వీటికి పరమావధి. ఇవి, తుఫాను తరువాత ఇసుక విదిల్చుకొనడం చూసి, వీటిల్లో మార్పు వచ్చిందనుకుంటే, మనం పప్పులో కాలేసినట్లే. మళ్ళీ, తుఫానొచ్చేవరకు, వీటి ప్రస్తానం ఇంతే. తమ హక్కులుతప్ప భాద్యతలు పట్టించుకోని ఈ ఉష్ట్రపక్షులు, చదువుకున్న మధ్య తరగతి శ్రేణికి చెందినవి.
ఆ తరువాత చెప్పుకోవలసింది గొంగళిపురుగులు గురించి. ఇవి మేధావి వర్గానికి చెందినవి. తమ తెలివితేటలతో,వాదనా పటిమతో, ఏ విషయమ్మీదైనా అనర్గళంగా తమ అభిప్రాయాల్ని శలవిస్తుంటాయి. వీటికి ప్రపంచమే ఒక వేదిక. పుస్తకాలు, పత్రికల్లో వ్యాసాలూ గట్రా వ్రాస్తూ, టీవీ టాక్ షోల్లో సామాజిక స్థితిగతుల్ని విశ్లేషిస్తూ గొప్ప దేశసేవ చేస్తున్నామన్నట్లు ఫోజు కొడతాయి. అడపాదడపా వచ్చే బుకర్స్ ప్రైజులూ,పద్మశ్రీ అవార్డులూ, ఈ గొంగళి పురుగులకి అదనపు అలంకారం.
ఇకపోతే, బానిస చీమలు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్తితి వీటిది. వీటిలోకం వీటిది. ఉష్ట్రపక్షులు వీటినెలాగూ పట్టించుకోవు. కానీ, గొంగళిపురుగులు మాత్రం,ఈ బానిసచీమల్ని ఉద్దరించడమెలా అని తీవ్రంగా తర్కిస్తూ, విశ్లేషిస్తూ తమ పబ్బం గడుపుకుంటుంటాయి. అయితే, ఎవరెన్ని చేసినా ఈ చీమల తలరాత మాత్రం మారదు.
ఇక మిగిలింది గుడ్లగూబలు, నల్లులు, పందికొక్కులు. వీటి సంఖ్యాబలం తక్కువే అయినా, ఇవి పాలక వర్గానికి చెందినవి. వీటి గురించి కాస్త వివరంగా తెలుసుకుందాము.
ఈ దేశం తన స్వాతంత్ర్యాన్ని అరవై యేళ్ళకిందటే సాధించినా, ప్రజాస్వామ్య దేశంగా ఆవిష్కరించుకున్నా, తరతరాలుగా అలవడిన బానిసత్వం మాత్రం రాచరికవ్యవస్తని సజీవంగా ఉంచింది. ఈ దేశపు రాజకీయాలు మొత్తం ఒకే ఒక కుటుంబం చుట్టూ తిరుగుతుంటాయి. గుడ్లగూబలు, పందికొక్కులూ,జలగలూ, నల్లులూ మొదలైన పాలకవర్గపు జీవులు, మనుగడకోసం, ఈ కుటుంబమ్మీదే ఆధారపడి ఉన్నాయి. వీలైతే ఈ కుటుంబాన్ని పొగిడి, లేకపొతే తెగిడి, తమ ఉనికిని చాటుకుంటుంటాయి. చిత్రమేమిటంటే, అధికారంలో ఉన్నా, లేకున్నా, ఈ దేశ రాజకీయాలన్నీ, ఈ కుటుంబం చుట్టే పరిభ్రమిస్తుంటాయి.
ప్రస్తుతం ఈ కుటుంబం పెద్ద, రాజమాత. యువరాజు పట్టాభిషేకానికి ఇంకా సిద్ధమవ్వలేదు కాబట్టి, అంతవరకూ సింహాసనం చేజారిపోకుండా జాగ్రత్తగా కాపుకాస్తోంది. అందులో భాగంగానే, యువరాజు పూర్తిగా సన్నద్ధమయ్యేంతవరకు,సింహాసనమ్మీద ఒక వానపామును కూర్చొబెట్టింది. ఈ వానపాము బాగా చదువుకున్నదే అయినా, దానికి వెన్నుముక లేకపోవడం రాజమాతకు బాగా కలిసొచ్చింది. యువరాజు రాజకీయ భవిష్యత్తుకి, ఈ వానపాము వలన ఏమాత్రమూ ప్రమాదం లేదనే నమ్మకంవల్లే సింహాసనాధీష్టానికి రాజమాత ఒప్పుకుందనే సత్యం తెలిసినా, ఆమెను ఒక త్యాగశీలిగా అభివర్ణిస్తాయి ఇక్కడి గొంగళిపురుగులు. బానిస చీమలు ఔరా, నిజమే కాబోలు అని నమ్మేస్తాయి. ఇకపోతే,ఉష్ట్రపక్షులకి ఈవిషయం ఎలాగూ పట్టదు. ఎందుకంటే, ఓటు వెయ్యమని ప్రభుత్వమిచ్చిన శలవుని,ఈ ఉష్ట్రపక్షులు విహారయాత్రకు ఉపయోగించుకుంటాయి కాబట్టి. ఇంకో మాట చెప్పాలంటే, ఈ దేశ జనాభాలో అధికశాతమైన ఈ ఉష్ట్రపక్షుల అలసత్వమే, ఈ రాబందులపాలిట వరం.
ఈ నేపధ్యంలో, తను నియమించిన వానపాము ద్వారా,తన వందిమాగధులైన ఇతర గుడ్లగూబల సహకారంతో,ఈ దేశాన్ని జనరంజకంగా రాజమాత పరిపాలిస్తుండగా, ఒక పెద్ద విపత్తు సంభవించింది. పొరుగు దేశానికి చెందిన కొన్ని రాబందులు ఈ దేశంపై దండెత్తాయి.
ఇటువంటి దాడులకి ఈ దేశం చాన్నాళ్ళక్రితమే అలవాటు పడింది. సాధారణంగా, ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు, ఒకట్రెండు రోజులపాటు గొంగళిపురుగుల ఉపన్యాసాలు, టీవీల్లో టాక్ షోలు, వానపాము ప్రధానమంత్రి ఇచ్చే భరోసా, ముష్కరుల అంతుచూస్తామనే అంతర్గత భద్రతాశాఖామాత్యుని ఉత్తరకుమార ప్రగల్భాలు....ఇంతలో ఉష్ట్రపక్షులు దులుపుకొని తమ తమ వృత్తాల్లోకి వెళ్ళిపోతాయి..చీమలు మళ్ళీ పనిలో పడిపొతాయి... అహా ఏమి స్థైర్యము అని జబ్బలు చరుచుకుని, జరిగిన ఘోరాన్ని అంతా మరిచిపోతారు. కానీ, దురదృష్టవశాత్తూ, ఈసారి రాబందుల దాడి కాస్త తీవ్రంగానే ఉంది.
నెమ్మదిగా తేరుకున్న వానపాము, అధికారంలో ఉన్న గుంటనక్కలూ, పందికొక్కులు, వీటన్నిటికీ పెద్ద దిక్కైన అమ్మ ఇంట్లొ సమావేశమై, ఏమి చెయ్యాలని చర్చించసాగాయి. అమ్మ చాలా కోపంగా ఉంది. యువరాజు కోసం చాలా జాగ్రత్తగా కాపుకాస్తున్న సిం హాసనం కాస్తా, పట్టాభిషేకమహోత్సవం దగ్గరపడుతున్న తరుణంలో చేజారిపోయే పరిస్తితి. అమ్మ కోపంతో ఊగిపోతూంది. "మనమేదో ఒక్కటి చెయ్యాలి", ఆ భయంకరమైన నిశ్శబ్ధాన్ని పోగొట్టడానికా అన్నట్లు, అమ్మ బూట్లు తుడుస్తున్న వానపాము అంది. "సంభవామి యుగే యుగే,అని గీతలో చెప్పారు.దేవుడు తప్పకుండా ఏదో ఒకటి చేస్తాడు", అమ్మ మనుమల్ని ఆడిస్తున్న అంతర్గత వ్యవహారాలు చూసే ముసలి నక్క అంది. ఈ నక్క గతంలో భగవద్గీతమీద ఒక పుస్తకం కూడా వ్రాసిందిలెండి, అందుకే దాన్ని ఉదహరిస్తూంటుంది. కానీ అమ్మ ఒక్కసారిగా ఉరిమి చూసేసరికి, నక్క టక్కున నోరు మూసేసింది. "అసలు నిన్ను మంత్రిని చెయాడమే నా బుద్ది తక్కువ.." అమ్మ కోపంతో ఊగిపోతూంది.సలహా కోసం అన్నట్లు, గొప్ప న్యాయవాదిగా పేరున్న ఇంకో గుంటనక్కవైపు చూసింది.
"ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చెయాలి. ముఖ్యంగా, ఆ రాబందుల మతం గురించి అస్సలు మాట్లాడకూడదు. మనకున్న బలమంతా ఈ మతంవాళ్ళే. కాబట్టి, ఎవ్వరూ నోరు జారకుడదు", గుంటనక్క అందరికీ జాగ్రత్తలు చెబుతోంది.
"ఆ వృద్ద జంబూకం కాసుక్కూచుంది. బాబుని అందలమెక్కించడానికి అంతా సిద్దం చేసుకుంటున్న సమయంలో, ఇలా జరిగింది" మాటలు వంటింట్లోంచి వినబడడంతో, అంతా అటుతిరిగారు. కోపంగా ఉన్న అమ్మని చల్లబరచడానికోసం పళ్ళరసం తీసుకొస్తూ, ఆ దేశ రాష్ట్రపతి కనబడింది. ముందు జాగ్రత్తగా, బాబు పట్టాభిషేకానికి ఎటువంటి అడ్డూ ఉండకూడదని, గతంలో తన ఇంట్లో పనిచేసిన వంటకత్తెనే రాష్ట్రపతిని చేసింది అమ్మ.
ఎంతో జాగ్రత్తగా వేసిన ప్లాను ఇలా బెడిసికొట్టడంతో కోపంతో ఊగిపోతున్న అమ్మను చల్లబరచడమెలాగో ఎవ్వరికీ అర్ధం కావట్లేదు.
కాసేపు తర్జనబర్జనలు పడి, అమ్మ వందిమాగధులంతా కలిసి, తప్పంతా ఆ ముసలి నక్కదే అని నిర్ణయించేసి, దాని చేత రాజీనామా చేయించేసారు. కుర్చీ కోసం మారాం చేస్తున్న యువరాజుని బుజ్జగించి, వానపాముని తీసుకుని అమ్మ దాడిజరిగిన ప్రాంతాన్ని చుట్టివచ్చింది. ఈ విపత్తుకి కారణమైన రాబందుల్ని తుడముట్టిస్తామని భీకర ప్రతిజ్ఞ చేసింది వానపాము. ముసలినక్క ఖాళీ చేసిన కుర్చీలో, ఇంకో నక్కని కూర్చోబెట్టింది అమ్మ. వానపాము ప్రభుత్వం అలసత్వాన్ని ఎండగట్టి, వీలైతే ఎన్నికల్లో గెలిచి, ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోవచ్చని వృద్ద జంబూకం మళ్ళీ దేశమ్మీద పడింది. అమ్మ చుట్టూ ఉండే పందికొక్కులంతా కలిసి అమ్మకుటుంబం ఇన్నాళ్ళూ చేసిన త్యాగాన్ని ఏకరువు పెట్టి, ఇప్పుడు జరిగిన ఘోరం అమ్మ కుటుంబానికి జరిగిన విపత్తుకంటే చాలా చిన్నదని చెప్పే ప్రయత్నం మొదలు పెట్టాయి. సందట్లో సడేమియా అని, గొంగళిపురుగులన్నీ మహా ఘాటుగా ఉపన్యాసాలు దంచేస్తున్నాయి. టీవీ చానెళ్ళన్నీ, భావోద్వేగాలతో కూడిన కార్యక్రమాల్ని ప్రసారం చేస్తూ తమ తమ టీఆర్పీల్ని పెంచుకున్నాయి.
రెక్కాడితే కానీ డొక్కడాని బానిస చీమలు, మళ్ళీ తమ జీవనపోరాటంలో మునిగిపోయాయి.
ఇసుకలో తలదూర్చి, ఈ గొడవ సద్దుమణిగే వరకు ఎదురుచూసిన ఉష్ట్రపక్షులు, మెల్లగా విదిల్చుకుంటున్నాయి. కాకపోతే, ఈసారి మాత్రం వాటికి తమ భవిష్యత్తు గురించి కాస్త చింత కలిగింది. కాస్త కదలిక వచ్చినట్లే ఉంది. కానీ, ఈ చైతన్యం ఎన్నాళ్ళుంటుంది? కనీసం రెండువందలమంది అమాయకుల ప్రాణత్యాగమైనా ఈ దేశంలో మార్పుకి కారణమౌతుందా? మతం పేరుతో, కులం పేరుతొ, భాష పేరుతొ ప్రజల్ని విజయవంతంగా విడకొట్టి, తమ పబ్బం కడుపుకుంటున్న ఈ పందికొక్కుల్ని, ఈ చైతన్యం నిలువరించగలదా? అన్నిటికంటే ముఖ్యంగా, దేశ రాజకీయానికి పట్టిన నపుంసకత్వాన్ని, ఈ చైతన్యం వదిలించగలదా?
**** ****
ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో,
ఎక్కడ మనుషులు తలెత్తి తిరుగుతారో,
ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో,
సంసారపు గోడలమధ్య ఎక్కడ భాగాలకింద ప్రపంచం విడిపోలేదో,
ఎక్కడ సత్యాంతరాళంలోంచి పలుకులు బైలు వెడలతాయో,
ఎక్కడ అలసటనెరగని శ్రమ తన బాహువుల్ని పరిపూర్ణతవైపు జాస్తుందో,
ఎక్కడ నిర్జీవమైన ఆచారపుటెడారిలో స్వచ్చమైన బుద్ది ప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో,
ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకి, కార్యాలలోకి నీచే నడపబడుతుందో,
ఆ స్వేచ్చా స్వర్గానికి, తండ్రీ, నాదేశాన్ని మేల్కొలుపు.
- గీతాంజలి, టాగోర్ (చలం)
Sunday, November 2, 2008
నమ్మ బెంగుళూరు!
నేనిక్కడకు వచ్చి దాదాపు మూడేళ్ళు కావస్తున్నా, ఈ నగరం మాత్రం ఇప్పటికీ నాకు పూర్తిగా అంతుపట్టలేదు. తెలిసినట్లే ఉంటుంది...కాని ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది.
లిపిలో ఉన్న సారూప్యత వల్ల, నేనిక్కడకు వచ్చిన కొత్తలో, కనిపించిన సైన్ బోర్డునల్లా చదివేస్తూ, మహా ఉత్సాహపడిపోయేవాడిని. కాకాపొతే, తెలుగు పరిజ్ఞానంతో కన్నడ బోర్డులు చదివితే, "అయ్యో, అమ్మో" అంటూ గుండెలు బాదుకున్నట్లు ఉంటుంది. ఉదాహరణకు, "Ganesh Bar & Restaurant" కాస్తా "గణెశో బారో & రెస్టారంటో (అయ్యో అమ్మో & ఓరి నాయనో)" అవుతుంది. ఇలా చదువుకుని, నాలో నేను నవ్వుకుంటున్నప్పుడు, పక్కనవాళ్ళు నన్ను అనుమానంగా చూసిన సందర్భాలున్నాయి :).
అయితే, ఒక్కవిషయం మాత్రం మనం ఒప్పుకుని తీరాలి. కన్నడిగుల మాతృభాషాభిమానం ముందు మనం దిగదుడుపే. తిరుమల బ్రహ్మోత్సవాలకోసం వేసే special బస్సులకు, మన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వాళ్ళు "స్పెషల్ బస్సు" అని తెలుగులో రాసిన బోర్డు తగిలిస్తే, ఇక్కడి బస్సులకు "విశేష వాహన" అని స్వచ్చమైన కన్నడలో రాస్తారు. అలాగే, ఇక్కడ BSNL మొబైల్ నంబరుకు డయల్ చేస్తే, మనకు తరచుగా వినపడే ప్రకటన "నీవు కరియమాడిద చందాదారరు వ్యాప్తిప్రదేశ హొరగిద్దారె". (ఈ ప్రకటన తెలుగులో "మీరు డయల్ చేసిన నంబరు కవరేజ్ ఏరియాలో లేదు). అయితే, మనం కాల్ చేసిన వ్యక్తి మనపక్కనే నిలుచుని వున్నా కూడా, ఈ ప్రకటన వినిపిస్తుందనుకోండి, అది వేరేవిషయం.
ఆ తరువాత చెప్పుకోవాల్సింది, ఇక్కడి ట్రాఫిక్కు గురించి. గిన్నిస్ బుక్ గుర్తించలేదు కాని, బెంగుళూరు చాలా విషయాల్లో రికార్డు సృష్టించింది. మామూలుగా అయితే, ఎక్కడైనా ఫ్లై ఓవర్ కింద ట్రాఫిక్ సిగ్నల్ ఉంటుంది. కానీ, ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా, పైనకూడా ట్రాఫిక్ సిగ్నల్ కలిగి ఉన్న ఏకైక వంతెన (ఫ్లైఓవరు) ఇక్కడమాత్రమే ఉంది (రిచ్ మండ్ సర్కిల్ ఫ్లైఓవర్)! SM కృష్ణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టబడిన ఈ వంతెన, ఒక గొప్ప architectural blunder గా విరాజిల్లుతోంది!!! అలాగే,"ఎక్కువ కాలంపాటూ సాగిన వంతెన నిర్మాణం" కేటగిరీలో బెంగుళూరుదే అగ్రస్థానం. ఇక్కడ ఒక్కో వంతెన (ఫ్లై ఓవరు) దీ ఒక్కో చరిత్ర.. ఈ మధ్యే ప్రారంభింపబడిన మత్తికెరె వంతెన నిర్మాణం, అత్యధికంగా, పది సంవత్సరాలపాటూ సాగింది. కొద్ది నెలల క్రితం మొదలైన మెట్రో రైలు నిర్మాణం, అన్ని రికార్డులనూ తిరిగి రాస్తుందని, పూర్తి కావడానికి కనీసం ఇరవై ఏళ్ళన్నా పడుతుందని, ఇక్కడ వాళ్ళ గట్టి నమ్మకం!
ఇకపోతే, ట్రాఫిక్ ను నియంత్రించడానికి, ఇక్కడి యంత్రాంగం ఉపయోగించే గొప్ప ఆయుధం - "ఒన్ వే ట్రాఫిక్"! ఈ "ఒన్ వే"ల పుణ్యమా అని, మెయిన్ రోడ్డుకీ, చిన్న గల్లీకీ తేడా తెలియదు. ఎక్కడ, ఎప్పుడు,దేనిని ఒన్ వే చేస్తారో చెప్పలేము. కొన్నిసార్లు, పొద్దున్న ఆఫీసుకెళ్ళేటప్పుడు మామూలుగా ఉన్న రోడ్డు, సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి ఒన్ వేగా రూపాంతరం చెంది ఉంటుంది. దానికి తగ్గట్లు, వీళ్ళు రోడ్లకు పెట్టే పేర్లు కూడా చిత్రంగా ఉంటాయి. ప్రతీ రోడ్డుకూ ఒక నంబరు తగిలించి "ముఖ్య రస్త" లేక "అడ్డ రస్త" అని నామకరణం చేస్తారు. చాలా చోట్ల,ట్రాఫిక్ పరంగా ఈ రెండిటికీ పెద్ద తేడా లేకపోవడంతో, ఏది ముఖ్యరస్తానో,ఏది అడ్డరస్తానో తెలియక మనం జుట్టు పీక్కోవాలి. మా ఇంటినుంచి బస్టాండుకు (మెజిస్టిక్)రూటు పూర్తిగా అర్ధమవ్వడానికి దాదాపు ఒక సంవత్సరం పట్టింది. ఎందుకంటే, సగానికి పైగా రూటు ఒన్ వే. వెళ్ళే టప్పుడు ఒకదారి, వచ్చేటప్పుడు ఒకదారి. బస్సులో వస్తే ఒకదారి. ప్రి-పెయిడ్ ఆటోలో వస్తే ఇంకోదారి. బేరమాడుకున్న ఆటో అయితే, యే దారి అన్నది మన అదృష్టం, ఆటో వాడి మంచితనంపై ఆధారపడి ఉంటుంది. అందుకే, తప్పనిసరి పరిస్తితులలో ఆటో ఎక్కవలసి వస్తే, ముందుగా ఆ రోజు రాశిఫలాలు చూసుకుని, పెద్దగా ఆర్ధిక నష్టం లేదు అని నిర్ధారించుకున్న తరువాతే, ఆటో కోసం ప్రయత్నిస్తాను.
అన్నట్లు, ఆటో అంటే గుర్తుకొచ్చింది...బెంగుళూరు ఆటోవాళ్ళ గురించి ఇప్పటికే చాలామంది పుంఖానుపుంఖాలుగా రాసేసారు. కాబట్టి, నేనుకొత్తగా చెప్పొచ్చేది ఏమీ లేదు. నేను జీవితంలో ఎప్పుడైనా అత్యంత నిరర్ధకుడిగా, ఏమాత్రమూ విలువలేనివాడిగా ఫీలయ్యానూ అంటే, అది బెంగుళూరులోకొచ్చిన కొత్తల్లో, ఆటో కోసం ప్రయత్నించినప్పుడు మాత్రమే. మనమడిగిన చోటుకి రాకపోతే పోయే, కనీసం మనమడిగింది వినిపించుకున్నట్లు కూడా రియాక్షనివ్వరు. వాళ్ళ కాళ్ళమీద పడి బతిమాలి, నెల జీతం మొత్తం ఇస్తామని చెబితేకానీ, ఆటొ స్టార్ట్ చెయ్యరు. వీళ్ళ తీరుకి ఎంతగా బెదిరిపోయానంటే, నాకు మా ఆవిడకంటే, ఈ ఆటో వాళ్ళంటేనే ఎక్కువ భయం.
బెంగుళూరుకొచ్చే ప్రతీ తెలుగువాడినీ అయోమయంలో పడేసే విషయం - ప్రతీ చిన్న చితకా రెస్టారంటు మీద కనపడే బోర్డు "ఆంధ్రా స్టైల్ మీల్స్"! బహుశా, అంధ్రా భోజననానికి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇంత పాపులారిటీ ఉండదేమో. కాకపొతే, ఆంధ్రా మీల్స్ అన్న పేరుతో వీళ్ళు వడ్డించే నానా గడ్డీ చూస్తే, మనం తెలుగు మర్చిపోవడం మాత్రం ఖాయం!
మీరు శాకాహరి అయితే, మీరు బెంగుళూరులో తప్పకుండా వెళ్ళవలసిన ఫుడ్ కోర్టు - “ఇస్కాన్ టెంపుల్”. ఇక్కడ, సమోసా నుంచి పిజ్జాలవరకూ, మిరపకాయ బజ్జీలనుంచీ బర్గర్ల వరకూ, అన్ని రకాల తినుభండారాలు లభిస్తాయి (అన్నీ వెజిటేరియనే సుమా!). ఇక్కడ గుడికంటే, భోజనాలయమే పెద్దది. మీకు కాస్త రియల్ ఎస్టేట్లో ఆసక్తి ఉంటే, ఇస్కాన్ వాళ్ళు కట్టిస్తున్న అపార్టుమెంట్ల గురించి కూడా తెలుసుకోవచ్చు. ఈ కుర్రసన్యాసుల మార్కెటింగ్ సామర్ధ్యం ముంధు క్రెడిట్ కార్డులమ్మే ఎక్సిక్యూటివ్సు కూడా ఎందుకూ పనికిరారు. ఆన్నట్లు, ఈ ఇస్కాన్ టెంపుల్లోఓ మూలన దేవుడు కూడా వుంటాడ్లెండి.
ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, సాఫ్టువేరు ఉద్యోగి కానివాడి పాలిట, ఈ బెంగుళూరు నిజంగా 'బెంగ'లూరే! కామిగానివాడు మొక్షగామి కాలేడన్నట్లు, సాఫ్టువేరు ఇంజనీరు కానివాడు, బెంగుళూరువాసి కాలేడు. ముఖ్యంగా, నాబోటి బ్యాంకు ఉద్యోగికైతే మరీను. వారంలో అయిదురోజులు మాత్రమే పనిచేసే వాళ్ళ అదృష్టం చూస్తే నాకు కించిత్ ఈర్ష్య. సాఫ్టువేరు ఉద్యోగి కానివాడికి ఇల్లు అద్దెకు దొరకడం మరీ కష్టం. బ్రహ్మచారి అయితే అంటరానివాడితో సమానం!
చివరిగా, బెంగుళూరు గిగాబైట్లకే కాదు, డాగ్ బైట్లకు (కుక్క కాట్లకు) కూడా ప్రసిద్ధి. నెలకు, సగటున, మూడువేలమంది బెంగుళూరువాసులు కుక్కకాటుకు గురౌతారని ఒక అంచనా. The joke is – Bangalore is famous for three: Software professionals, Girls and Stray Dogs!
Friday, August 22, 2008
సుందరానికి చిరంజీవి టిక్కెట్టిస్తాడా?
వాడి రాకకు కారణం ఊహిస్తూ, నా పనులన్నిటినీ త్వరగా పూర్తి చేసుకుని, మా ఆవిడ ఇచ్చిన కాఫీ కప్పు తీసుకుని వాడిముందు సెటిల్ అయ్యి, విషయం చెప్పమన్నట్టు వాడికేసి సాలోచనగా చూసాను. ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్లు, వాడు సీరియస్ గా కాఫీ సిప్ చేస్తున్నాడు. వాడి నిశ్శబ్ధం నాలో సస్పెన్స్ పెంచుతోంది. మెల్లిమెల్లిగా, నాలోని ఉత్సుకత చిరాకుగా రూపాంతరం చెందుతున్న సమయంలో వాడు గొంతు సవరించుకుంటున్నట్లు దగ్గాడు.
"మామా, చిరంజీవి పార్టీ పెడుతున్నాడట కదరా..." అన్న మావాడి ఉపోద్ఘాతం విని నాకు మండుకొచ్చింది. ఈ విషయం చెప్పడానికా వీడు ఆదివారం పొద్దున్నే నా నిద్దుర చెడగొట్టాడు అన్న కోపమూ, వాడి మానసిక పరిస్థితిమీద చిన్న అనుమానమూ కలగలిసి నాబుర్రని తొలిచేస్తుంటే, వాడు మాత్రం ఇవేమీ పట్టనట్లు కొనసాగించాడు.
"నేను చిరు పార్టీలో చేరదామనుకుంటున్నానురా... వీలైతే ఎమ్మెల్యే టిక్కెట్టుకోసం ప్రయత్నిద్దామనుకుంటున్నా".
ఓ బాల్చీడు నీళ్ళు లాగిపెట్టి నామొహమ్మీద కొట్టినట్లు, వాడి మాటలకు కొద్దిసేపు ఉక్కిరిబిక్కిరి అయ్యాను. ఏమ్మాట్లాడాలో నాకైతే అర్ధం కాలేదు. నా అయోమయంలో నేనుండగానే, వాడు మళ్ళీ కొనసాగించాడు.
"మనూరినుంచి ఎమ్మెల్యే టిక్కెట్టుకోసం ట్రై చేద్దామనునుకుంటున్నా. మనం జాగ్రత్తగా ప్లాను చెయ్యాలి. కాంపిటీషను బాగానే ఉన్నట్లుంది......ఎలా ప్రొసీడ్ అవ్వాలి అన్నదానిపై నీ సలహా కావాలి"
మెల్లగా స్పృహలోకొచ్చిన నేను, నా సందేహాల చిట్టా విప్పాను.
"పార్టీ పెడుతున్నట్లు అయనికా ఒక్కసారి కూడా నోరువిప్పి చెప్పలేదు...అప్పుడే పార్టీ టిక్కెట్టూ, కాంపిటీషను, ప్లాను ఏవిట్రా...నాకైతే ఏమీ అర్ధం కావట్లేదు... అసలు నీకీ ఆలోచనెలా వచ్చింది...?"
నేనో తింగరివెధవన్నట్లుగా నావైపు ఓ చూపు విసిరి, "ఎక్కడున్నావురా నువ్వు...చిరు పార్టీ గురించి ఆంధ్ర రాష్ట్రమంతా కోడై కూస్తుంటే, ఏమీ తెలియదన్నట్లు మాట్లాడుతున్నావు. ఆయన పార్టీ పెడుతున్నట్లు, ఆయన తమ్ముళ్ళూ, బావమరదులూ హింట్స్ ఇస్తూనే ఉన్నారుకదా... అంతమాత్రం అర్ధం చేసుకోకపోతే ఎలా?"
ఇవేమీ పట్టనట్లు, వాడు చెప్పుకుంటూ పోతున్నాడు..."ఓ నాలుగు రోజులక్రితం చిరంజీవి తమ్ముడి బావమరిదికి, వేలువిడిచిన మేనమామకు తోడల్లుడు ఒకాయన,మనూళ్ళో మీటింగ్ పెట్టాడు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితులను, రాజకీయ ప్రత్యామ్నాయం ఆవశ్యకతనూ, రాష్ట్రంలోనున్న రాజకీయ శూన్యతను,కొత్త రక్తం అవసరాన్నీ వివరించి చెప్పాడు. ఎమ్మెల్యేగా పోటీ చెయ్యాలని అప్పుడే నిర్ణయించుకొన్నాను".
నాకు ఒక్కసారిగా మూర్చ వచ్చినంత పనైంది... వాడి మాటలు విని. ఆదివారం ఉదయాన్నే ఈ షాకులేమిట్రా బాబూ, అనుకుంటూ చెప్పమన్నట్లు వాడికేసి చూసాను.
"మూఢం పోయాక ఆగస్టులో, మంచి ముహూర్తం చూసి, పార్టీని పరకటిస్తారట. ఈలోపల, ఆయన తమ్ముళ్ళూ, బావమరదులూ,వాళ్ళ బంధువులూ ఊరూరా తిరిగి గ్రౌండు ప్రిపేర్ చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ గెలుపుగుర్రాలెవరా అని సీక్రెట్ సర్వేలు జరుగుతున్నాయట. ఈ సర్వేలు ఎవరు చేస్తున్నారోమాత్రం తెలియట్లేదు. మనకి టిక్కెట్టు రావాలంటే, మనం ఈ సర్వేరాయుళ్ళ కంట్లో పడాలి....అందుకు ఏమి చెయ్యాలో కాస్త సలహా ఇస్తావేమోనని నీ దగ్గరకొచ్చాను....."
మొదట్లో వాడి మాటలు కాస్త అయోమయానికి గురిచేసినా, మెల్లగా నాకూ కాస్త ఉత్సాహం కలిగింది. వీడు ఎమ్మెల్యే అయితే, మనకు కూడా ఎమ్మెల్యే ఫ్రెండుగా కాస్త పరపతి పెరుగుతుంది, వీడదృష్టం బాగుంటే యే సహాయమంత్రైనా అవ్వొచ్చేమో...నా మనసు అప్పుడే DTS లో కలలు కనడం మొదలుపెట్టింది.
దాంతో నా సందేహాలని కాసేపు కట్టిపెట్టి, వీడికేమి సలహా ఇవ్వాలా అని అలోచించడం మొదలుపెట్టాను. కాసేపు చించిన తరువాత నాకో అయిడియా తట్టింది...."నువ్వెంటనే చిరంజీవి పేరుమీద ఒక అభిమాన సంఘాన్నో, సేవా సంఘాన్నో మొదలుపెట్టరా.."
"ఓ అయిడియా, జీవితాన్నే మార్చెస్తుంది" అని అనందంతో నన్ను కౌగిలించుకుంటాడనుకుంటే, మనీ సినిమాలో ఖాన్ దాదాలా ఓ చూపు విసిరి, "నువ్వేలోకంలో ఉన్నావురా? ఇప్పటికే దాదాపు ఓ ముప్పై సంఘాలున్నాయి. ఇప్పుడు మనం కొత్తగా పెడితే ఎవరు గుర్తిస్తారు.... ఏదైనా వెరైటీగా ఉండాలి...అలోచించు".
నాకు దిమ్మె తిరిగిపోయింది. వార్నాయనో! ఇంత సీను జరుగుతోందా. చెప్పొద్దూ, నా IQ లెవెల్ మీద, నాకే అనుమానమేసింది.
మళ్ళీ అలోచించడం మొదలుపెట్టాను....రక్తదాన శిబిరమూ, ట్యాంకర్లలో నీళ్ళ సరఫరా, సేవా కార్యక్రమాలూ.... ఇలా నేనేమి చెప్పినా, తల అడ్డంగా ఊపేస్తూ, ఇంకోమాట చెప్పమంటాడు.
కాసేపటికి, వాడికే విసుగొచ్చి, నాతో పనికాదనుకొని, నన్ను అలోచించి చెప్పమని, వెళ్ళిపోయాడు. ఎమ్మెల్యే ఫ్రెండుగా నా పరపతి (అదృష్టం బాగుంటే మినిస్టర్ ఫ్రెండు కూడా)....నా కల కరిగిపోతుంటే, నిస్సహాయంగా ఉండిపోయాను.
అందని ద్రాక్ష పుల్లన అని నాకునేను సర్దిచెప్పుకుంటున్న సమయంలో, సుందరం నుంచి ఓ రోజు ఫోన్, "చిరంజీవి ముఖ్యమంత్రవ్వాలని, మళయాళ మాంత్రికులతో పెద్ద యాగం చేస్తున్నాను,నువ్వు పొద్దున్నే ఫలానా చోటుకి వచ్చేసేయి. మన అదృష్టం బాగుంటే, చిరంజీవి తమ్ముళ్ళెవరైనా కూడా రావొచ్చు", మా వాడి గొంతులో ఎక్సైట్మెంటు.
మర్నాడు వాడు చెప్పినచోటుకి వెళ్ళి చూద్దునుకదా, అక్కడ దాదాపు డజను యాగాలు జరుగుతున్నాయి! ఆ జనంలో మా వాణ్ణి వెతికిపట్టుకునేటప్పటికి నాకు దేవుడే కనిపించాడు. సుందరం బిక్కమొహం వేసుకొని కనిపించాడు, "నా ప్లాను బయటికెలా పొక్కిందో తెలియట్లేదురా. ఒకళ్ళకుమించి ఒకళ్ళు, ఇంతమంది తయారైపోయారు. ఈ జనంలో నన్నెవరు గుర్తిస్తారు...."మీ కోసం యాత్ర ముగించుకున్న చంద్రబాబులా దిగాలుగా ఉన్నాడు సుందరం.
అయితే మా వాడు మాత్రం ఆశ పూర్తిగా వదులుకోలేదు. పబ్లిసిటీ కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు. కొద్ది రోజుల క్రితం వాణ్ణి మళ్ళీ కలిసాను. వాడి రూపమంతా మారిపోయింది. ఖద్దరు బట్టలూ, పక్కనే ఇద్దరు మనుషులూ....సుందరాన్ని గుర్తుపట్టలేకపొయ్యాను.
ఇంతలో చిరంజీవి పార్టీ పెడుతున్నట్లు ప్రకటించాడు.
సుందరం కూడా ప్రయత్నాలు తీవ్రతరం చేసాడు. రెండు, మూడు సార్లు హైదరాబాదు కూడా వెళ్ళొచ్చాడు. పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. చిరంజీవి కటౌట్లు పెట్టించాడు. ఖర్చులకోసం కొంచెం ఆస్తి కూడా అమ్మేసుకున్నాడని విన్నాను.
ఓ రోజు కలిస్తే, వాడి బాధనంతా వెళ్ళబోసుకున్నాడు..."పోటీ చాలా తీవ్రంగా ఉందిరా. ఆ సర్వేలు తీసేది ఎవ్వరో, ఏమీ అంతుచిక్కట్లేదు. లోకల్ కాంపిటీషను అనుకుంటే, ఇప్పుడు ఇంటర్నేషనల్ గా కూడా పోటీ ఎదుర్కోవాల్సి వస్తోంది. టిక్కెట్టు కోసం, కొంతమంది ఎన్నారైలు కూడా తయరయ్యారు..ఏమిచెయ్యాలో అర్ధం కావట్లేదు" అంటూ వాడి బాధను వెళ్ళబోసుకున్నాడు.
సుందరాన్ని చూస్తే నాకు జాలేసింది. ఎంత సరదాగా ఉండేవాడు, ఇలా పిచ్చివాడిలా అయిపోయాడు. వాణ్ణి చూసి బాధ పడటం తప్ప ఏమీ చెయ్యలేకపోయాను. ఆసలు, నేను చెపితే వినిపించుకునే స్టేజిలో ఉంటే కదా.
ఓ రోజు ఉందయాన్నే అర్జెంటుగారమ్మని సుందరం ఇంటినుంచి కబురొస్తే, ఏమయ్యిందోనని హడావుడిగా వెళ్ళాను. రెండు మోకాళ్ళకు కట్లతో మంచమ్మీద పడున్నాడు. చిరంజీవి ముఖ్యమంత్రి కావాలని, మోకాళ్ళతొ తిరుమలకొండ ఎక్కాడట. మోచిప్పలు రెండూ రాసుకుపోయాయి.
ప్రెస్సు వాళ్ళొచ్చి ఫొటోలు తీసుకుంటున్నారు. న్యూస్ చానెల్సు వాళ్ళు వాళ్ళావిడ ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు.
ఇంతలో ఎవరో హడావుడిగా వచ్చి, చిరంజీవి సన్నిహితుడు పరామర్శించడానికి వస్తున్నట్లు చెప్పారు. సుందరాన్ని చూడడానికి బయట జనాలు క్యూ కట్టేసారు. సుందరం మగతగా నిద్రలో జోగుతున్నాడు. ఏదొ మాట్లాడుతున్నట్లుంటే, ముందుకు వంగాను. నిద్రలో కలవరిస్తున్నాడు..."రాజకీయ శూన్యం, సమాజంలో మార్పు.....నేను సైతం, నేను సైతం" అంటున్నాడు!!!
*** *****
మీరే చెప్పండి, మా సుందరానికి చిరంజీవి టిక్కెట్టిస్తాడా?
Sunday, August 3, 2008
భోజనప్రియులు - బహుజనప్రియులు
అందరికంటే ముందు చెప్పుకోవాల్సింది మా ఆఫీసులోని వైస్ ప్రెసిడెంటు మూర్తి గారి గురించి. ఈయనకు, నాలుగు సంవత్సరాల క్రితం మధుమేహం ఉందని కాకతాళీయంగా బయటపడింది. అప్పట్నుంచీ ఈయన తన కడుపు కట్టేసుకుని, "మనం తినే తిండి, అందులోని క్యాలరీలు" అన్న విషయమ్మీద విపరీతమైన రీసెర్చి చేసి, అహారపుటలవాట్లమీద ఉపన్యాసాలివ్వడం మొదలు పెట్టారు. ఒక్క గులాబ్ జామూన్లో ఎన్ని క్యాలరీలుంటాయి, అవి కరగాలంటే ఎంత సేపు వాకింగ్ చెయ్యాలి....ఇటువంటి విషయాలమీద అనర్గళంగా ఉపన్యసించే ఈయన లంచ్ రూం లో ఉన్నాడంటే, మేమెవ్వరమూ అటువైపు వెళ్ళడానికి కూడా సాహసించము. అసలు నేను తెచ్చుకునేదే చిన్న లంచ్ బాక్సు, నా అర్ధాకలికి తోడుగా నేను తినే క్యాలరీలు లెక్కగడుతూ తినడమంటే పెద్ద శిక్షే నాకు!
నా మితృడొకడు నాలాగే ఆకలి బాధితుడు. కాకపోతే, ఫక్తు శాకాహారి. రుచికి అంతగా ప్రాముఖ్యత ఇవ్వకపోయినా, సాంప్రదాయక ఆంధ్రా భోజనం, లేకపోతే కనీసం దక్షిణ భారత వంటకాలను మాత్రమే ఇష్ట పడతాడు. దానికి తగ్గట్లు, అల్సర్ ఉంది కాబట్టి, చివర్లో మజ్జిగన్నం ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈ విషయం లో మా వాడికి కాస్త చాదస్తం పాలు ఎక్కువే. మెనూలో ఏ మాత్రం తేడాని కూడా అంగీకరించడు. కాంటినెంటల్ రెస్టారంటుకెళ్ళినా, ఆంధ్రా భోజనం కోసం వెతికే రకం. మేము బాంబేలో కలిసి పనిచేసే రోజుల్లో, ఇద్దరమూ ఒక చిన్న బిజినెస్ మీటింగుకు "సన్ & సాండ్స్" అనే రెస్టారెంటుకెళ్ళాము. ఆ రెస్టారెంట్లో బఫే లంచ్ ప్రతీ రోజూ ఒక్కో థీం ప్రకారం ఉంటుంది. మావాడి దురదృష్టం కొద్దీ, మేమేళ్ళిన రోజు థీం "థాయ్ ఫుడ్డు"! ఇక చూస్కోండి మా వాడి అవస్త. శాకాహారం కోసం వెతికి వెతికి ఏదో భోజనమయ్యింది అనిపించాడు. కానీ, చివర్లో మజ్జిగ/పెరుగు కోసం పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తుంటే, ఆ థాయ్ చెఫ్ చూసి ఏమి కావాలని వచ్చీ రాని ఇంగ్లీషులో అడిగాడు. మావాడు, వెంటనే ఏమాత్రం మొహమాటం లేకుండా, "ఏనీ థింగ్ కర్డ్ బేస్డ్?" అని అడిగాడు. ఇక చూస్కోండి ఆ చెఫ్ అవస్త. అసలు కర్డ్ అంటే ఏమిటొ అర్ధమయ్యి, అటువంటి పదార్ధమేదీ లేదు అని చెప్పేటప్పటికి, వాడి తలప్రాణం తోకకొచ్చింది.
అన్నట్లు, బఫే అంటే గుర్తుకొచ్చింది. నన్ను బాగా ఇబ్బంది పెట్టే కఠినమైన శిక్ష ఏమిటంటే, బాగా ఆకలిమీద ఉన్న నన్ను, బఫే భోజనానికి తీసుకెళ్ళడం! ఈ పద్దతిని ఎవడు కనుక్కున్నాడో కానీ, వాడికి నా ఉసురు తప్పకుండా తగుల్తుంది. బఫేలో, కంటికింపుగా పలురకాల పదార్ధాలు కనిపిస్తాయి. కానీ, ఏది మొదట తినాలో,ఏది ఎంత తినాలో అన్న సంఘర్షణ నన్ను తినేస్తుంది. దానికి తగ్గట్లు, వడ్డించుకోవడంలో ఇబ్బంది, నిల్చుని ఓ చేత్తో ప్లేటు పట్టుకుని అవస్తలు పడుతూ తింటూ, నాజూగ్గా తింటున్నట్లు నటిస్తూ.. మారు వడ్డించుకోవాలంటే అందరూ మనల్నే చూస్తున్నారనే ఫీలింగు..... అబ్బ అంతకంటే పెద్ద శిక్ష ఉండదు నాకు. ఇటువంటి పార్టీలనుంచి సాధారణంగా అర్ధాకలితోనే బయటపడతాను. అయితే, ఇంట్లో నా డైటింగ్ ప్రసహనం మొదలయ్యినప్పట్నుంచి ఇటువంటి పార్టీల్లో నా మొహమాటాన్నీ, కాంప్లెక్సుల్నీ పక్కన పెట్టి, కడుపునిండా తినే అవకాశాన్ని వదులుకోవట్లేదులెండి.
ఇంకొందరుంటారు. వీరికి జిహ్వచాపల్యం ఎక్కువే కానీ, పైకి మాత్రం మితాహారం గురించి విపరీతమైన ఉపన్యాసాలు దంచుతుంటారు. వీళ్ళ అసలు రంగు పార్టీల్లో కానీ బయట పడదు. వీళ్ళు సాధారణంగా శాకాహారులు, మద్యం ముట్టని వాళ్ళూ అయివుంటారు. మా ఆఫీసులో వీరి శాతం ఎక్కువే. అన్ని పార్టీల్లో వీరి రొటీను ఒకేవిధంగా ఉంటుంది. నాబోటి బడుగుజీవులం దొరికిన అవకాశాన్ని వదులుకోలేకుండా, ఏ బీరో, ఓడ్కానో ఆర్డర్ చేసి కూర్చుంటాం. మావి రెండు పెగ్గులు పూర్తయ్యేలోపల, వీళ్ళు మాత్రం, మెనూ కార్డు మొత్తం వెతికి,రీసెర్చి చేసి, ఎప్పుడూ రుచి చూడని మాక్ టైల్సూ/ఫ్రూట్ పంచ్ లు నాలుగు రకాలు, వాటితో పాటు,ఓ అరడజను స్టార్టర్లూ లాగించేస్తారు. పైకి మాత్రం ఫోజు. వీళ్ళు మందెప్పుడు ఫినిష్ చేస్తార్రా బాబూ అని, ప్రధాని పదవికోసం ఎదురు చూసే అద్వానీలా మా మొహాలకేసి దిగులుగా చూస్తూ కూర్చుంటారు. అప్పటికే కడుపులు నింపేసుకున్న వీళ్ళు, మెయిన్ కోర్సు మాత్రం మితంగా తీసుకుని, చాలా కంట్రోల్ గా తింటున్నట్లు ఒక ఫోజు కొడతారు.
నా మితృడొకతను నాకుమల్లే భోజనప్రియుడు, మాంసాహారి. కాకపోతే, తన జిహ్వచాపల్యాన్ని సమర్ధించుకోవడానికి ఒక లాజిక్కు కనిపెట్టాడు. ఈయనగారి ప్రకారం, మనం నిత్యం తినే ఆహార పదార్ధాలు రెండు రకాలు - అంతగా హాని కలిగించనివి, ఎక్కువ హాని కారకమైనవి. కాని చిత్రంగా తనకిష్టమైనవన్నీ మొదటి వర్గంలోనే ఉండడం కాకతాళీయమెలాగో నాకర్ధం కాదు! కాస్త సైన్సుని జోడిస్తాడు కనుక ఇతని వాదన బలంగానే ఉంటుంది. అయితే, వచ్చిన చిక్కల్లా, మనం ఎంతో ప్రియంగా తినే తిండి మనకెలా హాని కలిగిస్తుందో నమ్మలేని, నా లాంటి మట్టి బుర్రలతోనే. ఇతని వాదన ప్రకారం, మాంసాహారాల్లో తినగలిగినవి చేపలు, చికెనూ మాత్రమే. మటన్ అత్యంత హానికరం. ఈ వాదన వింటున్నప్పుడల్లా నా అవస్త కాస్త ఊహించుకోండి. మటనూ, చుక్కాకు కలిపి మా అవిడవండే కూర, అందులోకి రాగి సంగటి అంటే పడి చచ్చే నేను, మటన్ చెడ్డ చేస్తుందంటే ఎలా నమ్మమంటారు చెప్పండి? (మటనూ, చుక్కాకు కలిపి వండే కూరను "దాల్చా" అని అంటారు. ఇది మా రాయలసీమ స్పెషల్. ఇక రాగి సంగటి గురించి చెప్పక్కర్లేదు. రాయలసీమలో సాధారణ వంటకం)
ఇంకొంతమంది, అసలు పుట్టడమే కడుపు మాడ్చుకోవడానికే అన్నట్లుంటారు. ఆహారపు నియమాలను చాలా ఖచ్చితంగా పాటిస్తారు. ఇందులో ఏ మాత్రం తేడాను అంగీకరించరు. హోటలుకెళ్ళినా కూడా, వీళ్ళ మెనూలో ఏ కొంచెం తేడా ఉండదు. కొత్త వంటకాలను అస్సలు ముట్టుకోరు.వీళ్ళకు మెనూకార్డుల్లోని ఐటెమ్స్ చాలావరకు తెలీవు. వీళ్ళవరకు ఎలావున్నా పరవాలేదు. కానీ, ఎదుటివాళ్ళనుంచి కూడా ఇదే ప్రవర్తన ఆశిస్తారు. వీరి చాదస్తం ఎంతంటే, చివరికి తిరుపతి లడ్డూని కూడా అలోచించి తింటారు! ఇటువంటివాళ్ళు, సాధారణంగా నసరాముళ్ళై ఉంటారు. నలుగుర్లో సరదాగా కలవలేరు. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లు, చిరచిరలాడుతూ ఉంటారు. ఫ్లెక్సిబిలిటీ అస్సలుండదు. తిండి దగ్గరే ఇంత పట్టింపుగా ఉండే వీళ్ళు, నిజజీవితంలో ఎలా ఉంటారో ఊహించుకోండి! వీళ్ళని ప్రేమించే వాళ్ళకన్నా, వీరంటే భయపడే వాళ్ళు,ఇష్టపడని వాళ్ళే ఎక్కువగా ఉంటారు.
అదే, తిండిదగ్గర ఉత్సాహంగా ఉండేవాళ్ళను చూడండి. వీళ్ళు, నిజజీవితంలో కూడా చాలా సరదాగా ఉంటారు. అందరూ వీరి కంపెనీని ఇష్టపడతారు. వీరు ఏ పని చేసినా అందరినీ కలుపుకు పోయే రకం. ఆఫీసుల్లో కూడా, ఇటువంటి వాళ్ళు చాలా పాపులర్! ఒక్క మాటలో చెప్పాలంటే, భోజనప్రియులు సహజంగా బహుజనప్రియులు....ఏమంటారు?
Tuesday, July 29, 2008
ప్రశ్న...
నీ గురించిన ఎన్నో ప్రశ్నలు
అన్నిటికీ మౌనమే నీ సమాధానం,
నాలోని నిన్ను,నా తోడైన నిన్ను,
నా దారైన నిన్ను,నా గమ్యమైన నిన్ను....
నా సమస్తమూ నీవేనని ఎరిగినా,
నిన్ను శోధించడం మాత్రం ఆపను.
ఆశ, నిరాశ
కష్టం, సుఖం
నమ్మకం, సందేహం....
ద్వందాల నడుమ బందీనైన నేను,
నీ ఉనికిని ప్రశ్నిచడం మాత్రం ఆపను.
కానీ, నేనేమాత్రమూ ఊహించని రీతిలో
శతకోటిసూర్యప్రభలతో నీవు ఆవిష్కృతమైన నాడు,
ఈ ప్రశ్నల కారుమబ్బులన్నీ మాయమౌతాయి.
వాటికి సమాధానం దొరికి కాదు సుమీ,
వాటి నిరర్ధకత ఎరుక కలిగి మాత్రమే...
Wednesday, July 9, 2008
నా మితాహార దీక్ష!
ఏడాది క్రితం ఓ వీకెండ్ ఫ్యామిలీ పార్టీకి, నేనూ మా ఆవిడా కలిసి, మా బాసు ఇంటికి వెళ్ళాము. ఎప్పట్లానే, నేను వేసుకున్న క్యాజువల్ డ్రెస్సూ, మాసిన నా గడ్డమూ మా అవిడకు నచ్చలేదు. అలవాటు ప్రకారం, తన రుసరుసలను చిర్నవ్వు చాటున కప్పెట్టి మా ఆవిడా, ఏమీ జరగనట్లు బ్లాంక్ ఫేసుతో నేను, మా బాసు ఇంట్లోకి అడుగు పెట్టాము. మేమెళ్ళేటప్పటికి పరచియకార్యక్రమాలవుతున్నాయి. మా బాసు, బయోటెక్ ఇంజనీరైన తన కూతుర్ని మాకు పరిచయం చేసాడు. ఇంత వరకూ కథ బాగానే జరిగింది. జరగబోయేదాని గురించి ఏ మాత్రం క్లూ లేని మేము మాట్లాడుతుండగా, హటాత్తుగా పేలిన ఆత్మాహుతి బాంబు వలే, జరిగిందా సంఘటన.
"అంకుల్, కూల్ డ్రింక్ కావాలా, ఫ్రూట్ జూస్ కావాలా?" అంటూ చేతిలో ట్రేతో మా బాసుకుట్టి ప్రత్యక్షం. ఉలిక్కి పడి వెనక్కి తిరిగి చూసి, ఎవరూ లేకపోవడంతో, పిలిచింది నన్నేనని నాకర్ధమయ్యేలొపె ఇంకో డామేజ్ జరిగిందండీ. "ఆంటీ, మీరేమి తీసుకుంటారు?" అంటూ మా ఆవిడ్ని కూడా వదల్లేదు! మా ఆవిడ్ని కూడ ఆంటీ అని సంబోధించి, మా బాసుకుట్టి ప్రదర్సించిన సమానత్వం నాకు చాలా ఆనందం కలిగించినా, ఐపిఎల్ లో మాచ్ ఓడిపోయిన తరువాత రాహుల్ ద్రావిడ్ లా మొహంలో ఏ భావమూ ప్రదర్సించకుండా (పెళ్ళైన ఏడేళ్ళలో ఈ విద్య బాగా వంటపట్టింది లేండి!) ఫ్రూట్ జూస్ తీసుకుని మా ఆవిడ వైపు తిరిగాను.
పాపం, షాకు నుంచి తనింకా తేరుకొన్నట్లు లేదు. తనకు సహాయం చేసే ఉద్దేశంతో గ్లాసు చేతికివ్వబోతే, విసురుగా నా చేతినుంచి లాక్కొని, ఓ తీక్షణమైన చూపు నావైపు విసిరింది. ఆ తీక్షణత అర్ధం కావాలంటే చిన్న ఫ్లాష్ బాక్ మీరు తెలుసుకోవాలి.
ఈ సంఘటన జరగడానికి కొన్ని రోజుల ముందునుంచి, మా ఇంట్లో వాడివాడిగా జరుగుతున్న చర్చా విషయం - నా డైటింగ్! గత ఏడు సంవత్సరాలుగా నా జిహ్వచాపల్యాన్ని నియంత్రించాలని ప్రయత్నించి విసిగి వేసారి, కనీసం నా చేత మార్నింగ్ వాక్ అన్నా చేయించాలని మా ఆవిడ శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. అప్పటికి నేను పది కేజీలు అధికబరువున్నానని లెక్కకట్టి, నా తిండి కంట్రోల్ చేయడానికి, మార్నింగ్ వాక్ చేయడానికి, నన్ను కర్తవ్యోన్ముఖుణ్ణి కావించడానికి చాలా ప్లానులుతో, తన ప్రయత్నాన్ని తీవ్రతరం చేసింది.
ఇందుకు, తనిచ్చిన ఒక ముఖ్యమైన కారణం... కాస్త లావుగా ఉండడం వలన, నా వయసు కాస్త ఎక్కువగా కనిపిస్తుందని. అలాగైనా నన్ను ఉత్సాహపరచాలని తన ప్రయత్నం. కానీ, తన ఆర్గుమెంట్లన్నిటినీ, అసెంబ్లీలో వైయెస్సార్ లా, నా చిర్నవ్వుతో, మొండి లాజిక్కులతో తునాతునకలు చేసేస్తూ, రోజులు గడిపేస్తున్నాను. నిజం చెప్పాలంటే, నాకు డైటింగ్ అంటే చచ్చేంత భయం. నేను నిద్రకు దూరమై బ్రతకగలనేమో కానీ, కడుపు కట్టేసుకోవడం మాత్రం కలలో కూడా ఊహించలేను. "మీ ఆవిడంటే నీకెందుకు ఇష్టమో, మూడు కారణాలు చెప్పు" అని నన్నెవరైనా ప్రశ్నిస్తే, ఖచ్చితంగా నా మొదటి కారణం తన వంట అని టక్కున చెబుతాను. టైమ్స్ ఫుడ్ గైడు,శుక్రవారం బెంగళూరు టైమ్స్ (ఇందులో రెస్టారెంట్లపై రివ్యూలు రాస్తారు) వదలకుండా చదివే నా అభిరుచీ, బెంగుళూరులో ఏ కొత్త రెస్టారంటు ఓపెన్ అయినా తప్పకుండా ఓ సారి వెళ్ళే నా జిహ్వచాపల్యమూ, నా మిత్రులందరికీ సుపరిచితమే. మా ఆఫీసులో ఈ డైటింగ్ పేరుతో తన లంచ్ బాక్సులో పచ్చి కూరగాయలు తెచ్చుకునే మా వైస్ ప్రెసిడెంటు మూర్తి (క్యాలరీ మూర్తి అని నిక్ నేం నేనే పెట్టాను), నా కంటికి ఓ గ్రహాంతరవాసిలా కనిపిస్తాడు.
అటువంటి నేను, డైటింగ్ చెయ్యడమా....నెవ్వర్, అని దదాపుగా ఓ నిర్నయానికొచ్చేసిన సమయంలో, 'అంకుల్' అన్న మా బాసుకుట్టి పిలుపు, నా విల్ పవర్ని కాస్త దెబ్బతీసింది. అలాగే, మా ఆవిడ చేతికి ఓ బ్రహ్మాస్త్రమిచ్చినట్లయ్యింది. ఇక మా ఆవిడ దొరికిన చాన్సు అందబుచ్చుకొని, నా మార్నింగ్ వాక్ షెడ్యులు, నా డైటింగ్ ప్లాను నిర్ణయించేస్తుంటే, అసెంబ్లీలో అధికారపక్షం దబాయింపుని నిస్సహాయంగా చూసే చంద్రబాబులా ఉండిపోయాను.
కొత్తగా కొన్న ట్రాక్ సూటు, జాగింగ్ షూస్ తో, యుద్దభూమికెళ్ళే సైనికుడిలా ఇంటిదగ్గరి పార్కుకు మా అవిడ నన్ను సాగనంపుతుంటే, నాకుమాత్రం మా ఊళ్ళో జాతరకు బలిపీఠం వైపు నెట్టబడే మేకపిల్లే గుర్తుకొచ్చేది. అంతటితో ఆగితే పరవాలేదు. నా ఆహారపుటలవాట్లన్నిటిని మా ఆవిడ నిర్దాక్షిణ్యంగా పెకలించివేసింది. నూనె వస్తువులూ, మసాలా వంటలూ, అన్నిటికంటే ముఖ్యంగా నాన్-వెజిటేరియను..... అన్నిటినీ పూర్తిగా నిలిపివేయబడ్డాయి.
ఉదయాన్నే ఇడ్లీ/దోస, వేరుశనగపప్పుల చట్నీ లేని ఉపాహారాన్ని అసలు ఊహించుకోలేని నేను, ఒక్కసారిగా బ్రెడ్డూ,పుల్కాలు, జొన్న రొట్టెలు మొదలైన వాటితో సరిపుచ్చుకోవలసి వచ్చింది. అలాగే నా లంచ్ బాక్సు, రాత్రి భోజనం మెనూ కూడా మారిపోయింది. అన్నిటికన్నా ముఖ్యంగా, మాంసాహారం పూర్తిగా నిషేదించబడింది. ఇలా ఓ వారం రోజులు అతి భారంగా గడిచాయి. నాకు జీవితమ్మీద ఇచ్చ పూర్తిగా ఆవిరైపోయి, మార్నింగ్ వాక్ కు కాళ్ళీడ్చుకుంటూ వెళుతుండగా, ఓ రోజు పార్కు పక్కనే చిన్న టిఫిన్ సెంటర్ నా కంటపడింది. వెంటనే నా కళ్ళు మెరిసాయి. ఒక్కరోజుకే అని సరిపుచ్చుకుని,వెంటనే లోపలికి దూరి ఓ సెట్ దోశ లాగించేసి, కాసేపు వాకింగ్ చేసి, ఇంటికెళ్ళిపోయాను. ఇలా, ఏ రోజుకా రోజు, ఇదే చివరి రోజు అని సర్దిచెప్పుకోవడం, బయటే టిఫిన్ లాగించేయడం, ఏమీ అనుమానం రాకుండా ఇంటికెళ్ళిపోవడం... ఇలా సాగింది నా మార్నింగ్ వాక్ ప్రసహనం కొద్దిరోజుల పాటూ.
డైటింగ్ మొదలుపెట్టి ఇన్ని రోజులవుతున్నా నానుంచి ఏమాత్రం వ్యతిరేకత లేకపోవడంతో, మా ఆవిడకు అనుమానం వచ్చి, మొత్తానికి కూపీ లాగి, నేను చేస్తున్న వెధవ పనిని పసిగట్టేసింది. అంతే...చిన్నపాటి యుద్దమే జరిగింది మా ఇంట్లో. నిన్ను బాగుచెయాడం నావల్ల కాదూ అని అస్త్రసన్యాసం చేసిన మా అవిడను శాంతపరచడానికి నాకు జేజమ్మలు కనిపించారు. ఆ తరువాత, కొద్ది రోజులకే, నా అదృష్టం బాగాలేక, మేము ఇల్లు మారాము. ఈ కొత్త అపార్ట్ మెంట్ లో, కాంపస్ లోపలే క్లబ్ హౌసూ, అందులో జిమ్మూ ఉండడంతో, ఇక మార్నింగ్ వాక్ కు బయటకు వెళ్ళే అవసరం లేకపోయింది. అలాగే దొంగచాటుగా కడుపు నింపుకునే అవకాశమూ పోయింది.
ప్రస్తుతం, రాముడు మంచి బాలుడు అన్న టైపులో రోజు ఉదయాన్నే జిమ్ముకెళుతున్నాను. విజయగర్వంతో, మా ఆవిడ అప్రతిహతంగా నా డైటింగును (అదే నా కడుపు మాడ్చడాన్ని) కొనసాగిస్తోంది. అయితే, కాస్త వెసులుబాటేంటంటే, అప్పుడప్పుడూ నా మీద దయతలచి మామూలు టిఫిన్లూ అవీ చేస్తు ఉంటుంది. నేనుకూడా, అప్పుడప్పుడూ వచ్చే పండగరోజుల కొసం ఎదురుచూస్తూ, నా మితాహార దీక్షను కొనసాగిస్తున్నాను.
Wednesday, June 18, 2008
అంతర్ముఖం
పొర్లిపడే వెన్నెలతో పోట్లాడాలని ఉంది!
-సినారె
నన్ను చాన్నాళ్ళపాటు వేధించిన ప్రశ్న ఒకటుంది (ప్రశ్న అనే కంటే, ప్రశ్నల సమాహారం అంటే బాగుంటుందనుకుంటా). నా జీవితంలో అత్యంత గడ్డు రోజుల్లో కూడా నా వెంటపడి వేధించిన ప్రశ్నలవి. ఒకసారి వెనక్కితిరిగి చూసుకుంటే, నా జీవితంలో ప్రస్ఫుటంగా కనిపించేవి ఆ ప్రశ్నలే. నా జీవితంలో ప్రతి ముఖ్యమైన ఘట్టంతో ముడిపడి ఉండేవి ఆ ప్రశ్నలే.
అసలు దేవుడున్నాడా? ఉంటే, ఈ ప్రపంచంలో మన పాత్ర ఏమిటి? దేవుడి నుంచి మనమేమి ఆశించాలి? దేవుడే ఉంటే, అతని సృష్టిలో ఇన్ని ద్వందాలెందుకు? కష్టాలెందుకు? మన జీవిత లక్ష్యమేమిటి? (ఈ ప్రశ్నలు చాలమందికి కలిగి ఉండవచ్చు.. వీటిని ప్రస్తావించడం వెనుక నా ఉద్దేశం ఆత్మావలోకనమే తప్ప.... మరేమీ కాదని మనవి)
జీవితంలో కోల్పోవడానికి ఇంకేమీ మిగలనప్పుడు కూడా, నాకు ఆలంబనగా నిలబడ్డవి ఈ ప్రశ్నలే! చిత్రంగా ఉందికదా... నేను ఆ సమయంలో నిరాశా నిస్పృహల్లో పడి కొట్టుకుపోకుండా ఉండడానికి కారణం, ఈ ప్రశ్నలకు సమధానాల కోసం నా ఆరాటమే ముఖ్యకారణమని నా బలమైన విశ్వాసం! మరి ఈ ప్రశ్నలకు నాకు దొరికిన సమాధానాలు సరి అయినవో కాదో నాకు తెలియదు. అసలు దొరికాయని ఖచ్చితంగా కూడా చెప్పలేను. ప్రశ్నిచే మనస్తత్వం ప్రశ్నగా మిగిలిపోకుండా ఉండాలంటే, కొన్ని అవగాహనలు మనసులో స్తిరంగా నాటుకోవాలి.
అసలు దేవుడున్నాడా....? ఈ ప్రశ్న ఎంతోమందిని, ఎన్నోవిధాలుగా తొలచిన ప్రశ్న! అసలు సమాధనముందో లేదో కూడా తెలియని ప్రశ్న! ఇదే ఖచ్చితమైన సమాధానమని చెప్పలేని ప్రశ్న!
భగవంతుడికి ఒక నిర్వచనాన్ని ఆపాదించే ప్రయత్నం చేసే ముందు, మనం ఒక్కసారి మన చుట్టూ ఉన్న అతని సృష్టిని పరికిద్దాం. సమన్వయ లక్షణభరితమైన ఈ ఖగోళమూ, అందులోని సౌరకుటుంబమూ, ఈ భూమీ, దాని మీద ప్రాణులు, నదులూ, పర్వతాలూ, ఋతువులూ, ఎండా, వానా, గాలీ, పగలూ, రాత్రీ, చెట్లూ, పూలూ,పళ్ళూ, ....ఒహ్! సమ్మోహనభరితమైన, సర్వశ్రేష్టమైన ఈ సృష్టిని పరికించడానికి రెండు కళ్ళూ సరిపోతాయా? అబ్బురపరిచే ఈ సృష్టిని ఎన్నివేల మేధస్సులు కలిసి నిర్మించగలవు? వీటన్నిటికీ కారణభూతమైన, అనంతమైన ఆ అదృశ్యశక్తిని, ఎంతో పరిమితమైన మన మేధస్సు నిర్వచించగలదా?
ఎన్నో అద్భుతాలను ప్రోదిచేసుకున్న ఈ సృష్టిని అనుభవించడాం ద్వారా మాత్రమే, ఆ సృష్టికర్త మనకు అవగతమౌతాడు. మన మేధస్సుకున్న పరిమితులను మరచిపోయి, భగవంతుడిని ఒక నిర్వచనంలో బంధించాలని ప్రయత్నిచినప్పుడే, సంక్లిష్టత మొదలౌతుంది. సృష్టియొక్క మహనీయత మనకు అవగతమైన నాడు, సృష్టికర్తను అర్ధం చేసుకునే ప్రయత్నం చేయము.
అయితే, ఇక్కడవచ్చిన చిక్కల్లా, మనము, మన తర్కాన్ని, నమ్మకాలనూ, ఇష్టాలనూ, భక్తినీ ఉపయోగించి ఓ భగవంతుణ్ణి సృష్టించేస్తాం. కొన్ని గుణగణాలను, ఆ భగవంతునికి అంటగట్టేస్తాం. ఇలా, మెల్లగా, మనకు తెలియకుండానే, మనం సృష్టించుకున్న ఆ దేవుణ్ణి నమ్మడం మొదలు పెడతాము. కానీ, అసలైన జ్ఞాని, తనను సృష్టించిన భగవంతుణ్ణి మాత్రమే నమ్ముతాడు. దురదృష్ట వశాత్తూ, మనలో చాలామందిమి మొదటి కోవకే చెందుతాము. మన నమ్మకానికీ, వాస్తవానికీ తేడా వచ్చినప్పుడు, నిరాశకు లోనౌతాము. భగవంతుణ్ణి నిందిస్తాము.
అసలు భగవంతుణ్ణి అర్ధం చేసుకో గలమా? నా దృష్టిలో ఈ సంక్లిష్టతకు మూలకారణం, మనం భగవంతుణ్ణి అర్ధం చేసుకోవాలని ప్రయత్నిచడమే (తెలిసో, తెలియకో). బిడ్డ తన తల్లిని పూర్తిగా నమ్ముతుంది. ఎప్పుడూ ముద్దు చేసే అమ్మ, అప్పుడప్పుడూ తన చిన్నారిని దండిస్తుంది కూడా. మన్ను తిన్నందుకు కొట్టినా కూడా, అమ్మను పట్టుకుని ఏడుస్తుందే తప్ప, అమ్మను అర్ధం చేసుకోవాలని ప్రయత్నిచదు. అమ్మ మీది విశ్వాసం, అమ్మ ప్రవర్తనలోని ఈ ద్వందాలను (ప్రేమ, దండన) పూర్తిగా అంగీకరించేలా చేస్తుంది. అందుకే పాపాయి లోకంలో ఎల్లలెరుగని ఆనందాలు!
ఉదాహరణకు, ఆటపాటల్లో మునిగి ఉన్న పాపాయిని, తిండికి సమయమయ్యిందని అమ్మ బలవంతంగా తీసుకెళుతుంది. పాపాయికి సంబంధించినంతవరకు, అమ్మ అలా తీసుకెళడం ఒక వైపరీత్యమే. కానీ, పాపాయికి ఎప్పుడు ఏమి కావాలో అమ్మకంటే బాగా ఎవరికి తెలుస్తుంది... అమ్మ మీద విశ్వాసం మాత్రమే ఉన్న పాపాయి, తనకు కోపమొచ్చినా కూడా, అమ్మను గట్టిగా పట్టుకుని ఏడుస్తుందే కానీ, అమ్మకు దూరంగా జరగదు. కాస్సేపటికి మరచిపోతుంది. అలాగే, భగవంతుడు తనకు ఆశాభంగం కలిగించినట్లు పైకి కనిపించినా, ఆయన ఎరుక గలిగిన వాడు,ఆయనపై విశ్వాసాన్ని చెదరనివ్వడు.
ఇంకో ఉదాహరణ. హటాత్తుగా ఒక పిల్లిని చూసి పాపాయి భయపడుతుంది. వెంటనే, ఏడుస్తూ అమ్మ కోసం లోపలికి పరుగెడుతుంది. అమ్మ కనపడగానే, అమ్మ చేతుల్లో వాలగానే ఒక్క సారిగా తన భయాన్ని మరచిపోయి, ధైర్యంగా వెనక్కి తిరిగి చూస్తుంది! భయానికి ఒకేఒక్క విరుగుడు విశ్వాసం! అదే విధంగా, భగవంతుడి ప్రేమపై, అచంచలమైన విశ్వాసమే మన జీవితంలోని కష్టాలన్నిటికీ విరుగుడు.
కానీ, చిత్రమేమిటంటే, ఇలా ప్రోది చేసుకున్న విశ్వాసమంతా, అప్పుడప్పుడూ బాధలూ, కష్టాలవల్ల కలిగే రంధ్రాల్లోంచి జారిపోతుంది. మళ్ళీ కరువు మొదలౌతుంది. మళ్ళీ వెదుకులాట ప్రారంభం. ఎప్పుడో ఒకసారి ఎదురయ్యే అనుభవం వల్ల మళ్ళీ నమ్మకం స్థిరపడిందని ఊహించుకొంటాం. అరర్రే.... ఇప్పటివరకూ భగవంతుడి ప్రేమను సంశయించామేనని బాధ పడతాం. కానీ, ఇంతలోనే మళ్ళీ సమస్యల సుడిగుండాలు... కష్టాలూ, కన్నీళ్ళూ,నిష్ఠూరాలూ... అనుమానపు సింహం మళ్ళీ జూలు విదిలిస్తుంది. దేవుడు నిజంగా ఉన్నాడా అన్న ప్రశ్న మళ్ళీ ఉదయిస్తుంది. ఎందుకైనా మంచిది అన్న తలంపుతో, ఏమౌతుందో అన్న భయంతో, దేవుడిపై నమ్మకాన్ని వీడలేక, తిరిగి విశ్వాసాన్ని కూడదీసుకోలేక.....ఊగిసలాడుతూ, జీవితాన్ని గడిపేస్తాము!
గర్భం నుంచి సమాధి దాకా ఉన్న సన్నటి ఇరుకైన దారే జీవితం. ఈ ద్వందాల నడుమ నిరంతర ఊగిసలాటే జీవితం.
మరైతే మన జీవిత లక్ష్యమేమిటి? అనంద్ (హిందీ సినిమా) చూసిన వాళ్ళకు గుర్తు ఉండేవుంటుంది....చివర్లో రాజేష్ ఖన్నా డైలాగు...... "హం సబ్ ఊపర్ వాలే కె హాత్ మే బాంధే హువే కట్పుత్లియా హై..."
చాన్నాళ్ళక్రితం, నాకూ, నా ప్రియమిత్రుడికి చిన్న సంవాదం జరిగింది. "దేవుడనేవాడు ఒక రిఫరీ లాంటివాడు. మనల్ని పైనుంచి గమనిస్తూ ఉంటాడు. ఏ మార్గంలో వెళ్ళాలీ అనేది మనమే నిర్ణయించుకోవాలీ...." ఇదీ మా వాడి వాదన.
మనిషికి నిజంగా తన చేతలపై, మాటలపై, చేసే పనులపై, అలోచనలపై....ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే, తను చేసే ఏ పనిపైనైనా నియంత్రణ ఉందా? నా ఉద్దేశంలో, సృష్టినీ, సృష్టికర్తనూ వేరుగా చూడడంవల్ల మాత్రమే, ఈ ప్రశ్న, కలుగుతుందనుకుంటాను. మనమే ఆయన ఇచ్ఛామాత్రము చేత సృష్టింపబడినప్పుడు, మన చేతలు మాత్రం మన ఇచ్ఛ ఎలా అవుతాయి? ఇవే మాటల్ని ఓ సినీ కవి(వేటూరి?) చాలా సరళమైన మాటల్లో చెప్పారు......
"నరుడి బ్రతుకు నటన..
ఈశ్వరుడి తలపు ఘటన....
ఈ రెంటి నట్టనడుమ,
నీకెందుకింత తపన...."
మరైతే జీవించడం ఎందుకు? జీవిత లక్ష్యం ఏమిటి? ఓ మహానుభవుడన్నట్లు, "ఏదో సాధించడం కాదు జీవిత లక్ష్యం, నువ్వే భగవంతుడు సాధించిన దానికి తార్కాణం".
"అంతా ముందే నిర్ణయిచబడింది" అన్న వాదనను విశ్వసించాలీ అంటే, ముందుగా ఈ మూడు సూత్రాలూ వంటబట్టాలి....
1. సమస్తమూ ఆయనే.
2. సమస్తమూ ఆయనే చేస్తాడు.
3. సమస్తమూ ఆయన మన మంచికోసమే చేస్తాడు.
మరి దీన్నెలా నమ్మడమూ అంటే, అంతా ఆయనే చేస్తాడు కనుక, మనం నమ్మడమూ నమ్మకపోవడమూ... అంతా ఆయన పనే. ఇంకోలా చెప్పాలంటే, ఇది వాస్తవం కనుక, మనం ఒప్పుకోవడమూ, ఒప్పుకోకపోవడమూ అన్నది అర్ధరహితము.
Thursday, June 12, 2008
అన్వేషణ
అమ్మ ఒడిలోని చిన్నారిలా
జోకొట్టి, నన్ను నిదురపుచ్చి,
రంగురంగుల స్వప్నాలను
నా ముందావిష్కరించి,
సడి చేయకుండా నానుంచి
దూరమౌతావు......
నా స్వప్నలోకంలో విహరిస్తూ,
నన్ను ముంచెత్తుతున్న నీ
ప్రేమామృత ధారను గుర్తించలేని అశక్తుణ్ణి.
ఇంతలో ఓ దుస్స్వప్నం,
ఉలిక్కిపడి నిద్దుర లేచి చూద్దును కదా...
నువ్వు నాచెంత లేవు.
నా వెదకులాట మళ్ళీ మొదలు,
నీళ్ళు నిండిన కళ్ళతో
దూరమైన నీకోసం
మళ్ళీ నా అన్వేషణ మొదలు..
నన్ను నీ దరికి చేర్చే ఈ దుస్స్వప్నాలకు
ఎలా తెలుపను నా కృతజ్ఞతలు?
(Sri Ram గారి 'Smiling Tears' లోని ఓ కవితకు స్వేచ్చానువాదం.. )
Friday, May 23, 2008
మా ఇంటి బుడుగు!
చిన్నప్పుడు బాలజ్యోతిలో బాపు గారి బుడుగు కార్టూన్లు చదివినప్పుడు వాటి లోతు తెలియ లేదు కానీ, ఇప్పుడు మా ఇంట్లోని బుడుగుతో వేగుతున్నప్పుడు, ఆ కార్టూన్లన్నీ మళ్ళీ జ్ఞప్తికొస్తున్నాయి!
ఈ ఫోటొలో ఉన్నవాడే మా ఇంటి బుడుగు. నాలుగున్నరేళ్ళకే అల్లర్లో బుడుగుకంటే రెండాకులు ఎక్కువే చదివాడు! మాటలు రావడం కాస్త ఆలస్యమయ్యి మొదట్లో మాకందరకి కొంచెం టెన్షన్ ఇచ్చాడు... ఇప్పుడేమో కామాలూ, పుల్ స్టాపులూ లేకుండా మాట్లాడుతూ, మా ఓపికకు పరీక్ష పెడుతున్నాడు. ఈ మధ్య మేము శ్రావణబెళగుళ (కర్నాటక) వెళ్ళాము. అక్కడ గోమటేశ్వరుడి విగ్రహం చూసి, మా వాడు గట్టిగా "డాడీ...ఈ జేజి చెడ్డీ ఎందుకు వేసుకోలేదు? షేం షేం అవ్వదా?" అని అరిచాడు. అంతే...క్యూ మొత్తం ఒక్కసారిగా ఘొల్లుమంది! ఆ తరువాత అక్కడ ఉన్నంత సేపు వాడి సందేహాలు తీర్చలేక, వాడి నోరు మూయించలేక మేము పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు!
వాడికి శలువులప్పుడు ఓ రోజు నాతోపాటు ఆఫీసుకొస్తానని మారాం చేస్తుంటే, మా బాసు కొడతాడని చెప్పి వాడిని సర్దిపుచ్చాను. అలాగే మా బాసుపై నేను వేసే జోకులు విన్నాడేమో కాని, వాడి మనసులో మా బాసుపైన ఒక భయంకరమైన ముద్ర ఏర్పడిపోయింది. ఈ విషయం గ్రహించని నేను, ముందు జాగ్రత్తలేవీ లేకుండానే ఒకసారి మా ఆఫీసుకు తీసుకెళ్ళాను.
చిన్న పిల్లాడు కదా అని మా బాసు వీడిని ముద్దు చేయబొతే, వీడేమో సీరియస్ గా మొహం పెట్టి, నావైపు తిరిగి "ఈయనేనా మీ బాసు? అయితే చేతిలో కర్ర లేదే?" అని అడిగాడు. ఒక్కసారిగా అవాక్కయి, అదృష్టవసాత్తూ మా బాసుకి తెలుగు రాకపోడంతో, ఏదో సర్ది చెప్పి అప్పటికి బయటపడ్డాను.
ఇలా మా బుడుగు గురుంచి రాయాలంటే చాలనే ఉన్నాయండీ... అన్నట్లు మా వాడి పేరు సాయి ప్రణద్.
Sunday, May 18, 2008
నిరీక్షణ
నీ మూర్తి నా స్ఫూర్తి కాగా,
ఈ ప్రపంచాన్ని జయించి వెనుతిరిగితే,
ఏదీ కనపడవే.....? ఏమై పోయావు నువ్వు?
ఘనీభవించిన జీవితం,
సాయంకాలపు నీడల్లా నీ జ్ఞాపకాలు...,
రంగు వెలసిన కాగితంపూవు లాంటి నేను,
తోడుగా నువ్వు తిరిగి వస్తావన్న చిన్ని ఆశ,
ఇంకేమీ చేయలేను... నిన్ను ప్రేమిస్తూ ఉండడం తప్ప.
ఏనాడో నీలో కరిగిపోయిన నేనూ,
నాలో మాత్రమే ఉన్న నువ్వూ...,
ఇవేమీ పట్టని ఈ ప్రపంచం,
ఇంకేమి చేయగలను..... నిన్ను ప్రేమిస్తూ ఉండడం తప్ప.
నీ చిరునవ్వుల తొలకరి కోసం
చకోరమై ఉన్నా నేస్తం..
Sunday, May 4, 2008
సత్యం...శివం...సుందరం (చివరి భాగం)!
తను చెప్పింది నాకు పూర్తిగా అర్ధమవ్వడానికా అన్నట్లు, ఒక్క క్షణంపాటు నిశ్శబ్ధం మా మధ్య.
"సరే, నువ్వుచెప్పినదాని ప్రకారం, నిన్ను, నీ సృష్టిని ప్రశ్నిచంకుండా, నిన్ను ప్రేమించాలి. అలా అయితే మరి మా పాత్ర ఏమిటి? నీనుంచి మేమేమి ఆశించాలి? మరి మనిషై పుట్టినతరువాత, రాగద్వేషాలకతీతంగా జీవించడం సాధ్యమేనా? ఇంత స్పష్టంగా కనబడుతున్న, నీ సృష్టిలోని అసమానతలను ఎలా స్వీకరించాలి? మా కష్టాలను ఎలా ఎదుర్కోవాలి? అసలు ఈ కష్టాలెందుకు? అవసరమైనప్పుడు, నీ నుంచి సహాయం ఆశించే ఆర్తులకు, అది లభించదెందుకు? ఎన్నో సార్లు నీనుంచి మాకు అసంతృప్తి మాత్రమే ఎదురవుతుందెందుకు?" నా మదిలో సుడులు తిరుగుతున్న ప్రశ్నల పరంపర. కానీ, ఏమడగాలో తెలియని అయోమయం. అసలు ప్రశ్నించే అవసరమే లేదన్నట్లు, సంభాషణ మళ్ళీ కొనసాగింది.
"నా గురించి,ఎంతోమంది ఆస్తికులు, మేధావులు ఎన్నో వాదోపవాదాలు,ఉపన్యాసాలు చేసారు. ఎన్నో అభిప్రాయాలు,వివరణలు ఇచ్చారు. ఎవరికి వారు, వాళ్ళ వాళ్ళ తెలివిని, తర్కాన్ని, ఇష్టాఇష్టాల్ని, ప్రేమను, భక్తిని ఉపయోగించి, వారికి నచ్చిన దేవుడ్ని సృష్టించేసారు. దేవుడంటే ఇలా ఉంటాడు అన్న అభిప్రాయనికొచ్చేసి, తదననునుగుణంగా నియమ నిబంధనలు ఏర్పరచి, ఎప్పుడైతే వారి అభిప్రాయలకు వ్యతిరేకంగా జరుగుతాయో, ఈ సృష్టినే సందేహించడం మొదలు పెడతారు. అసలు, నాయందు పూర్తి విశ్వాసమున్నవాడు, భయానికీ, భాదకీ, కోపానికీ లోను కాకూడదు. కానీ వీళ్ళందరూ ఏమవుతుందో అన్న భయంతో నన్ను విశ్వసిస్తున్నవారు. వీళ్ళ కంటే నాస్తికులే ఎంతో నయం. నాస్తికులకు, సమస్య ఎదురయ్యినపుడు పిర్యాదు చేయడానికి, వాళ్ళు సృష్టించుకున్న దేవుడుండదు కదా. జీవితాన్ని ఏ విధమయిన సందేహమూ లేకుండా గడిపేస్తారు. మీరు సృష్టించుకున్న దేవుడ్ని కాకుండా, మిమ్మల్ని సృష్టించిన దేవుడ్ని నమ్మిన నాడు, ఏ సమస్యా ఉండదు.
గులాబీ చుట్టూ ముళ్ళను కల్పించానని, నాకు కౄరత్వాన్ని అంటగడతారు. కానీ ఆముళ్ళు గులాబీరేకుల్ని గుచ్చడం ఏనాడైనా చూసావా? నిజానికి ఆ ముళ్ళే గులాబీని రక్షిస్తాయి".
తన చిరునవ్వు తో పాటు జాలువారే ప్రేమరస కౌముది, నన్ను ముచెత్తుతోంది. తన మాటల ద్వారా ఒకరకమైన స్వాంతన, నమ్మిక కలుగుతున్నాయి..
"సృష్టిలో ఇన్ని అసమానతలెందుకు అన్నది నీ ముఖ్యమైన ప్రశ్న. నీకు పైన కనిపిస్తోన్న ఈ అసమానతలే, సృష్టియొక్క సమానతకు ఆయువుపట్టు. ప్రతీ ఒక్కరూ ధనవంతులైతే, మరి చిన్న చిన్న పనులెవరు చేస్తారు? నేల యొక్క ఎత్తుపల్లాలే కదా నదీ గమనాన్ని నిర్దేశించేది?
ఈ అసమానతలను, అసంపూర్ణత్వాన్నీ ఎప్పుడూ మీవైపునుంచే అన్వయిస్తారు. ఇంకో చిన్న ఉదాహరణ. ఈ సమస్తాన్నీ సృష్టించినది నేనైనపుడు, ఈ సృష్టిలో ప్రతీ జీవినీ సమానంగా ప్రేమిస్తాను కదా? మరైతే, మీ ఆనందాల కోసం, విలాసాల కోసం, ఇతర జీవుల్ని హింసిస్తారెందుకు? ఆ సమానత్వాన్ని ఇక్కడెందుకు అన్వయించరు? ఎందుకంటే, మీకు ఈ సృష్టిలో ఒక ప్రతేకతను మీరే ఆపాదించుకొని,సృష్టిలో మీరుకూడా ఒక భాగమేనని మరచిపోతారు కాబట్టి".
"మరి నీ సృష్టిలో ద్వందాలెందుకు?" నా ప్రశ్న సూటిగా వెలువడింది.
"ఏదైనా ప్రమాదం జరిగినప్పుడో, వైపరీత్యం సంభవించినపుడో, ప్రతి ఒక్కరూ ఈ సృష్టిని ప్రశ్నిస్తారు. తమకేమైనా కష్టం కలిగినప్పుడు, ఎందుకు దేవుడా నాకీ కష్టం, నేనేమి తప్పు చేసానని నాకీ కష్టం అని నిలదీస్తారు. మరి, ఒక్కసారి గుర్తు తెచ్చుకో - ఎప్పుడైనా నీకు నచ్చిన విషయం జరిగి, నీకు అమితంగా ఆనందం కలిగినప్పుడు, నాకెందుకింత ఆనందం? నేనేమి చేసానని ఇంత ఆనందాన్నిచ్చావు? అని ఏనాడైనా ప్రశ్నించావా? లేదు. ఎందుకంటే, మీరు జీవితాన్ని ఎప్పుడూ మీ వైపునుంచే చూస్తారు. చిన్న చిన్న పిట్టలను ఎప్పుడైనా గమనించావా? అవి, ఎంతో శ్రమకోర్చి కట్టుకున్న గూడు, వాటిలోని గుడ్లతో సహా, ఏ ప్రకృతి వైపరీత్యం వల్లనో, వేరే జీవి దుశ్చర్య వల్లనో నాశనం గావింపబడితే,అవి తమ తలరాతను తిడుతూ కూర్చోవు. మళ్ళీ మొదటినుంచీ ఇంకో గూడు కట్టడం మొదలు పెడతాయి. ప్రకృతిలోని ద్వందాలను సహజసిద్దంగా స్వీకరిస్తాయి. అలాగే, సృష్టిలో అంతర్భాగమైన ద్వందాలను నువ్వెందుకు అంగీకరించడం లేదు.
శాస్త్రపరంగా సమన్వయ లక్షణ భరితమైన ఈ సౌరకుటుంబం, ఖగోళ శాస్త్ర విరచితమైన ఈ నక్షత్రాలూ, ఈ భూమి, ఋతువులూ, విలక్షణ భరితమైన ప్రాణకోటి, ప్రాణులన్నిటిలోకి తలమానికమైన మానవుడూ - ఇవన్నీ నైపుణ్యం లేని హస్తం నుంచి వచ్చి ఉండవు; అందువలన ఈ సృష్టి అన్యధా ఉండడానికి వీలు లేదు అన్న సత్యాన్ని నీవెందుకు గ్రహించడం లేదు? తుఫాన్లనుంచి కాక, తుఫాన్లమధ్య నిన్ను రక్షించడానికి సిద్దంగా ఉన్న నన్నెందుకు నువ్వు గుర్తించడం లేదు?
ఇందాక నేను చెప్పినట్లు, నీ రెండేళ్ళ చిన్నారికీ, నీకూ తేడా ఏమిటంటే, నీ చిన్నారికి అమ్మ మాత్రమే తెలుసు. అమ్మగురించి తెలియదు, తెలుసుకోవాలని ప్రయత్నించదు.
ఏదైతే మార్పుకి వీలు లేని, దైవనిర్ణయమై నిక్షిప్తమై ఉన్నదో, నీ జీవితంలో ప్రతి సంఘటనా దాని ప్రక్షిప్త ప్రకటన. మానసిక స్తిరత్వాన్ని పునర్ జాగృతం చేసి, ధైర్యాన్ని కూడదీసుకుని ముందుకు సాగిపో".
"చివరిగా నాదింకో ప్రశ్న. ఎంతో మంది తమ జీవిత కాలాన్ని వెచ్చించినా కలగని నీ దర్శన భాగ్యాన్ని నాకెందుకు కల్పించావు?" నా గొంతులో ఇందాకటి సంఘర్షణ లేదు. దాని స్తానే నా గొంతులో ప్రశాంతత, స్పష్టత,విశ్వాసం.
"మృత్యువును కొద్ది క్షణాల తేడాతొ తప్పించుకున్నపుడు, నీ తొలి ప్రతిచర్య ఆనందం కాదు..... అంతమంది చనిపోయారన్న విషాదం. ఆ చర్యే మన సంభాషణకు హేతువు".
**** **** *****
"ఇదుగో కాఫీ, లేవండి. రాత్రంతా ఒకటే కలవరింతలు. రెండు రోజులు శలవు పెట్టండి. గాలి మార్పుకు ఎటైనా వెళ్ళి వద్దాం", మా ఆవిడ పిలుపుతో ఉలిక్కిపడి నిద్ర లేచాను.
Wednesday, April 23, 2008
సత్యం...శివం...సుందరం!
11 జూలై 2006, సాయంత్రం 6:15
ప్రతీ రోజులాగే బాంద్రా స్టేషన్ వైపు వడివడిగా అడుగులేస్తున్నాను. వీలైనంతవరకూ, నేను 18:20 బోరివలి లోకల్ ట్రైన్ మిస్ అవను. ముంబైలోని చాలమందికి అలవాటు - ప్రతీ రోజూ, ఆఫీసుకెళ్ళడానికి, తిరిగి ఇంటికెళ్ళడానికి ఒక నిర్ణీతమైన లోకల్ ట్రైను ఉపయోగిస్తుంటారు. ఈ రొటీన్లో సాధారణంగా మార్పుండదు. ముంబైకొచ్చిన రెండేళ్ళలొ, నేనూ ఇలా అలవాటు పడిపోయాను. అందుకే, సాయంత్రం ఇంటికెళ్ళడానికి వీలైనంతవరకూ 18:20 బోరివలి ఫాస్ట్ లోకల్ మిస్ అవడానికి ఇష్టపడను.
అసలు ముంబై నగరవాసులకూ, గడియారంలోని ముళ్ళకూ పెద్ద తేడా కనిపించందు నాకు. ప్రపంచంతో సంబంధం లేకుండా పరుగెత్తడాన్ని ముంబై నగరం ప్రతి ఒక్కరికీ అలవాటు చేస్తుంది. అది అనుభవిస్తే కాని అర్ధం కాదు. నేను ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీదకొచ్చి, రెండో నంబర్ ప్లాట్ ఫాం వైపు దాదాపు పరుగులాంటి నడకతో వెళుతున్నాను. రైలు ప్లాట్ ఫాం మీద సిద్దంగా ఉంది. లోకల్ రైళ్ళు సాధారణంగా నలభై సెకన్లు పాటు ఆగుతాయి. నేను పరుగు వేగం పెంచాను. మెట్లు దిగగానే రెండవది నేనెక్కవలసిన ఫస్ట్ క్లాసు భోగీ. నేను చివరి మెట్టు మీద ఉండగానే ట్రైన్ స్టార్ట్ అయ్యింది. అది వేగం పుంజుకుంటుండగా, దాన్ని మిస్ అవ్వడం ఇష్టం లేక, అందుబాట్లో ఉన్న సెకండ్ క్లాస్ భోగీలోకి ఎక్కేసాను.
ఎప్పట్లానే భొగీ విపరీతమైన రద్దీగా ఉంది. అతికష్టం మీద, జనాన్ని తోసుకుంటూ లోపలికి రెండడుగులు వేసాను. చాలా విసుగ్గా ఉంది. ఫస్ట్ క్లాసులోనైతే ఇంత రద్దీ ఉండదు. నిదానంగా తరువాత ట్రైన్ క్యాచ్ చేసుండల్సింది... ఇలా ఆలోచిస్తుండగానే ఒక్క సారిగా పెద్ద శబ్ధం. ట్రైను దదాపు తలక్రిందలయ్యేంతగా ఊగి, ఒక్క కుదుపుతో ఆగిపొయ్యింది. ఎమౌతోందొ అర్ధం కాలేదు.
ఇంతలో ఎవరో గట్టిగా అరిచారు "బాంబ్ హై! భాగో! అని. ఒక్క క్షణం నిచ్చేష్టుణ్నై, మెల్లగా ఆ తోపులాటలో పడి, పెద్దగా నా ప్రయత్నమేమీ లేకుండానే బయట పడ్డాను. ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. అంతా గందరగోళంగా ఉంది.
నెమ్మదిగా అర్ధమయ్యిందేంటంటే, ఫస్ట్ క్లాస్ భోగీలో బాంబు పేలింది..చాలా మంది చనిపోయారు/ గాయాపడ్డారు. ఇంకా ఎన్ని బాంబులున్నాయో తెలియదు... అందరూ దూరంగా పరుగెడుతున్నారు. మెల్లగా వాస్తవం నాకు పూర్తిగా అవగతమైంది.. నేను వెంట్రుకవాసిలో మిస్ అయిన ఫస్ట్ క్లాస్ భోగీలో బాంబు పేలింది. మరణానికీ, నాకూ మధ్య కొద్ది సెకన్ల తేడా.
అందరూ మెల్లగా తేరుకుని ఫస్ట్ క్లాస్ భోగీ వైపు అడుగులేస్తున్నారు. కొంతమంది ధైర్యస్తులు లోపలికి వెళ్ళి గాయపడిన వారికి సహాయం చేస్తున్నారు. అరుపులూ కేకలతో ఆ ప్రదేశమంతా గందరగోళంగా మారింది.
అదురుతున్న గుండెలతో, నిస్సత్తువగా నెమ్మదిగా అటువైపెళ్ళాను. ఓహ్ ...హృదయ విదారకంగా ఉంది పరిస్థితి. చెల్లాచెదురుగా పడి ఉన్న శరీరాలు, భాదితుల ఆర్తనాదాలు, ఏడుపులూ, పేడబొబ్బలూ.. కలలో కూడా ఊహించలేని దృశ్యం. ఎవరు బ్రతికున్నారో, ఎవరు చనిపోయారో తెలియడం లేదు. చేయి తెగి భాదతో అరుస్తూన్న సర్దార్జీ, విగత జీవుడై పడి ఉన్న పార్శీ ముసలివాడు, రక్తపు మడుగులోని స్టాక్ బ్రోకరూ, స్టేట్ బాంక్ లో పని చేసే పలనివేల్... చాల వరకు తెలిసిన మొహాలే. గత రెండేళ్ళగా కలిసి ఒకే రైలుపెట్టెలో ప్రయాణిస్తున్నాము.. ఈరోజు నా అదృష్టం బాగుండి కొద్ది సెకన్ల తేడాతో ఆ బోగీ మిస్ అయ్యాను. లేకుంటే నేనూ వాళ్ళతోపాటుగా పడి ఉండేవాడిని.
చిత్రంగా, నేను బ్రతికి బయటపడ్డానన్న సంతోషం కలగడం లేదు. చావును అంత దగ్గరగా, అంత భయంకరంగా చూసిన షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు.
దాదాపు పావుగంట పాటు అక్కడే రైలు పట్టాపై కూర్చుండిపోయాను. ఇంతలో, విషయం తెలిసి ఇంటినుంచి ఫోన్ వచ్చింది. నా క్షేమసమాచారం తెలియ చేస్తుండగానే మొబైల్ ఫోన్ మూగబోయింది. నెమ్మదిగా, కూడదీసుకుని స్టేషన్ చేరుకుని, టాక్సీలో ఇల్లుచేరాను. పలకరింపులకు యాంత్రికంగా సమాధానం చెబుతూ, నిశ్శత్తువగా సోఫాలో కూలబడ్డాను. నా పరిస్థితిని అర్ధం చేసుకున్న మా ఆవిడ నన్నెక్కువ డిస్టర్బ్ చెయ్యలేదు. విషయం తెలిసి, నాకు వస్తున్న ఫోన్లన్నిటికీ తనే సమాధానమిస్తోంది. TV లో న్యూస్ రీడరు చెపుతోంది - కొద్ది నిమిషాల తేడాతో ఏడు చోట్ల బాంబులు పేలాయనీ, మృతుల సంఖ్య దదాపు 150-200 ఉండొచ్చనీ..
ఆ రాత్రి అన్నంకూడా సహించలేదు. ఆ హృదయ విదారకమైన దృశ్యాన్ని మరచి పోలేకపోతున్నాను. ఒకరకమైన కసి, కోపం, నిస్సహాయతా నన్ను ముంచెత్తుతున్నాయి. రోజంతా పోట్టకూటికై పనిచేసి, అలసి సొలసి, తమ గూడు చేరుకుంటున్న ఆ అమాయకులు ఏం పాపం చేసారు? ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి? నాకు జీవితంలో మొట్ట మొదటి సారి భగంతుడిపై విపరీతమైన కోపమొచ్చింది. దేవుడు కరుణామయుడు, ఈ సృష్టి పరిపూర్ణమైనది అన్న నా నమ్మకం పూర్తిగా పెకలింపబడింది. ఇలా విపరీతమైన అవేశంతో, అలోచనలతో ఎప్పుడో అర్ధరాత్రి నిద్రలోకి జారుకున్నాను.
*** *** *** ***
చల్లటి స్పర్శ నా నుదుటిపై కలగడంతో ఒక్కసారి ఉలిక్కిపడి లేచాను. నాచుట్టూ, శరత్పూర్ణిమను మరిపించే చల్లటి ప్రకాశవంతమైన కాంతి...మృదుమధురమైన సన్నటి నవ్వు, నన్ను మలయమారుతంలా చుట్టేసింది. ఆ నవ్వుని బట్టి అర్ధమయ్యింది, నా ఎదురుగా ఎవరో ఉన్నారని... ఎవరో పోల్చుకోలేకున్నాను... కానీ, ఆ చిన్నటి నవ్వులో, స్పర్శలో జాలువారిన ప్రేమ నా మనసుకు తెలుస్తోంది. స్వాంతన కలిగిస్తోంది.
"ఎవరు నువ్వు....మీరు?" అయోమయంతో నా గొంతు పెగలడం లేదు.
మళ్ళీ అదే సెలయేటి గలగల లాంటి నవ్వు..."నా మీద నీకెందుకంత కోపం?"
"నువ్వు... ఐ మీన్, మీరు....దేవుడా?"..ఆశ్చర్యం, ఆనందం, ఇందాకటి కోపం, ఉక్రోషం,ఆవేదన...అన్ని భావాలు ఉప్పెనలా నన్ను చుట్టుముట్టాయి.
నా ప్రశ్నకు సమాధానం, మళ్ళీ చిరునవ్వే అయ్యింది. "నా మీద నీకెందుకంత కోపం?"...అదే ప్రశ్న.
"అన్నీ తెలిసినవాడివి, నా కోపానికి కారణం నీకు తెలియదా?" నా గొంతులో ఉక్రోషం, సంభ్రమం.... రెండూ సమ్మిళితమయ్యాయి.
"సరే అయితే..ఇంకో చిన్న ప్రశ్న. నాగురించి నీకేం తెలుసు?" ఆ గొంతులోని మార్ధవం నాకు ఒకవిధమైన ధైర్యాన్నిస్తోంది!
అప్రయత్నంగా, నాకు కరుణశ్రీ కవిత గుర్తుకొచ్చింది:
ఆణిముత్యాల జాలరీ లందగించు
నీల మణిమయ సువిశాల శాలలోన
నొంటరిగ గూరుచుండి క్రీగంట
స్వీయసృష్టి సౌందర్యమును సమీక్షింతు నీవు!
నా మనసులో మాట గ్రహించినట్లే, మళ్ళీ ఇంకో ప్రశ్న. "మరి సృష్టికర్తగా నన్నంగీకరించినపుడు, నా సృష్టినెందుకు సందేహిస్తున్నావు? ఈ సకల చరాచర జీవులు, వాటికి ఆధారమైన ఈ భూమి, నీరు, గాలి,వెలుతురు, ఈ గ్రహాలు, నక్షత్రాలు, అన్నీ కూడిన సమస్త విశ్వం.....నువ్వూ, నేనూ... ఈ సృష్టిలో పరిపూర్ణత నీకు కనబడడం లేదా?"
"పరిపూర్ణతా..? నీ సృష్టిలో అదే ఉంటే, ఇంతమంది అమాయకులెందుకు చనిపోయారు? నాకు తెలిసి వారింత భయంకరమైన చావుకు అర్హులు కారు". నాగొంతులో ఒకింత అసహనం.
"ఈ సృష్టికర్తనే నేనైనప్పుడు, మరి రైల్లో బాంబు పెట్టినవాడినీ, ఆ విస్ఫోటంలో చనిపోయిన వాడినీ సృష్టించింది నేనే కదా?"
నాలో అవేశం కట్టలు తెంచుకొంటోంది. "అదేకదా నా ప్రశ్న. నిన్నే శరణన్న ఇంతమందీ, నిన్ను ప్రేమిస్తోన్న ఎంతోమంది, ఆ బాంబు పేళుళ్ళలో చనిపోయారు... ఎందుకు? ఎందుకు నీ సృష్టిలో ఇన్ని అసమానతలు?"
ఒక్క క్షణంపాటు నిశ్శబ్దం... ఒక పలుచటి చిర్నవ్వు..."ఒక్క ప్రశ్నడుగుతాను... సూటిగా సమాధనం చెప్పు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?" ప్రశ్న తీక్షణంగా నా గుండెను తాకింది.
ఆ ప్రశ్నలోని తీక్షణతకు నా గొంతు పెగల్లేదు.
"నా సృష్టిని పూర్తిగా వ్యతిరేకిస్తూ, అపరిపక్వతనూ, అసమానతనూ,అసంపూర్ణతనూ దానికి అపాదిస్తూ, సృష్టి కర్తనైన నన్ను మాత్రం ప్రేమిస్తున్నామంటారు.ఇదెలా సాధ్యం? మనం ఈ ప్రపంచంలో ఎవ్వరినైనా ప్రేమించాలంటే, వారు చేసే పనులను కూడా ఇష్టపడాలికదా? ఒక వ్యక్తిని ప్రేమిస్తూ, అతని పనులను మాత్రం ద్వేషించలేం కదా? అలాగే, నా సృష్టినీ, అందులో మీకు అనందం కలిగించని వాటినీ, అర్ధంకాని వాటినీ ద్వేషిస్తూ, విమర్శిస్తూ, నన్ను మాత్రం ప్రేమించడం ఎలా కుదురుతుంది? ఈ సృష్టిని ప్రేమించడం ద్వారా, ఇష్టపడదం ద్వారా మాత్రమే, సృష్టికర్తను ప్రేమించగలం అన్న సత్యాన్ని ఎవరూ గ్రహించరెందుకు? "
"నిన్నర్ధం చేసుకోవడం చాల కష్టం", కాస్త నిష్టూర పడ్డాను.
"అసలు నన్నర్ధం చేసుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావు? అలా చేయడం మొదలుపెట్టిన నాడు, నా మీద నీకు పూర్తి నమ్మకం లేనట్లే. నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు. ఒక్కసారి నీ రెండేళ్ళ చిన్నారిని గమనించు. ఆ చిన్నారి తన అమ్మను పూర్తిగా విశ్వసిస్తుంది, ప్రేమిస్తుంది. తను ఆనందంగా ఉన్నా, ఏడుస్తున్నా అమ్మ చేయి మాత్రం వదలదు. మన్ను తిన్న తన బిడ్డను అమ్మ మందలిస్తుంది, చిన్న దెబ్బ కూడా వేస్తుంది. ఆ బిడ్డ కూడ,ఏడుస్తూ,తనను కొట్టిన అమ్మను ఇంకా గట్టిగా కౌగలించుకుంటుంది కానీ, దూరంగా జరగదు. ఆ మందలింపు, చిన్న దెబ్బ ఆ బిడ్డకు ఆ సమయాన అవసరం. అలాగే, ఇంకొ చిన్న ఉదాహరణ. బొమ్మలతో ఆనందంగా ఆడుకుంటున్న చిన్నారిని, పాలకి సమయమైందని అమ్మ బలవంతంగా తీసుకుళ్తుంటే, ఆ చిన్నారి కోపంతో ఏడుస్తుంది. ఆ సమయంలో ఆ చిన్నారికి ఆడుకోవడం చాలా ఆనందాన్నిస్తుంది. కానీ, తనకి అవసరం పాలు త్రాగడం...ఈ విషయం ఆ చిన్నారి గుర్తించకున్నా, తనను కంటికి రెప్పలా చూసుకుంటున్న అమ్మకు తెలుసు. చిన్నారి కూడా,ఏడుస్తూ అమ్మనే పట్టుకుంటుంది. అదే చిన్నారి కాస్త పెద్దవగానే, తన ప్రపంచం కాస్త విస్తరించగానే,అమ్మను అర్ధం చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. అమ్మ మీద కోపం చేసుకుంటుంది. అమ్మ చర్యలను ప్రశ్నిచడం మొదలుపెడుతుంది. అలా తన జీవన పోరాటాం మొదలౌతుంది. అమ్మకు సంబంధించినంత వరకూ, ఏమీ తేడా లేదు... ఎప్పట్లానే తన బిడ్డను ప్రేమిస్తూనే ఉంటుంది. వచ్చిన దూరమల్లా బిడ్డ వైపునుంచే. అమ్మను అర్ధం చేసుకోవాలనే తన ప్రయత్నం నుంచే".
(ఇంకా ఉంది)
(Moment of Clarity గురించిన 'కొత్త పాళీ' గారి చర్చ ఈ టపాకు మూలం. దేవుడితొ సంభాషణ అన్న కాన్సెప్ట్ కు ప్రేరణ యండమూరి థ్రిల్లర్, అంతర్ముఖం నవలలు, జిం క్యారీ సినిమా "బ్రూస్ అల్మైటీ". నా మార్గదర్శి శ్రీరాం గారి సాంగత్యంలో నేను నేర్చుకున్న విషయాలకు మరింత స్పష్టత కల్పించునే ప్రయత్నమే ఈ టపా...శ్రీరాం చరణం శరణం ప్రపధ్యే! )
Saturday, April 19, 2008
గీతాంజలి సినిమా
నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, రామంతాపూర్ లో 11 వ తరగతి చదువుతున్నప్పటి విషయం. అప్పుడే నాగర్జున గీతాంజలి సినిమా విడుదలయ్యింది. ఎవ్వరి నోట విన్నా, ఆ సినిమా కబుర్లే. ఎలాగైనా, ఆ సినిమా చూడాల్సిందేనని మా ఫ్రెండ్సందరమూ నిర్ణయించుకున్నాము. కాకపొతే, ఆ సినిమాకెళ్ళడానికి ఒకటే దారి. శనివారం రాత్రి సెకండ్ షో కి దొంగతనంగా హాస్టల్ గోడ దూకి వెళ్ళడమే. ఆ సినిమా తార్నాక లోని ఆరాధన థియేటర్లో ఆడుతోంది.
ఈ విషయం మా సీనియర్లకు తెలిసింది. మేము ఇలా ఏ అవాంతరమూ లేకుండా, ప్రతీ వారమూ సినిమాకెళ్ళడం, వాళ్ళేమో ఒక్కసారి వెళ్ళి పట్టుబడడమూ, మా మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలూ ... అన్నీ కలసి వాళ్ళని కాస్త కుళ్ళుకునేలా చేసాయనుకుంటాను. ఈ సారి మేమెలాగైన పట్టుబడేలా చెయ్యలని వాళ్ళూ ప్లాన్ చేసుకున్నారు.
ఇవేమీ తెలియని మేము ఓ శనివారం రాత్రి, గీతాంజలి సెకండ్ షోకి వెళ్ళిపోయాము. మా హాస్టల్ బిల్డింగ్ పక్కనే ఒక చిన్న జామ తోట ఉండేది. దాని పక్కనే మా డైనింగ్ హాలు ఉండేది. మేము గోడ దూకడానికి వీలుగా డైనింగ్ హాల్ ముందు చిన్న దారి ఏర్పాటు చేసుకున్నాము. అందరూ సాధరణంగా ఇదే దారిని ఉపయోగించేవారు.
మేము అలవాటు ప్రకారం సినిమా చూసి, గోడ దూకి, జామ తోటలోకి వచ్చి చూద్దుముకదా... మా హాస్టల్ తలుపులన్నీ లోపలినుంచి గడియ పెట్టి ఉన్నాయి. మాకు విషయం అర్ధమయ్యెలోపే, ఇంకో వైపునుంచి ఇద్దరు వాచ్ మెన్లు, కుక్కలతో సహా జామ తోట వైపే వేగంగా వస్తూ కనిపించారు. ఒక్క సారిగా మా గుండెలు జారిపోయాయి. హౌస్ మాస్టర్లముందు మా పరేడ్, వారమో రెండు వారాలో సస్పెన్షన్, స్కూల్ అసెంబ్లీలో అనౌన్స్మెంటూ.. అన్ని సీన్లూ మా కళ్ళముందు కదలాడుతుంటే, భయంతో తలా ఒకమూలకు పరిగెట్టి, తోటలొ దాక్కున్నాము.
ఇంతలో, మాలో ఒకడు (జయ కుమార్) ఒక పక్క తెరచిఉన్న కిటికీలోంచి లొపలికి దూరి, హాస్టల్ తలుపులు తెరిచాడు. కాని, లొపలికెలదామంటే వాచ్ మెన్లిద్దరూ అడ్డాంగా ఉన్నారు. మమ్మల్ని పసిగట్టిన కుక్కలు భయంకరంగా అరుస్తున్నాయి.
కాసేపటికి, నేను ధైర్యం తెచ్చుకుని, వాచ్ మెన్ల దగ్గరికెళ్ళి, వాళ్ళ చెతిలో ఇరవై రూపాయలు పెట్టి, ఏదొ కథ చెప్పి, వాళ్ళు తేరుకునేంతలో, లోపలికి తుర్రుమన్నాను. ఇదే అదనుగా మిగతావాళ్ళూ లొపలికొచ్చేసారు.
తరువాత రోజు ఈ విషయం హాస్టల్లొ తెలిసి, మేమందరమూ గొప్ప హీరోలమైపోయాము. మమ్మల్ని ఇరికించడానికి ప్లాన్ చేసిన మా సీనియర్ల మొహంలో కత్తి వేటుకి నెత్తురు చుక్క లేదు.
అయితే, ఆ పిమ్మట చాలా రోజులపాటూ మేము దొంగతనంగా సినిమాకెళ్ళే ధైర్యం చెయ్యలేకపొయామనుకోండి. కానీ, గీతాంజలి సినిమా ప్రస్తావన వచ్చినప్పుడల్లా, ఈ సంఘటన జ్ఞప్తికి వచ్చి, నా బాల్యంలోకి జారిపోతాను!
Wednesday, April 9, 2008
జీవిత పరమార్ధం (కొత్తపాళీ గారి చర్చకు కొనసాగింపు)
జీవితాశయం ఏమిటన్న ప్రశ్న చాల సరళంగా కనిపించినా, ఎంతొ మంది మేధావులను తొలచిన ప్రశ్న. ఇందుకు ఖచ్చితమైన సమధానమేమిటి? ఎవరో అన్నారు... ఆనందంగా ఉండడమే జీవితాశయమని. మరి,ఆనందమంటే అర్ధమేమిటి? ఒకసారి ఆనందం కలిగించిన విషయం, ఇంకోసారి అంతే ఆనందానివ్వలేక పోవచ్చు. బహుశా, అనందానికి పరమావధి ఎమిటంటే, అసలు ఆశయానికే ప్రాముఖ్యం లేకపోవడం. I am sorry if I am sounding meaningless... but its an effort to get clarity for my self.
ఇంకా చెప్పాలంటే, మన జీవితాశయం ఎమిటంటే, అసలు ఆశయం పై ఏమాత్రం కోరిక కలగక పోవడం.
ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం.. నది యొక్క ఆశయమేమిటి? సముద్రంలో కలవడం.. మరి సముద్రం యొక్క ఆశయం? ఎమో స్ఫురించట్లేదు కదూ.. అలాగని, సముద్రానికి గోల్ లేదు అనొచ్చా? కాని, నది కన్నా సముద్రం గొప్పది... ఏ ఆశయమూ లేని సముద్రం, ఒక ఆశయమున్న నది కంటె గొప్పది కదా? ఇక్కడ, నా ఉద్దేశం ఆశయం లేకపోడం గొప్ప అనిచెప్పడం కాదు.. సముద్రానికి ఏ ఆశయమూ అవసరం లేదు..అందుకే అది గొఫ్ఫ!
మనకందరికీ ఎన్నో గోల్స్ ఉంటాయి - మంచి ఉద్యోగం, ఇల్లూ, కారు, డబ్బూ... ఇలా ఎన్నో. ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి - మనమూ & మన ఆశయం. అంటే, మన ఆశయం కంటే మనమే గొప్ప కదా? ఒక చిన్న ఉదాహరణ... వజ్రపుటుంగరం కంటె, దాన్ని ధరించిన వేలు గొప్పది కదా? ఎంత విలువైన వజ్రపుటుంగరమైనా... వేలుకంటే విలువైనది కాలేదు కదా?
ఈ కోణం నుంచి ఆలోచిస్తే, ఆశయమన్నది ఒక ఆభరణం వంటిది. ఆభరణం, ఎంత అంతమైనదీ, ఖరీదైనదీ అయినా, దాన్ని ధరించిన వ్యక్తికంటే విలువైనది కాలేదు. అలాగే, ప్రకృతి మనకు ప్రసాదించిన ఈ జీవితం, మన ఆశయం కంటే విలువైనదీనూ, గొప్పదీనూ. జీవితం యొక్క అతి ముఖ్యమైన ఆశయం, జీవించడం!
జీవించి ఉండడం, పరిపూర్ణమైన ఆరోగ్యంతొ జీవించి ఉండడమే అతి ముఖ్యమైన జీవితాశయం. వేరే, ఇతర ఆశయం అవసరం మనకు లేకపోవడమే ఒక గొప్ప ఆశయం! అంటే, నా ఉద్దెశమిక్కడ, అసలు కోరికలూ, ఆశయాలూ ఉండకూడదని కాదు, వాటి కోసం ప్రయత్నించ కూడదనీ కాదు. అతి ముఖ్యమైన మన జీవితాశయం - జీవించడం పరిపూర్ణమైనందన్న స్పృహతో, ఇతరముల కోసం ప్రయత్నిస్తూ, అందువల్ల కలిగే ఒత్తిడి, ఆశ, నిరాశ, నిస్పృహ ల వల్ల, అసలు జీవించడం మరచి పోకూడదు. ఆశయం కంటే జీవితం గొప్పది.
తిండీ, డబ్బూ, బట్టా, ఇల్లూ... ఇలా ఏ ఆశయమైనా, its for the ultimate goal of life - to be vibrantly alive!
I am very sorry, if I have sounded confusing... but, its an effort to get more clarity for my self.
Monday, April 7, 2008
నివేదన
అనుకోకండా ఈనాడు ఆ క్షణాలు నా కంటపడి నీ ముద్రని చూసినప్పుడు, నేను మరచిపోయిన ప్రత్యేకతలేని రోజుల సుఖ దుఖ ఙాపకాలతో కలిసి అవి దుమ్ములో చెదిరి వుండిపోయినాయని తెలుస్తోంది.
- గీతాంజలి (చలం)
వసంతాన్ని కోల్పోయి మోడువారిన నా జీవనవృక్షాన్ని, నీ కృపారసగౌతమితో మొగ్గతొడిగించి , నా చుట్టూ అలముకున్న తమస్సునూ, దుఃఖాన్నీ, అవమానాన్నీ, ద్వేషాన్నీ, అసూయనూ, సమస్యల్నీ, భ్రమలనూ, భయాలనూ,ఒక్క నీ రాకతో మటుమాయంచేసి, "భగవంతుని పరీక్ష నెగ్గాలంటే మన నిరీక్షణా వైశాల్యం అనంతంగా ఉండాల"నే సత్యాన్ని వంటబట్టించిన తేజోమూర్తివైన నిన్ను వర్ణిచాలనుకోవడం వృధా ప్రయత్నమే.
కొనియాడ వలెనన్న కోర్కేయే కాని
భాషలోనట్టి పలుకులే లేవు;
తెలిసికోవలెనన్న దీక్షయే కాని
బుద్ధి కంతటి సుప్రభోధమే లేదు;
వర్ణింపవలెనన్న వాంచయే కాని
కవితకంతటి భావ గరిమయే లెదు.
- శ్రీ వేంకట పార్వతీశ్వర కవులు (ఏకాంతసేవ)
కన్నీటిచుక్కే భగవంతుని వీక్షిచడానికుపయోగపడే భూతద్దమనే సూక్ష్మాన్నీ తెలియపరచిన వాడివీ, పసిపాపల కనురెప్పల చప్పుళ్ళలో జీవనసంద్రాన్ని దాటించే 'గీత'ను వినిపించిన వాడవూ, మాయనూ మమతనూ ఎరుక పరచి, నన్ను నాకు ఎరుగించినవాడవూ,అనంతుడవూ, ఆత్మీయుడవూ,అయిన నిన్నెలా స్తుతించనూ?
విషయశోధనలోపడి, సాధనను మరచిన నాజీవితంలోకి నిశబ్ధంగా ప్రవేశించి, "చిరునవ్వు చిందించండానికి దెవుడిచ్చిన అవకాశమే ఈ జీవితమ"నే సత్యాన్నీ, నిత్యాన్నీ విశిదీకరించి, ప్రపుల్లమైన శరత్పూర్ణిమ వంటి నీ ప్రేమతో, తమోభరితమైన నా మనస్సును వెలిగించిన నిన్నెలా కీర్తించనూ?
నా అశక్తతనూ, అఙానాన్నీ మన్నించు తండ్రీ....నా చేయి విడువకు. నా యీ స్వేచ్చకూ, అనందాలకూ మూలకారణం నీవనే స్ఫురణ క్షణమైనా మరుగు పరచకు. నేను పోగొట్టుకొనడానికి వీలుపడని నమ్మకాన్నీ, విశ్వాశాన్నీ నాకివ్వు. నా కష్టాలలో, సుఃఖాలలో, నవ్వులలో, రోదనలో,నువ్వు నావెంటే వున్నావన్న ఎరుక నానుంచి మరుగు పరచకు.
Thursday, April 3, 2008
ఉదయ రాగం...
నీ కృపారస కౌముదిలో కేరింతలు కొడుతూ
నిన్ను మాత్రం మరచితిని!
నీ ప్రేమామృత ధారను గ్రోలుచూ
నీ ఉనికిని గురుతించనైతిని!
ప్రేమతో చాచిన నీ చేతిని విదిలించుకుని
ఆకర్షణల ఎండమావుల వెంట పరుగెట్టి,
రాయి తగిలి, కాలి వేలు చిట్లి, ఏడుస్తూ నే కూర్చుంటే,
నన్నూరడించి, లాలించి, చేయి పట్టుకుని నడక నేర్పి,
ప్రపంచాన్ని అందంగా నా ముందావిష్కరించి
మాయ పరదాల చాటున మాయమౌతావు!
ప్రపంచాన్ని చూసి మైమరచిన నేను
ఒక్క సారిగ నువ్వు లేవని గుర్తించి,
ఏడుస్తూ నీకొసం వెతుకుతుంటే,
నీ చిరునవ్వుల వెలుగు నా కన్నీటి చుక్కపై పడి
ఇంద్రధనుస్సై మెరుస్తుంది!
అప్పుదు గ్రహిస్తాను,నీ ఒడిలోనే ఉన్నానని…..
-:x:-
నా జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘఠనతో ముడిపడిన ఈ కవిత, నాకో కొత్త పధాన్నీ, ధృక్పధాన్నీ అందించిన ఈ కవిత, నా 'ఇష్టం'...నా కిష్టం!
వ్యాకరణ దోషాలుంటే చదువర్లు మన్నించగలరు.
Monday, March 31, 2008
నా గురించి కాస్త...
నా ముప్పై నాలుగేళ్ళ జీవన గమనాన్ని ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే, పంచుకోవాలనుకునే సంఘఠనలూ, అనుభవాలూ ఎన్నో! నా గురించి నేను వ్రాసుకునేంత గొప్పవాడిని కాకపోయినా, ఆత్మావలోకనానికీ, పునస్సమీక్షకు ఇది ఒక అవకాశంగా భావిస్తున్నా.
పదమూడేళ్ళకే హస్టల్లో ఉండాల్సి రావడం, అదీ కాళహస్తి జిల్లా పరిషత్ పాఠశాల నుంచి ఒక్కసారిగా హైదరబాదు పబ్లిక్ స్కూలులో పడడం, అందునుంచి కలిగిన గజిబిజి గందరగోళం నుంచి బైటకు రావడానికి నాకు ముఖ్య ఆలంబన, నా మిత్రద్వయం - జయకుమార్ & వెంకట్. ఐతే, దాదాపు ఒకే ప్రాంతం వాళ్ళమైన మాకు చుక్కానిలా నిలచినవి 'యండమూరి' వారి రచనలు.
గోదావరి గలగలనూ, కోనసీమ కొబ్బరాకునూ, వ్యక్తిత్వాన్నీ, దాని అవసరాన్నీ, ప్రేమనూ, ప్రేమించడాన్నీ, ప్రేమింపబడడాన్నీ, ముఖ్యంగా ప్రెమించడానికి కావలసిన అర్హతనూ, ప్రేమకూ ఆకర్షణకూ తేడానూ, మనిషి మనసునూ, దాని లోతునూ, హిపోక్రసినీ, ధైర్యాన్నీ, లౌక్యాన్నీ, కాస్త ఙానాన్నీ, నమ్మకాన్నీ, దాని ఆవస్యకతనూ సుతిమెత్తగా, నిష్కర్షగా మాకు తెలియజెప్పింది యండమూరి నవలలే. ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే, మా జీవితాలలో ప్రస్ఫుటంగా కనిపించే ఒక లక్షణం, సెల్ఫ్ పిటీ కి లోను కాకపోవడం మరియూ ఆశావహ ధ్రుక్ఫధం.
మా జీవితాలలొ అత్యంత ధుర్భర పరిస్తితులలో కూడా (surprisingly, we three had seemingly complex problems to battle with!), మేము సెల్ఫ్ పిటీ ను దరి చేర్చలేదంటే, అందుకు యండమూరి రచనలు మాలో అంతర్లీనంగా నింపిన ఆత్మ స్థైర్యమే కారణం.
ఆనందో బ్రహ్మ లోని 'యాజి' కానీ, రాక్షసుడు లోని 'అతడు' కాని, భార్యా గుణవతి... లోని 'సౌదామిని' పాత్ర కాని, అన్నీ నొక్కి వక్కాణించేది - వ్యక్తిత్వాన్ని, దాని ఆవస్యకతనూ, ఔన్నత్యాన్నీనూ. యండమూరి వ్యకిత్వ వికాస పుస్తకాలను వ్రాయడానికి మునుపే, ఆ విషయాలను, తన నవలా పాత్రల ద్వారా, విలక్షణమైన తన రచనా శైలితో విశిదీకరించారు...
అలాగే, ఆలోచననూ, ఆలోచించడాన్నీ కూడ వంటబట్టిచంది యండమూరే.
కానీ, యండమూరితో వచ్చిన చిక్కేమిటంటే, ఆ విలక్షణ శైలి వెనుక పడి, పాత్రల ఔన్నత్యం అంతగా ఎలివేట్ అవ్వదు. అలాగే, విమర్శకుల దాడి, కాపీ అన్న చర్చ, కథనం, అందులో సస్పెన్స్ కూడా ఒక కారణమే! ఏది ఏమైనా కానీ, పడవలాంటి కారులో తిరిగే అందమైన గొప్పింటి అబ్బాయి, ఒక పేదింటి అమ్మాయి మధ్య ప్రేమలో, కాకుంటే, అబలల కన్నీటి ప్రవాహంలో పడి చిక్కుక్కున్న తెలుగు నవలకు కొత్త దిశా నిర్దేశం చేసినవాళ్ళలో యండమూరి ఒకరు.
This is not a review on Yandamuri's writings. But, my story, without an acknowledgement to his contribution would be grossly incomplete and deficient.
Sunday, March 30, 2008
ఇదే నా మొదటి వ్రాత.....
వందనాలు..!!!